CID Investigation: అధిక బీపీతో పీఎస్ఆర్ విచారణకు బ్రేక్
ABN, Publish Date - Apr 28 , 2025 | 03:38 AM
ముంబై నటి వేధింపుల కేసులో జైల్లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు అధిక బీపీ కారణంగా సీఐడీ విచారణ మొదలుపెట్టలేకపోయారు. వైద్య పరీక్షల తర్వాత ప్రశ్నించడం సాధ్యపడకపోవడంతో ఆయనను మళ్లీ జైలుకు తరలించారు
విజయవాడ, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): ముంబై నటి కాదంబరి జెత్వానీపై వేధింపుల కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులున సీఐడీ అధికారులు తొలి రోజు విచారించలేకపోయారు. మూడో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయన్ను మూడ్రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఆది, సోమ, మంగళవారాల్లో ఆయన్ను ప్రశ్నించేందుకు సీఐడీ అధికారులు అంతా సిద్ధం చేసుకున్నారు. పీఎ్‌సఆర్‌ను కస్టడీలోకి తీసుకోవడానికి ఆదివారం ఉదయం విజయవాడలోని జిల్లా జైలుకు వెళ్లారు. ఆయనకు బీపీ ఎక్కువగా ఉందని వారికి జైలు అధికారులు తెలియజేశారు. ఇదే విషయాన్ని కాగితంపై రాసివ్వాలని సీఐడీ అధికారులు అడుగగా.. అలా ఇవ్వలేమని వారు చెప్పారు. కస్టడీలోకి తీసుకుని.. ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి, అక్కడ ధ్రువీకరణపత్రం తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో సీఐడీ అధికారులు పీఎస్ఆర్‌ను కస్టడీకి తీసుకుంటున్నట్లు జైలు రికార్డుల్లో రాసి.. ఆయనను జైలు నుంచి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు బీపీ, ఈసీజీ, షుగర్ పరీక్షలు చేశారు. బీపీ 160/90 ఉన్నట్లు తేలింది. షుగర్ మాత్రం సాధారణ స్థాయిలో ఉంది. బీపీ ఎక్కువగా ఉన్నందున ఆయన్ను ప్రశ్నించడం సరికాదని వైద్యులు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ రాసిచ్చారు. దీంతో సీఐడీ అధికారులు ఆయన్ను జిల్లా జైలుకు తరలించారు.
Updated Date - Apr 28 , 2025 | 03:38 AM