Prakasam District : తివేగానికి ఆరుగురు బలి
ABN, Publish Date - May 24 , 2025 | 03:55 AM
ప్రకాశం జిల్లాలో అతివేగంతో ఇన్నోవా లారీని ఢీకొట్టి, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు పోయారు. ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.
రాంగ్ రూట్‌లో వచ్చి లారీని ఢీకొట్టిన కారు
ఒకే కుటుంబంలో ఆరుగురు దుర్మరణం
ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కొమరోలు, బాపట్ల రూరల్, మే 23 (ఆంధ్రజ్యోతి): అసలే అతివేగం.. ఆపై తప్పిన కంట్రోల్.. దీంతో ఇన్నోవాకారు చూస్తుండగానే ఎదురుగా వస్తున్న లారీని మార్జిన్ దాటి వచ్చి మరీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా.. ఇద్దరు చిన్నారులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన ప్రకాశంజిల్లా కొమరోలు మండలం తాటిచర్ల మోటు పెట్రోలు బంకు సమీపంలో అమరావతి-కడప రహదారిపై శుక్రవారం జరిగింది. బాపట్ల జిల్లా స్టూవర్టుపురం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన గజ్జల అంకాల్ (40), గజ్జల నరసింహ (23), మొగిలి భవాని (20), గజ్జల జోసఫ్ (25), కర్రెద్దుల దివాకర్ (24), బచ్చుల సన్నీ (27)తోపాటు మొగిలి భవానీకి చెందిన ఇద్దరు పిల్లలు.. మొత్తం 8 మంది ఇన్నోవా లో గురువారం వ్యక్తిగత పనిమీద డోన్‌కు వెళ్లారు. అక్కడ పని పూర్తికాగానే శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో తాటిచర్ల మోటు సమీపంలోని పెట్రోలు బంకు వద్ద.. రోడ్డుకు ఎడమవైపు వెళ్లాల్సిన ఇన్నోవా కారు.. అతివేగంగా రోడ్డుకు కుడివైపునకు దూసుకొచ్చి మార్జిన్ కూడా దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఆ సమయంలో కారు 120 కి.మీ. వేగంతో ఉంది. దీంతో కారు పూర్తిగా లారీ కింద ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న గజ్జల అంకాల్, గజ్జల నరసింహ, మొగిలి భవాని, గజ్జల జోసఫ్, కర్రెద్దుల దివాకర్, బచ్చుల సన్నీ అక్కడికక్కడే మృతిచెందారు. భవాని పిల్లలు శిరీషా, సిద్దు (జీతన్) గాయాలతో బయటపడ్డారు. పోలీసులు చిన్నారులను గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. జీతన్ పరిస్థితి విషయమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచారు.
సీఎం చంద్రబాబు, లోకేశ్ దిగ్ర్భాంతి
ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉన్న ఆయన ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా, ఈ ప్రమాదంపై మంత్రి లోకేశ్ కూడా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని తెలిపారు.
Updated Date - May 24 , 2025 | 03:56 AM