Tirupati: బుగ్గమఠం విచారణకు పెద్దిరెడ్డి డుమ్మా
ABN, Publish Date - May 10 , 2025 | 05:12 AM
తిరుపతిలో బుగ్గమఠం భూముల ఆక్రమణలపై దేవదాయ శాఖ విచారణకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గైర్హాజరయ్యారు. ఆయన తరపున న్యాయవాది హాజరై గడువు కోరినప్పటికీ, ఎలాంటి రికార్డులు సమర్పించలేదు
న్యాయవాదిని పంపి గడువు కోరిన మాజీ మంత్రి
తిరుపతి, మే 9 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని బుగ్గమఠం భూముల ఆక్రమణలకు సంబంధించి దేవదాయ శాఖ చేపట్టిన విచారణకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గైర్హాజరయ్యారు. ఆయన తరపున ఓ న్యాయవాది హాజరైనప్పటికీ భూములకు సంబంధించి ఎలాంటి రికార్డులు, ఆధారాలూ సమర్పించలేదు. బుగ్గమఠం భూములు ఆక్రమించుకున్నారని, వాటి నుంచి వైదొలగాలని ఆదేశిస్తూ అధికారులు ఇదివరకే పెద్దిరెడ్డికి నోటీసులు జారీ చేయడం.. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించడం.. వ్యక్తిగతంగా హాజరై రికార్డులు సమర్పించేందుకు పెద్దిరెడ్డికి అవకాశమివ్వాలని కోర్టు ఆదేశించడం తెలిసిందే. దానికనుగుణంగా కలెక్టరేట్‌లో తిరుపతి జిల్లా దేవదాయ అధికారి రామకృష్ణారెడ్డి ఎదుట శుక్రవారం హాజరై రికార్డులు, ఆధారాలు అందజేయాలని పెద్దిరెడ్డికి బుగ్గమఠం తరఫున రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ తుది నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన రాలేదు. తన తరఫున పురుషోత్తంరెడ్డి అనే న్యా యవాదిని పంపారు. బుగ్గమఠం భూములు ఏయే సర్వే నంబర్లలో ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నాయి.. మఠం జరిపిన భూముల క్రయ విక్రయాల వంటి వివరాలు అందజేయాలని దేవదాయ శాఖ అధికారిని లాయర్ అడిగినట్లు తెలిసింది. దేవదాయశాఖ కోరిన సమాచారమివ్వడానికి గడువు కావాలంటూ వినతిపత్రం అందజేసినట్లు సమాచారం.
Updated Date - May 10 , 2025 | 05:12 AM