AP Civil Supplies Scam: టెండర్లు లేకుండానే బియ్యం రవాణా
ABN, Publish Date - May 25 , 2025 | 04:36 AM
టెండర్లు లేకుండా బియ్యం రవాణా చేసేందుకు ఏజెన్సీలను నియమించిన పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి రూ.21 కోట్ల నష్టం కలిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, హాస్టళ్లకు బియ్యం సరఫరాలో ఈ వ్యవహారం కొనసాగుతోంది.
పాఠశాలలు, వసతిగృహాలకు సరఫరా
వైసీపీ నాటి విధానాన్నే కొనసాగిస్తున్న పౌరసరఫరాల శాఖ
ప్రభుత్వానికి ఏడాదికి రూ.21 కోట్ల నష్టం
(భీమవరం-ఆంధ్రజ్యోతి)
బియ్యం రవాణాకు టెండర్లు పిలవకుండానే పౌర సరఫరాల కార్పొరేషన్ ఏజన్సీలను ఖరారు చేసింది. వైసీపీ హయాంలో అనుసరించిన విధానాన్నే ఇప్పుడూ కొనసాగిస్తోంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు పెద్దమొత్తంలో గండి పడుతోంది. గోదావరి జిల్లాలతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా ఐదు ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించింది. ప్రధానంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ప్రభుత్వ హాస్టళ్లకు నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. వీటిని ప్రత్యేకంగా ప్యాకింగ్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాలోనూ ప్యాకింగ్ యూనిట్‌లు పెట్టారు. కొన్నిచోట్ల ప్యాకింగ్ అవ్వడం లేదు. పొరుగున ఉన్న జిల్లాలో ప్యాకింగ్ చేసి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి పాఠశాలలకు, హాస్టళ్లకు సరఫరా చేస్తారు. ప్యాకింగ్ యూనిట్ల నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు రవాణా, ప్యాకింగ్ చేయడానికి టెండర్లు పిలవకుండానే ఏజన్సీలను ఖరారు చేశారు. పీడీఎస్ బియ్యం రవాణాకు సవాలక్ష నిబంధనలు అమలు చేస్తున్న పౌర సరఫరాల కార్పొరేషన్ ఇక్కడ మాత్రం.. ప్యాకింగ్, రవాణా కూడా వ్యాపార ఏజన్సీలకే అప్పగించింది. దీనికి అధిక మొత్తంలో ధరను నిర్ణయించింది. గోదావరి జిల్లాలతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా పది వేల టన్నుల బియ్యాన్ని పాఠశాలలు, హాస్టళ్లకు ప్రభుత్వం సరఫరా చేస్తోంది. పౌర సరఫరాల కార్పొరేషన్ ఈ బాధ్యతను నిర్వహిస్తోంది. ప్యాకింగ్ యూనిట్‌ల వద్ద ఉన్న గోదాములకు సన్న బియ్యాన్ని స్టేజ్-1 కాంట్రాక్టర్లు రవాణా చేస్తున్నారు. అవి 50 కిలోల బ్యాగుల్లో ఉండగా.. వాటిని 25 కిలోలుగా మార్చి ప్యాకింగ్ చేయడంతోపాటు, ఎంఎల్‌ఎస్ పాయింట్‌లకు తరలించే బాధ్యతను ఏజన్సీలకు అప్పగించారు.
క్వింటాల్‌కు సగటు ధర రూ.300
జిల్లాల్లో రవాణాకు దూరాన్ని బట్టి క్వింటాల్‌కు కనిష్ఠంగా రూ.196.89నుంచి గరిష్ఠంగా రూ. 378.36 చెల్లిస్తున్నారు. అంటే సగటున రూ.300 ఇస్తున్నారు. అదే టెండర్లు పిలిస్తే రూ.150కే కాంట్రాక్టర్లు వచ్చే అవకాశం ఉంది. పీడీఎస్ బియ్యం రవాణాకు స్టేజ్-1 కాంట్రాక్టర్లను నియమించేందుకు చర్చలు జరిపిన కార్పొరేషన్.. పాఠశాలలు, హాస్టళ్లకు పంపిణీ చేసే నాణ్యమైన బియ్యం విషయంలో జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. మచిలీపట్నం నుంచి పశ్చిమ గోదావరికి రవాణా చేస్తారు. మిగిలిన జిల్లాల్లో స్థానికంగానే ప్యాకింగ్ యూనిట్‌లు ఉన్నాయి. పెద్దగా రవాణా వ్యయం అవ్వదు. ప్యాకింగ్‌కు క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.40 అవుతుంది. మిగిలిన మొత్తాన్ని రవాణాకే వెచ్చిస్తున్నారు. దీనివల్ల ప్రతి నెలా పౌరసరఫరాల కార్పొరేషన్‌కు రూ.1.75 కోట్లు నష్టం వాటిల్లుతుందని అంచనా.
Updated Date - May 25 , 2025 | 04:38 AM