Singarayakonda Civil Judge: సత్వర న్యాయం అందించడమే లక్ష్యం
ABN, Publish Date - May 05 , 2025 | 05:29 AM
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో సివిల్ జడ్జి కోర్టు ప్రారంభోత్సవం జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్‌రావు, తదితర న్యాయమూర్తులు సత్వర న్యాయం అందించడం ముఖ్యమని అన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్‌రావు
సింగరాయకొండ, మే 4 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు, కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే న్యాయస్థానాల ప్రధాన లక్ష్యమని హైకోర్టు న్యాయమూర్తి, ప్రకాశం జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి జస్టిస్ తర్లాడ రాజశేఖర్‌రావు అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఆదివారం సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టు ప్రారంభోత్సవం జరిగింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖర్‌రావు, జస్టిస్ కే. మన్మథరావు, జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్, జస్టిస్ వై.లక్ష్మణరావు పాల్గొన్నారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయాధికారి ఏ.భారతి అధ్యక్షతన జరిగిన సభలో జస్టిస్ రాజశేఖర్‌రావు మాట్లాడారు. బార్ అసోసియేన్ సభ్యులు లక్ష్యానికి అనుగుణంగా, కలిసికట్టుగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నూతన సివిల్ జడ్జి కోర్టుకు రెగ్యులర్ న్యాయాధికారిని నియమించడానికి కృషి చేస్తానని తెలిపారు. సింగరాయకొండవాసి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు మాట్లాడుతూ సింగరాయకొండలో కోర్టు ఏర్పాటు చేయడం తన చిరకాల కోరిక అని, ఇప్పుడు అది ఇప్పుడు తీరిందని ఆనందం వ్యక్తం చేశారు.
జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ బార్ అసోసియేషన్ సభ్యులు, జ్యుడీషియల్ అధికారులు బాధ్యతయుతంగా పనిచేయాలని సూచించారు. జస్టిస్ డాక్టర్ వై.లక్ష్మణరావు మాట్లాడుతూ కోర్టుకు రెగ్యులర్ జ్యుడీషియల్ అధికారిని, సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు కృషిచేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్‌రావును కోరారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్ తదితరులు ప్రసంగించారు.
Updated Date - May 05 , 2025 | 05:29 AM