ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

YS Sharmila: ఆలీబాబా 40 దొంగల మాదిరిగా జగన్‌ తీరు

ABN, Publish Date - Jun 20 , 2025 | 04:12 AM

మాజీ సీఎం జగన్‌ తీరు ఆలీబాబా 40 దొంగల మాదిరిగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. దొంగ ఎక్కడైనా దొంగతనం చేసింది తానేనని ఒప్పుకుంటాడా అని ప్రశ్నించారు.

  • దొంగతనం చేసింది తానేనని దొంగ ఒప్పుకొంటాడా?

  • ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా నాపై నిఘా పెట్టారు

  • ఇది నా వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడమే

  • ట్యాప్‌ అయిన నా ఆడియో వైవీ దగ్గర ఉంది

  • ఆయన మా ఇంట్లో దాన్ని నాకు వినిపించారు

  • ఆయన్ను విచారించి నిజాలు నిగ్గు తేల్చాలి

  • ‘సత్తెనపల్లి’ పర్యటనలో ఇద్దరి మృతికి బాధ్యులెవరు?

  • మోదీ దత్తపుత్రుడనా జగన్‌ బలప్రదర్శనల్ని అడ్డుకోవట్లేదు

  • ప్రతిపక్ష హోదా దక్కని వైసీపీ వారికి ఆంక్షలు వర్తించవా?

విజయనగరం/శ్రీకాకుళం, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి), జూన్‌ 19: మాజీ సీఎం జగన్‌ తీరు ఆలీబాబా 40 దొంగల మాదిరిగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. దొంగ ఎక్కడైనా దొంగతనం చేసింది తానేనని ఒప్పుకుంటాడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన జిల్లాల వారీ పర్యటనలో భాగంగా గురువారం ఆమె విజయనగరంలో పర్యటించారు. సాయంత్రం శ్రీకాకుళంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలతో సమావేశం అనంతరం షర్మిల విలేకరులతో మాట్లాడారు. ‘ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా నాపై నిఘా పెట్టారు. నేను ఎవరెవరిని కలుస్తున్నానో ముందే తెలుసుకున్నారు. నాకు మద్దతు ఇవ్వకుండా పెద్ద నాయకులను ఆపేశారు. ఇదంతా ట్యాపింగ్‌ ద్వారా చేసిన కుట్రే. ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం నా వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడమే’ అంటూ జగన్‌పై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైవీ సుబ్బారెడ్డి గతంలో మా ఇంటికి వచ్చారు. ఫోన్‌ ట్యాప్‌ చేసిన ఆడియో ఒకటి వినిపించారు. ఇదే రుజువు.. ఇదే నిదర్శనం. మా ఇంట్లో కూర్చుని నాకే వినిపించారు కాబట్టే చెబుతున్నా.. నేనే నా చెవులారా విన్నా... బైబిల్‌ పైన, నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నా. నా ఫోన్‌ ట్యాపింగ్‌ వాయిస్‌ నేను విన్నా.. ఇదే నిజం.

కాంగ్రెస్‌ నేతలకేనా ఆంక్షలు?

‘ప్రజా సమస్యలపై పోరాటం చేసే కాంగ్రెస్‌ పార్టీపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. ప్రధాని మోదీకి జగన్‌ దత్తత పుత్రుడు. అందుకే ఆయన రాష్ట్రంలో యథేచ్ఛగా బలప్రదర్శన చేసి ఆంక్షలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకోవడం లేదు’ అని షర్మిల ఆరోపించారు. తాము రాజధాని మీద పోరాటం చేస్తే గృహనిర్బంధం చేశారని, స్టీల్‌ ప్లాంటు కోసం దీక్షలు చేస్తే భగ్నం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ పార్టీకి లేని ఆంక్షలు తమకెందుకని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ పరామర్శల పేరిట యాత్రలు చేస్తున్నా వారికి ఆంక్షలు వర్తించవా అని ప్రశ్నించారు. జగన్‌ బలప్రదర్శనలో ఇద్దరు కార్యకర్తలు మరణించారని, దీనికి బాధ్యులెవరని నిలదీశారు. ‘సత్తెనపల్లి నియోజకవర్గంలో జగన్‌ పర్యటనకు వంద మందికి అనుమతి ఇచ్చినా, వేల మంది ఎలా వచ్చారు? జగన్‌ వద్ద బాగా డబ్బులున్నాయనా? పోలీసులను సైతం కొనుక్కోగలడానా? పోలీసు శాఖ, ఇంటెలిజెన్స్‌ ఎందుకు చూస్తూ ఉండిపోయాయి. బీజేపీతో వైసీపీకి ఆక్రమ పొత్తు ఉంది. అందుకే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు’ అని షర్మిల ధ్వజమెత్తారు. సూపర్‌ సిక్స్‌ గురించి.. ప్రత్యేక హోదా గురించి.. రాజధాని, పోలవరం పనుల గురించి ప్రభుత్వాన్ని నిలాదీయాల్సింది పోయి.. బెట్టింగులు వేసి చనిపోయిన వారి విగ్రహాలు కట్టడం, అవిష్కరించడం వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జగన్‌ నైజానికి నిదర్శనమన్నారు.

ట్యాపింగ్‌ చేయాల్సిన అవసరం మాకేంటని ఇప్పుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. సుబ్బారెడ్డి చేతిలో ఆ ఆడియో ఎందుకు ఉంది..? ఆయనే సమాధానం చెప్పాలి. ఆనాడు ఆయనతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఆస్తుల విషయంలో కుట్రలు పన్ని ఆయనతో జగన్‌ అబద్ధాలు చెప్పించారు. అప్పటినుంచి నాకూ, సుబ్బారెడ్డికి మాటలు లేవు. అప్పట్లో కేసీఆర్‌, జగన్‌ చేసినవి నీచ రాజకీయాలు. అందుకే నా ఫోన్‌ ట్యాప్‌ చేశారు. తండ్రి లాంటి సుబ్బారెడ్డే.. నాకు స్వయంగా వినిపిస్తే నేనెంత బాధపడి ఉంటాను. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోయాకే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఒకవేళ అక్కడ కేసీఆర్‌, ఇక్కడ జగన్‌ వచ్చి ఉంటే ఇదంతా వెలుగులోకి వచ్చేదే కాదు. సీఎం చంద్రబాబుకి అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం, ఆయన స్ర్కిప్ట్‌ చదవాల్సిన అవసరం నాకు లేదు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై విచారణ జరగాలి. ఆ ఆడియో ఎలా వచ్చిందనే దానిపై సుబ్బారెడ్డిని కూడా విచారణకు పిలవాలి. నా ఫోన్‌ మాత్రమే అనుకున్నా.. ఇప్పుడు తెలుస్తోంది వందలాది మంది ఫోన్‌లు ట్యాప్‌ అయ్యాయని. వాళ్లందరికీ న్యాయం జరగాలి’ అని షర్మిల పేర్కొన్నారు.

Updated Date - Jun 20 , 2025 | 04:12 AM