Lokesh Criticism Jagan: అప్పుడే భయపడలేదు.. రప్పా, రప్పాకు భయపడతామా: మంత్రి లోకేష్
ABN, Publish Date - Jul 07 , 2025 | 04:43 PM
Lokesh Criticism Jagan: వైఎస్సార్ హయాంలోనే 164 మంది కార్యకర్తలను చంపారని.. అప్పుడే భయపడలేదని.. రప్పా, రప్పాకు భయపడతామా అని మంత్రి లోకేష్ అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లు కట్టారని గుర్తుచేశారు.
నెల్లూరు, జులై 7: ప్రతిపక్షంలో ఉన్నా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలో (Former CM Jagan Reddy) మార్పు రాలేదని, ఇప్పటికీ హెలికాఫ్టర్లలోనే తిరుగుతున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు. ఈరోజు (సోమవారం) నెల్లూరు పట్టణ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో మంత్రి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా మనుషుల్ని చంపుకుంటూ వెళ్తున్నారని.. పల్నాడు జిల్లా పర్యటనలో ఒకరిని పరామర్శించడానికి వెళ్లి ముగ్గురిని చంపారని మండిపడ్డారు. ‘జన సమీకరణ మనం చేయలేక కాదు.. మనవల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు. కారు కింద కార్యకర్త పడితే కనీసం దిగి చూడలేదు. దిగి చూసి ఆసుపత్రికి పంపించి ఉంటే బతికేవాడు. బాధిత కుటుంబం తల్లిని తీసుకువచ్చి కనీసం కూర్చోపెట్టలేదు. గ్లాస్ మంచినీరు అయినా ఇచ్చారా?. సొంత కార్యకర్త చనిపోతే నిల్చొని రెండు భుజాలు తట్టి వెళ్లిపోయారు’ అంటూ ఫైర్ అయ్యారు.
వైసీపీ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్‌ను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ హయాంలోనే 164 మంది కార్యకర్తలను చంపారని.. అప్పుడే భయపడలేదని.. రప్పా, రప్పాకు భయపడతామా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లు కట్టారని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తిరిగే హక్కు ఉందన్నారు. కానీ తిరగమంటే మనుషులను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించమంటే ఎదురుదాడి చేస్తున్నారన్నారని మంత్రి లోకేష్ ఫైర్ అయ్యారు.
వారే నాకు స్ఫూర్తి
తెలుగుదేశం పార్టీ గుండెచప్పుడు కార్యకర్త అని మంత్రి లోకేశ్ అన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారని తెలిపారు. అంజిరెడ్డి తాత, మంజులా రెడ్డి, తోట చంద్రయ్య, చెన్నుపాటి గాంధీలే తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. కార్యకర్తల పోరాటాన్ని విస్మరించకూడదన్నారు. తనను అనేక విధాలుగా అవమానించారని.. 164 సీట్లతో రికార్డ్ బ్రేక్ చేశామన్నారు. దేశ చరిత్రలో 94 శాతం సీట్లు కూటమి కైవసం చేసుకుందని... ఇందుకు కారణం కార్యకర్తలే అని మంత్రి వెల్లడించారు. నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తలను కలిసిన తర్వాతే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యకర్తల సమస్యలు తెలుసుకునేందుకే సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ఏదైనా నిర్ణయంలో సమస్యలు ఉంటే వెనక్కి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరించాలని కార్యకర్తలకు మంత్రి లోకేష్ తెలిపారు. ‘నేడు పోలీసులు మనకు సెల్యూట్ చేస్తున్నారు. ఇదే పోలీసులు మనం ప్రతిపక్షంలో ఉండగా ఇబ్బందులకు గురిచేశారని’ పేర్కొన్నారు. ‘నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడుతున్నా. ఒక్కసారి చంద్రబాబు నిర్ణయం తీసుకున్న తర్వాత తలవంచి పనిచేస్తా. పార్టీ ఫస్ట్, కార్యకర్తలు ఫస్ట్. కార్యకర్తలు అలక మానుకోవాలి. మన సమస్యలు కలిసికట్టుగా కూర్చొని మనమే పరిష్కరించుకోవాలి’ అని లోకేష్ పిలుపునిచ్చారు.
ప్రజల్లోకి సంక్షేమ కార్యక్రమాలు
ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. తల్లికి వందనం, అన్నా క్యాంటీన్లు, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్, పెన్షన్లు అందజేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే డీఎస్సీ ద్వారా ఆగష్టు నాటికి ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని ప్రకటించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశామని, రూ.2వేల కోట్లతో రోడ్ల మరమ్మతులు చేపట్టామని చెప్పారు. టీసీఎస్, కాగ్నిజెంట్, రిఫైనరీ పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ అందిస్తున్నామని.. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు తెలిపారు. జగన్ రెడ్డి అహంకారం వల్లే 151 సీట్లు 11 అయ్యాయనన్నారు. ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడాలని... బాధ్యతగా పనిచేయాలని.. మార్పు కోసం, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చామని గుర్తుంచుకోవాలని కార్యకర్తలకు మంత్రి లోకష్ దిశానిర్దేశం చేశారు.
సమన్వయ సమావేశం అనంతరం దాదాపు 1,500 మందిని మంత్రి నారా లోకేష్ కలిశారు. వివిధ సమస్యలపై ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కరించి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరితో కలిసి ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో మంత్రి పి.నారాయణ, జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఎన్ ఎండీ ఫరూఖ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు ఛైర్మన్ కేపీ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్ ఉత్తర్వులు జారీ
వీఆర్ స్కూల్ అద్భుతం.. ఆ ఇద్దరి కృషి చాలా గొప్పది: మంత్రి లోకేష్
Read latest AP News And Telugu News
Updated Date - Jul 07 , 2025 | 05:51 PM