RTE Fee Ratings: రేటింగ్ ఆధారంగా విద్యాహక్కు ఫీజులు
ABN, Publish Date - May 08 , 2025 | 04:42 AM
ప్రైవేటు పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఆధారంగా ‘విద్యాహక్కు’ ఫీజులు నిర్ణయించేందుకు విద్యాశాఖ కొత్త ప్రతిపాదన తెచ్చింది. మౌలిక సదుపాయాల ఆధారంగా ఒక స్టార్ నుంచి నాలుగు స్టార్ల వరకు స్కూళ్లను వర్గీకరించి రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు ఫీజులు నిర్ణయించనున్నట్లు తెలిపింది.
ప్రైవేటు పాఠశాలలకూ స్టార్ రేటింగ్
కనీసం రూ.8 వేలు.. గరిష్ఠం రూ.15వేలు
పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన
అమరావతి/విజయవాడ(మొగల్రాజపురం), మే 7(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం ద్వారా అడ్మిషన్లు పొందే విద్యార్థుల ఫీజులపై ప్రభుత్వం కొత్త ప్రతిపాదన పెట్టింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఆధారంగా స్టార్ రేటింగ్ ఇచ్చి, అందుకు అనుగుణంగా ఫీజులు నిర్ణయించాలని భావిస్తోంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు బుధవారం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఈ ప్రతిపాదన పెట్టారు. గత వైసీపీ ప్రభుత్వం మూడు రకాల ఫీజులు అమలుచేసింది. పట్టణ ప్రాంతాల్లో రూ.8 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6500, గిరిజన ప్రాంతాల్లో రూ.5100 చొప్పున ఫీజులు నిర్ణయించింది. ఆ ఫీజులు మరీ తక్కువగా ఉన్నాయని ఫీజులు పెంచాలని అప్పటి నుంచీ ప్రైవేటు పాఠశాలల యాజయాన్యాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించింది.
పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను 18 రకాలుగా వర్గీకరించి వాటి ఆధారంగా ఇటీవల స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలకు కూడా అలాగే స్టార్ రేటింగ్ ప్రకటించారు. 95 పాఠశాలలు ఒక స్టార్, 3,420 పాఠశాలలు రెండు సార్లు, 5,730 పాఠశాలలు మూడు స్టార్లు, 708 పాఠశాలలు నాలుగు స్టార్లు సాధించాయి. ఫైవ్ స్టార్ సాధించిన పాఠశాల ఒక్కటి కూడా లేదు. ఒక స్టార్ ఉంటే రూ.8వేలు, రెండు స్టార్లు ఉంటే రూ.9వేలు, మూడు స్టార్లు ఉంటే రూ.10 వేలు, నాలుగు స్టార్లు ఉంటే రూ.12 వేలు, ఐదు స్టార్లు ఉంటే రూ.15వేలు చొప్పున సగటు ఫీజులు నిర్ణయించాలని పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించింది. తరగతుల ఆధారంగా ఫీజులు మారుతాయి. కాగా ఈ ఫీజులు సరిపోవని, ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి ఎంత ఖర్చు చేస్తున్నారో అంత ఫీజు చెల్లించాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యాహక్కు చట్టప్రకారం ప్రైవేట్ పాఠశాలలు ఇస్తున్న 25శాతం అడ్మిషన్లలో అనర్హులను గుర్తించే అధికారాన్ని ఆయా పాఠశాలల యాజమాన్యాలకు ఇచ్చారని ఫెడరేషన్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్స్ రాష్ట్ర ప్రతినిధి కె.తులసీ ప్రసాద్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆపరేషన్ సింధూర్‌పై చిరంజీవి ట్వీట్
ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్..
For More AP News and Telugu News
Updated Date - May 08 , 2025 | 04:42 AM