NASA: అంతరిక్షంలోకి పాలకొల్లు అమ్మాయి
ABN, Publish Date - Jun 24 , 2025 | 05:06 AM
అంతరిక్షయానం అందరికీ సాధ్యమయ్యే పనికాదు..! అలాంటి అసాధ్యాన్ని మన తెలుగమ్మాయి సుసాధ్యం చేయబోతోంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి.. అంతరిక్షంలో అడుగుపెట్టే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది.
దంగేటి జాహ్నవికి అద్భుత అవకాశం
అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ టైటాన్ స్పేస్ మిషన్-2029కు ఎంపిక
పాలకొల్లు, జూన్ 23(ఆంధ్రజ్యోతి): అంతరిక్షయానం అందరికీ సాధ్యమయ్యే పనికాదు..! అలాంటి అసాధ్యాన్ని మన తెలుగమ్మాయి సుసాధ్యం చేయబోతోంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి.. అంతరిక్షంలో అడుగుపెట్టే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ర్టీస్ (టీఎ్‌సఐ) చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కోసం వ్యోమగామి అభ్యర్థి (ఏఎ్‌ససీఏఎన్)గా జాహ్నవి ఎంపికయ్యారు. ఇప్పటివరకు భారత్‌లో జన్మించి, ఇక్కడే నివసిస్తున్న మహిళ.. నేరుగా అంతరిక్ష యానానికి ఎంపిక కాలేదు. అయితే.. టైటాన్ స్పేస్ ప్రతినిధులు పలుమార్లు నిర్వహించిన పరీక్షలన్నీ పూర్తిచేసిన జాహ్నవి ఈ స్పేస్ మిషన్‌కు అర్హత సాధించింది. టైటాన్ స్సేస్ రోదసీలో భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది.
భవిష్యత్‌లో అంతరిక్ష ప్రయోగ, వాణజ్య, పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదద్దనుంది. ఈ మిషన్‌లో భాగంగా తొలుత కొద్దిమంది అంతరిక్ష పరిశోధక వ్యోమగాములు, పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. 2029 మార్చిలో నిర్వహించబోయే మొదటి అంతరిక్ష యాత్ర బృందంలో భారత్ నుంచి జాహ్నవి పాల్గొననుంది. ఈ యాత్రలో భాగంగా ఆమె ఐదు గంటలపాటు అంతరిక్షంలో గడపనుంది. దీనికి ఎంపికైన అభ్యర్థులకు వచ్చే ఏడాది అమెరికాతోపాటు పలుదేశాల్లో మూడేళ్లపాటు శిక్షణ ఇస్తారు. ఈ మిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.
ఏపీ అమ్మాయికి అరుదైన అవకాశం
జాహ్నవి 2021లో నాసా నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్’కు భారత్ తరఫున ఎంపికై రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా జాహ్నవి మాట్లాడుతూ.. ‘అమ్మ, నాన్న కువైట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. నేను అమ్మమ్మ దగ్గరే పెరిగా. మా అమ్మమ్మ లీలావతి చందమామ కథలు చెప్పేది. దీంతో నేను అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కనేదాన్ని’ అని తెలిపింది.
Updated Date - Jun 24 , 2025 | 05:07 AM