TDP Cycle Yatra 2025: పెద్దిరెడ్డి కోట నుంచే మహానాడుకు సైకిల్ యాత్ర
ABN, Publish Date - May 27 , 2025 | 06:01 AM
పెద్దిరెడ్డి కోట సుగాలిమిట్టలో వైసీపీ అనుచరుల దౌర్జన్యం జరిగిన ప్రదేశంలోనే పుంగనూరు నుంచి శ్రీకాకుళం తెలుగు తమ్ముళ్లు సైకిల్ యాత్ర ప్రారంభించి ఘనంగా సన్మానించారు. 2023లో అవమానం పొందిన చోటే ఇప్పుడు గౌరవం లభించింది.
నాడు ఆపిన చోటే నేడు ఘనంగా ప్రారంభం.. పసుపు చొక్కాలు విప్పించిన చోటే ఘన సన్మానం
పుంగనూరు, రణస్థలం, మే 26 (ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కాళ్లతో తొక్కిపడేసిన పసుపు జెండాలు సోమవారం అదే ప్రదేశంలో సగర్వంగా రెపరెపలాడాయి. తెలుగు తమ్ముళ్లకు నాడు ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే వారికి ఘనంగా సన్మానం జరిగింది. 2023 అక్టోబరు 19న శ్రీకాకుళం నుంచి కుప్పంకు సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తలు నిద్రబంగి రామకృష్ణ, చిన్నరామసూరి, ఎన్.ఆదినారాయణ, బి.పెంటయ్య, ఎన్.సుందర్రావులపై చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ సమీప సుగాలిమిట్టలో పెద్దిరెడ్డి అనుచరుడు చెంగళాపురం సూరి దౌర్జన్యానికి తెగబడ్డాడు. ‘ఇది పెద్దిరెడ్డి ఇలాకా. ఇక్కడ వైసీపీ జెండా తప్ప మరొకటి కనిపించకూడదు’ అని హూంకరించాడు. పసుపు చొక్కాలు విప్పించి, సైకిళ్లకు ఉన్న పసుపు జెండాలను కిందపడేసి కాళ్లతో తొక్కి దుర్భాషలాడాడు. ఆ తర్వాత ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలైంది. తాజాగా కడపలో నిర్వహిస్తున్న మహానాడుకు శ్రీకాకుళం జిల్లా తెలుగు తమ్ముళ్లు సైకిల్ యాత్రను పుంగనూరులోని సుగాలిమిట్ట నుంచే సోమవారం ప్రారంభించారు. వారికి స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. పూల మాలలు వేసి, శాలువాలు కప్పి సన్మానించారు.
Updated Date - May 27 , 2025 | 06:08 AM