Resurvey Errors: త్వరలో రీసర్వే సమస్యల పరిష్కారం
ABN, Publish Date - Jun 25 , 2025 | 04:00 AM
‘రీసర్వే వల్ల జరిగిన లోపాలు, సాంకేతిక సమస్యలు సరిచేసి బాధిత రైతులకు న్యాయం చేస్తాం.. ఒకటి రెండు నెలల్లో ఈ సమస్యకు చెక్ పెడతాం’ అని కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా వెల్లడించారు.
స్పందించిన ప్రభుత్వం.. కలెక్టర్‌కు ఆదేశాలు
కృష్ణాపురం రైతులకు న్యాయం చేస్తాం: కర్నూలు కలెక్టర్
కర్నూలు, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): ‘రీసర్వే వల్ల జరిగిన లోపాలు, సాంకేతిక సమస్యలు సరిచేసి బాధిత రైతులకు న్యాయం చేస్తాం.. ఒకటి రెండు నెలల్లో ఈ సమస్యకు చెక్ పెడతాం’ అని కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష‘లో భాగంగా భూముల రీసర్వే చేపట్టారు. ఇష్టారాజ్యంగా చేపట్టిన రీసర్వే వల్ల భూ విస్తీర్ణంలో భారీ తేడాలు వచ్చాయి. దీనిపై ‘ఒక్కో కూలీకి 325 ఎకరాలు!’ శీర్షికన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై ప్రభుత్వం స్పందించి కలెక్టర్‌కు ఆదేశాలిచ్చింది. దీంతో కలెక్టర్ రంజిత్ బాషా స్పందించి, రీ సర్వే సమస్యలను సరిచేసి రైతులకు న్యాయం చేస్తామని ప్రకటించారు.
ప్రధానంగా.. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కృష్ణాపురంలో 55-60 ఏళ్ల క్రితం 325.8980 ఎకరాల ప్రభుత్వం భూమి అసైన్‌మెంట్ చేసి భూమి లేని వ్యవసాయ కూలీలు, పేదలకు రెండు మూడు ఎకరాల చొప్పున డీ-పట్టా ఇచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి సమస్య రాలేదు. అయితే గత ప్రభుత్వంలో భూములు రీసర్వే చేసి డీ-పట్టాలు జారీ చేసిన భూమి మొత్తానికి ఒకే జాయింట్ ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్‌పీఎం) నంబరు 1662 ఇవ్వడంతో, ఆ సర్వే నంబరులో కూలీలు అందరికీ.. ఒక్కోక్కరికి 325.8980 ఎకరాలు ఉన్నట్లు చూపుతోంది. దీంతో నిరుపేదలు సైతం తల్లికి వందం పథకానికి అనర్హులయ్యారు. ఈ సమస్యలను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కర్నూలు ఆర్డీఓ కె.సందీప్ కుమార్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కృష్ణాపురం రీసర్వే సమస్యతో పాటు జిల్లాలో ఏ మండలంలో ఇలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే సరిచేయాలని తహసీల్దార్లను జేసీ బి.నవ్య ఆదేశించారు. కలెక్టర్ పి.రంజిత్‌బాషా ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ సాంకేతిక సమస్యలను సరి చేసి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు.
Updated Date - Jun 25 , 2025 | 04:00 AM