Kakani Govardhan Reddy: తప్పుదారి పట్టిస్తారా
ABN, Publish Date - May 17 , 2025 | 04:33 AM
క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసులో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాకాణి గోవర్ధన్‌రెడ్డికి నెగ్గలేదు. పిటిషన్‌లో తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారని కోర్టు మండిపడి, ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది.
కాకాణిపై సుప్రీం ఆగ్రహం
క్వార్ట్జ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది
అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేం
సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ
ముందస్తు బెయిల్‌కు నిరాకరణ
న్యూఢిల్లీ, మే 16 (ఆంధ్రజ్యోతి): క్వార్ ్ట్జ ఖనిజం అక్రమ తవ్వకాల కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం నిరాకరించింది. తనపై కేసుల్లేవంటూ కోర్టునే తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తంచేసింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. క్వార్ ్ట్జ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి తరలించారంటూ నమోదు చేసిన కేసు, గిరిజనులను బెదిరించి ఊర్లు ఖాళీ చేయించారనే ఫిర్యాదుతో ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం కాకాణి తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు ఈ కేసులపై ఆయన ఈ నెల 13న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ అరవింద్ కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. కాకాణి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే, ఏపీ ప్రభుత్వం తరఫున ప్రేరణ హాజరయ్యారు. ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా పెట్టిన కేసేనని దవే తెలిపారు. హైకోర్టు డివిజన్ బెంచ్ వద్దే తేల్చుకోవచ్చు కదా.. ఇక్కడి వరకు ఎందుకు వచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. డివిజన్ బెంచ్ కేసును జూన్ 16కు వాయిదా వేసిందని, అందుకే ఇక్కడకు వచ్చామని దవే బదులిచ్చారు. తనపై గతంలో ఎటువంటి నేరారోపణలూ లేవని, అటువంటి కేసులేమీ తనపై నమోదు కాలేదని కాకాణి కోర్టును తప్పుదారి పట్టించేలా పిటిషన్‌లో పేర్కొన్నారని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది ప్రేరణ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కేసులు ఉన్నాయని మీరెలా చెబుతున్నారని కోర్టు ప్రశ్నించింది. ఆయనే స్వయంగా 2024 ఎన్నికల అఫిడవిట్‌లో కేసుల వివరాలు స్పష్టం చేశారంటూ ప్రేరణ సదరు అఫిడవిట్‌ను ధర్మాసనం ముందుంచారు. దానిని పరిశీలించిన కోర్టు.. తమను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారంటూ కాకాణిపై మండిపడింది. కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, వాస్తవాలేమిటో స్పష్టత రావాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే కొట్టివేయొద్దని.. ఉపసంహరించుకుంటామని దవే విజ్ఞప్తి చేయగా.. ధర్మాసనం అంగీకరించింది.
ఇకనైనా లొంగిపోతారా?
నెల్లూరు, మే 16 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో క్వార్ట్జ్ కేసులో కాకాణికి అన్ని దారులూ మూసుకుపోయాయని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఏడు వారాలుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుపై పెట్టుకున్న చివరి ఆశ కూడా ఆవిరవడంతో అజ్ఞాతం వీడి లొంగిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నెల్లూరు పోలీసులు మూడు సార్లు నోటీసులిచ్చినా ఆయన రాలేదు. దీంతో దేశం వదిలి వెళ్లడానికి వీల్లేకుండా అన్ని విమానాశ్రయాలకూ పోలీసులు లుకవుట్ నోటీసులు పం పారు. ఇదే సమయంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆయన కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News
Updated Date - May 17 , 2025 | 08:40 AM