POLYCET : పాలీసెట్‌లో 95.36 శాతం ఉత్తీర్ణత పాలీసెట్‌లో 95.36 శాతం ఉత్తీర్ణత
ABN, Publish Date - May 15 , 2025 | 02:17 AM
ఈ సంవత్సరం పాలీసెట్‌లో 95.36% ఉత్తీర్ణతతో రికార్డు స్థాయి ఫలితాలు నమోదు అయ్యాయి. 19 మంది విద్యార్థులు పూర్తి మార్కులు సాధించగా, అగ్రస్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా నిలిచింది.
19 మందికి వంద శాతం మార్కులు
అల్లూరి జిల్లా టాప్.. అనంతపురం లాస్ట్
అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు సాంకేతిక విద్యాశాఖ నిర్వహించిన పాలీసెట్-2025 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ ఎక్స్ ద్వారా ఫలితాలు ప్రకటించారు. ఏప్రిల్ 30న నిర్వహించిన పాలీసెట్‌కు 1,39,840 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 1,33,358 (95.36శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత 96.9శాతం, బాలుర ఉత్తీర్ణత 94.38శాతం నమోదైంది. జిల్లాల వారీగా అల్లూరి సీతారామరాజు జిల్లా 98.66 శాతంతో అగ్రస్థానంలో ఉంది. 93.11శాతం ఉత్తీర్ణతతో అనంతపురం జిల్లా చివరన నిలిచింది. 19 మంది విద్యార్థులు 120కి 120 మార్కులు సాధించారు. కాగా, విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 12,365 మంది పరీక్ష రాశారు.
టాపర్లు వీరే..
నూరు శాతం మార్కులు సాధించిన 19 మందిలో ఎక్కువగా ఉభయగోదావరి జిల్లాల విద్యార్థులున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బడ్డి శశివెంకట్, ఎం.చంద్రహర్ష, డబ్ల్యూ.వరుణ్‌తేజ్, ఎ.నిరంజన్ సాయిరాం, బి.రిషితశ్రీ స్వప్న, ఆర్.చాహ్న, వై.హేమచంద్రకుమార్, ఎం.ఉమా దుర్గా శ్రీనిధి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బి.శ్రీకర్, వేల్పూరి ప్రవళిక, కె.కృష్ణ ప్రణయ్, పాల రోహిత్, యు.చక్రవర్తుల సిరి దీపిక, పి.నితీష్, ఎ.యశ్వంత్ పవన్ సాయిరాం, విశాఖ జిల్లాకు చెందిన బాలినేని కల్యాణ్‌రామ్, చింతాడ చౌహాన్, సీహెచ్.ఖాద్రీష్(ప్రకాశం), కె.అభిజిత్(కాకినాడ) నూరుశాతం మార్కులతో టాపర్లుగా నిలిచారు.
తొమ్మిదేళ్లలో ఇదే అత్యధికం
2017 నుంచి పాలీసెట్ గణాంకాలు పరిశీలిస్తే ఈ ఏడాది అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. 2017లో 78.2శాతం, 2018లో 80.19శాతం, 2019లో 84.33శాతం, 2020లో 84.85శాతం, 2021లో 94.2శాతం, 2022లో 91.84శాతం, 2023లో 86.35శాతం, 2024లో 87.61శాతం ఉత్తీర్ణత నమోదైంది.
నాలుగు రోజులుగా వాయిదాలే..
పాలీసెట్ ఫలితాల విడుదలలో గందరగోళం నెలకొనడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తంచేశారు. ఫలితాల విడుదల తేదీని సాంకేతిక విద్యాశాఖ పలుమార్లు మార్చింది. గత నాలుగు రోజుల నుంచి ‘ఈరోజే’ అన్నట్టు సంకేతాలు రావడంతో విద్యార్థులు ఎదురుచూస్తూ వచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News
Updated Date - May 15 , 2025 | 02:17 AM