Deputy CM Pawan Kalyan : జగన్ జర్మనీకి వెళ్లాలి!
ABN, Publish Date - Feb 25 , 2025 | 04:15 AM
ఈ ఐదేళ్లూ జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా రాదు. జగన్‌కు ప్రతిపక్ష హోదా అనేది సీఎం చంద్రబాబో, నేనో ఇచ్చేది కాదు.
అక్కడైతేనే వైసీపీకి ‘హోదా’ వస్తుంది
ఇక్కడ ఈ ఐదేళ్లూ జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా రాదు
దాని కోసం సభా సమయం వృథా చేయడం సబబు కాదు
గవర్నర్, సీఎం, నేను ఆయనకు తగిన గౌరవం ఇచ్చాం
11 సీట్లేనని తక్కువగా చూడలేదు
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
డిప్యూటీ సీఎంకు ప్రత్యేక ప్రొటోకాల్ ఉండదు
అందుకనే ప్రమాణస్వీకారోత్సవంలో మంత్రుల వరుసలోనే కూర్చున్నా: పవన్ కల్యాణ్
అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీకి కనీసం ప్రతిపక్షంగా కూడా ప్రజలు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఈ ఐదేళ్లూ జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా రాదు. జగన్‌కు ప్రతిపక్ష హోదా అనేది సీఎం చంద్రబాబో, నేనో ఇచ్చేది కాదు. 39% ఓట్లు వచ్చినందున ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటే జర్మనీ వెళ్లాలి. మన రాజ్యాంగం ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కదు’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో జనసేన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నిబంధనల ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశమే లేదు. ఈ విషయాన్ని ఆపార్టీ నేతలంతా అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షంగా గుర్తింపు పొందడానికి అవసరమైనన్ని సీట్లు వైసీపీ గెలవలేకపోయింది. అందువల్ల జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఈ ఐదేళ్లలో రాదని ఫిక్స్ అవ్వాలి. జగన్‌ని అవమానించాలని, స్థాయి తగ్గించాలని కాదు. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే వైసీపీ నేతలలు జర్మనీ వెళ్లాలి. అక్కడ ఓట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకుంటారు. భారత రాజ్యాంగం ప్రకారం సీట్లు ప్రతిపాదికన ప్రతిపక్ష హోదా ఉంటుందని వైసీపీ నేతలు గ్రహించాలి.
అత్యధిక సీటు వచ్చిన టీడీపీ అధికారంలో ఉంటే, రెండో అతిపెద్ద పార్టీగా జనసేన ఉంది. మా కన్నా ఒక్క సీటు ఎక్కువ తెచ్చుకున్నా, వైసీపీకి ప్రతిపక్ష హోదా అడగకుండానే వచ్చేది. కానీ ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారు. ఇది ప్రజలిచ్చిన తీర్పు. దీన్ని వైసీపీ నేతలు అర్థం చేసుకోకుండా, ఇవ్వడం కుదరని ప్రతిపక్ష హోదా కోసం సభా సమయాన్ని వృఽథా చేయడం సబబు కాదు. గవర్నర్‌కు ఆరోగ్యం బాలేకపోయినా... అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం కోసం వచ్చి, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏం చేయబోతుంది? అనే విషయాలను వివరించారు. కానీ వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేయడం బాధాకరం. గవర్నర్ ప్రసంగంలో ఏముందో తెలుసుకోకుండా, ప్రసంగ ప్రతులను చించేసి, అరుపులు, కేకలతో ప్రసంగం మధ్యలో సభ నుంచి వెళ్లారు. వైసీపీ నేతలు అనుసరించిన ఈ వైఖరి సరికాదు. వారు అసెంబ్లీకి వస్తే... ఆ పార్టీకి ప్రశ్నలు, సమాధానాల కోసం ఏ మేరకు అవకాశం ఇవ్వాలో ఆమేరకు ఇస్తారు. కేవలం హాజరు కోసం వచ్చి వెళ్లడం కాదు. ప్రజా సమస్యలపై స్పందించాలి. హుందాగా చర్చల్లో పాల్గొనాలి.
వైసీపీ నాయకుడు సభకు వస్తే... మాట్లాడేందుకు ఎంత సమయం ఇస్తారో తెలుస్తుంది. రాని హోదా కోసం డిమాండ్ చేస్తూ, అసలు సభకే రాకపోవడం అనైతికం. మొదటి సమావేశాల్లో గవర్నర్, సీఎం, నేను... జగన్‌కు తగిన గౌరవం ఇచ్చాం. 11 సీట్లే వచ్చాయని జగన్‌ను ఎవ్వరూ తక్కువగా చూడలేదు. తగిన మర్యాద ఇస్తున్నా.. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, తమకు అవకాశం ఇవ్వరంటూ వాళ్లకి వాళ్లే ఫిక్స్ అవ్వడం సరికాదు. అసెంబ్లీలో నిబంధనల ప్రకారం, ప్రొటోకాల్ పాటించాల్సిందే. డిప్యూటీ సీఎంకు ప్రత్యేక ప్రొటోకాల్ ఉండదు. మంత్రిగానే పరిగణిస్తారు. కాబట్టే మంత్రివర్గ ప్రమాణ స్వీకార సమయంలో నేను మంత్రుల వరుసలో కూర్చున్నాను. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో గవర్నర్‌ను ఆహ్వానించేందుకు నన్ను రమ్మన్నా... స్పీకర్, సీఎం, మండలి చైర్మన్ వెళ్తారనే నేను వెళ్లలేదు. ఈ విషయాలను వైసీపీ నేతలు గమనించాలి’ అని డిప్యూటీ సీఎం వివరించారు. సనాతన ధర్మపరిరక్షణ బోర్డు ఏర్పాటుపై మీడియా ప్రశ్నించగా... ‘మార్చి 14న పార్టీ ఆవిర్భావ వేదికగా ఈఅంశంపై మాట్లాడతాను. వక్ఫ్ బోర్డు ఉన్నట్లే...సనాతన ధర్మ పరిరక్షణకు కూడా బోర్డు ఏర్పా టు కావాలి. మిర్చి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
Updated Date - Feb 25 , 2025 | 04:16 AM