ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Student Enrollment Decline: అక్కడా లేరు.. ఇక్కడా లేరు

ABN, Publish Date - Jul 02 , 2025 | 06:41 AM

విద్యార్థులు ఇటు ప్రభుత్వ పాఠశాలల్లోనో, అటు ప్రైవేటు పాఠశాలల్లోనో ఎక్కడో ఒక్కచోట చదవాలి. కానీ అక్కడా, ఇక్కడా రెండు చోట్లా కనిపించకపోతే వారు ఎక్కడికి వెళ్లినట్లు? 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమై....

  • బడుల్లో 3.07లక్షల మంది విద్యార్థుల తగ్గుదల

  • నమోదు కాకుండా ఇంతమంది ఏమైపోయారు?

  • ప్రభుత్వ, ప్రైవేటు మేనేజ్‌మెంట్లలో ఒకే సరళి

  • ఒకటి, ఐదు,ఆరు తరగతుల్లో భారీగా వ్యత్యాసం

  • ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లోనూ అదే పరిస్థితి

  • ఆన్‌లైన్‌ నమోదులో ఏదైనా సమస్య తలెత్తిందా?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

విద్యార్థులు ఇటు ప్రభుత్వ పాఠశాలల్లోనో, అటు ప్రైవేటు పాఠశాలల్లోనో ఎక్కడో ఒక్కచోట చదవాలి. కానీ అక్కడా, ఇక్కడా రెండు చోట్లా కనిపించకపోతే వారు ఎక్కడికి వెళ్లినట్లు? 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమై ఇరవై రోజులు గడిచిన తర్వాత కనిపిస్తున్న విద్యార్థుల నమెదు గణాంకాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు అన్ని రకాల మేనేజ్‌మెంట్లలోనూ విద్యార్థుల సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. 2024-25 విద్యా సంవత్సరంలో అన్ని మేనేజ్‌మెంట్లలో కలిపి 1 నుంచి 10 తరగతుల విద్యార్థులు 68,29,347 మంది ఉన్నారు. ఈ ఏడాది జూన్‌ 30 వరకు 65,21,498 మంది పాఠశాలల్లో చేరారు. ఇంకా 3,07,849 మంది బడుల్లో చేరాల్సి ఉంది. ఒకటో తరగతిలో కొత్తగా చేరేవారు తగ్గినా పిల్లల సంఖ్య తగ్గినట్లుగా భావించవచ్చు. కానీ గతేడాది చదివి తర్వాతి తరగతికి వెళ్లాల్సిన (క్లాస్‌ ప్రమోషన్‌) విద్యార్థుల నమోదు కూడా తక్కువగానే ఉంది. ఒకటో తరగతిలో 1,47,679 మంది, నాలుగో తరగతిలో 36,444 మంది, ఐదో తరగతిలో 1,19,980 మంది, ఆరో తరగతిలో 1,07,800 మంది, ఎనిమిదో తరగతిలో 22,485 మంది విద్యార్థులు తక్కువగా నమోదయ్యారు. కొన్ని తరగతుల్లో గతేడాది కంటే విద్యార్థుల సంఖ్య పెరిగింది. రెండో తరగతిలో 61,074 మంది, మూడో తరగతిలో 1,175 మంది, ఏడో తరగతిలో 11,726 మంది, తొమ్మిదో తరగతిలో 27,721 మంది, పదో తరగతిలో 24,843 మంది పెరిగారు. మొత్తంగా 4,34,388 మంది తగ్గితే, 1,26,539 మంది పెరిగారు. కాగా ఆగస్టు వరకు ఎన్‌రోల్‌మెంట్‌ కొనసాగుతుంది. ఒకటో తరగతిలో చేర్చే పిల్లలను తల్లిదండ్రులు కొంత ఆలస్యంగా చేర్పిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఒకటో తరగతిలో చేరేవారికి కూడా తల్లికి వందనం పథకం అమలుచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఒకటో తరగతి అడ్మిషన్లు వేగంగా జరుగుతాయని భావించారు. కానీ, అవి కూడా తగ్గాయి.

అన్ని మేనేజ్‌మెంట్లూ అంతే...

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయే ధోరణి గత కొన్నేళ్లుగా కనిపిస్తోంది. కానీ ఈ ఏడాది ప్రైవేటు మేనేజ్‌మెంట్లలో పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటోతరగతిలో 1,97,482 మంది చేరితే, ఎయిడెడ్‌లో 3,828 మంది, ప్రైవేటులో 3,38,490 మంది చేరారు. కానీ గతేడాది విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో 70,700 మంది, ఎయిడెడ్‌లో 2,098 మంది, ప్రైవేటులో 74,881 మంది తగ్గారు. నాలుగో తరగతి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో స్వల్పంగా పెరిగితే, ప్రైవేటులో తగ్గిపోయారు. మేనేజ్‌మెంట్లవారీగా చూస్తే... ప్రభుత్వంలో 2,30,536 మంది, ఎయిడెడ్‌లో 8,479 మంది, ప్రైవేటులో 68,834 మంది తగ్గారు.

ప్రమోషన్‌ సక్రమంగా జరగలేదా?

పాఠశాలల్లో అడ్మిషన్లు వేర్వేరుగా ఉంటాయి. కొత్తగా బడిలో చేరే ఒకటో తరగతి విద్యార్థుల నమోదు తక్కువగా ఉంటుంది. కానీ అప్పటికే బడుల్లో ఉన్న విద్యార్థులు ఆ తర్వాతి తరగతికి ఆటోమేటిక్‌గా ప్రమోట్‌ అవుతారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం కొత్త బడుల విధానాన్ని తీసుకొచ్చింది. అలాగే ప్రైవేటు విద్యాలయాల్లో విద్యార్థులను చేర్చుకున్నా వారిని ఇంకా ఆన్‌లైన్‌లో నమోదుచేయలేదనే వాదన వినిపిస్తోంది. ఒక బడి నుంచి మరో బడికి మారిన విద్యార్థుల నమోదులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఐదు వరకు ప్రాథమిక పాఠశాలలో చదివి, ఆరో తరగతి కోసం ఉన్నత పాఠశాలలో చేరే విద్యార్థుల నమోదు ఇంకా వేగవంతం కావాల్సి ఉంది. అలాగే ఒక బడి నుంచి మరో బడికి మారే విద్యార్థులనూ ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అలా ఆన్‌లైన్‌లో నమోదు కాకపోతే ఆ విద్యార్థులు ‘తల్లికి వందనం’ పథకం నగదు కోల్పోయే పరిస్థితి ఉంది. ఇంటర్‌ ఫస్టియర్‌లోనూ సంఖ్య తక్కువగానే ఉంది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఫస్టియర్‌లో గతేడాది 1,27,270 మంది ఉంటే, ఈ ఏడాది 99,323 మంది మాత్రమే చేరారు. ఇక ఎయిడెడ్‌లో 1,331 మంది, ప్రైవేటులో 62,123 మంది తగ్గారు.

Updated Date - Jul 02 , 2025 | 06:43 AM