Medical Colleges: వెంటనే ఫ్యాకల్టీని భర్తీ చేయాలి
ABN, Publish Date - Jun 19 , 2025 | 06:52 AM
కొత్త మెడికల్ కాలేజీల్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని, ఫ్యాకల్టీని వెంటనే భర్తీ చేయాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) రాష్ట్ర అధికారులను ఆదేశించింది.
వైద్యుల హాజరు కూడా 70 శాతమే..
మీ యాక్షన్ ప్లాన్ ఏమిటో చెప్పండి
సమీక్షించిన తర్వాత తదుపరి నిర్ణయం
అధికారులకు స్పష్టం చేసిన ఎన్‌ఎంసీ
అమరావతి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): కొత్త మెడికల్ కాలేజీల్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని, ఫ్యాకల్టీని వెంటనే భర్తీ చేయాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) రాష్ట్ర అధికారులను ఆదేశించింది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీల్లో లోపాలను ఎన్‌ఎంసీ తీవ్రంగా పరిగణించింది. రెండేళ్లు గడువిచ్చినా ప్రభుత్వం కనీసం లోపాలు సరిదిద్దకపోవడంతో ఏపీ అధికారులకు ఘాటు లేఖ రాసింది. వెంటనే ఢిల్లీకి వచ్చి సమాధానం చెప్పాలని కోరింది. దీంతో రాష్ట్ర అధికారులు ఆగమేఘాల మీద ఢిల్లీకి పరుగులు తీశారు.
బుధవారం ఎన్‌ఎంసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఏపీ డీఎంఈ డాక్టర్ నరసింహం, ఆన్‌లైన్‌లో సెక్రటరీ డాక్టర్ మంజుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఎంసీ అధికారులు 5 కాలేజీల్లోని లోపాలను రాష్ట్ర అధికారుల ముందుంచారు. 25 శాతానికిపైగా సిబ్బంది కొరత ఉందని, సిబ్బంది హాజరు కూడా 70-75 శాతం కూడా లేదని తెలిపింది. చాలామంది సెలవుల్లో ఉంటున్నారని, ఇలా అయితే అడ్మిషన్లకు అనుమతులివ్వడం కష్టమేనని హెచ్చరించింది. కాలేజీల్లోని లోపాలపై మీ యాక్షన్ ప్లాన్ ఏమిటని అధికారులను ప్రశ్నించింది. యాక్షన్ ప్లాన్ ఇస్తే దానిపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
Updated Date - Jun 19 , 2025 | 06:52 AM