Kakani Mining Case: రెండో రోజు విచారణ షురూ.. కాకాణి సహకరిస్తారా
ABN, Publish Date - Jun 07 , 2025 | 10:54 AM
Kakani Mining Case: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రెండో రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. తొలిరోజు కస్టడీలో సరైన సమాధానాలు చెప్పని మాజీ మంత్రి.. రెండో రోజు విచారణలో పోలీసులకు సహకరిస్తారా లేదా అనేది చూడాలి.
నెల్లూరు, జూన్ 7: అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని (Former Minister Kakani Goverdhan Reddy) రెండో రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల కస్టడీలో భాగంగా రెండో రోజు విచారణ ప్రారంభమైంది. కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రిని న్యాయవాది సమక్షంలో పోలీసులు విచారిస్తున్నారు. తొలిరోజు రెండున్నర గంటల పాటు విచారణ కొనసాగింది. దాదాపు 22 ప్రశ్నలను పోలీసులు సంధించగా.. విచారణకు కాకాణి అస్సలు సహకరించలేదని తెలుస్తోంది. తనకు సంబంధం లేదని, తనకు తెలీదని, న్యాయవాదిని అడగండి అంటూ సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
పోలీసుల విచారణకు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించగా.. శుభకార్యానికి హైదరాబాద్ వెళ్లానని చెప్పినట్లు తెలిసింది. తెల్లరాయిని అక్రమంగా తవ్వి తరలించేందుకు నగదు ఎక్కడిదని, 63 వేల టన్నుల క్వార్ట్జ్‌ను కొల్లగొట్టడం ద్వారా వచ్చిన రూ.138 కోట్లు ఏం చేశారని, అక్రమ రవాణాలో ఎవరెవరి పాత్ర ఎంత ఉందని, ఎవరెవరికి ఎంత ముట్టింది అంటూ కాకాణిని ప్రశ్నించినట్లు సమాచారం. ఈరోజు పూర్తిస్థాయిలో విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ నేతృత్వంలో విచారణ సాగుతోంది. రేపు (ఆదివారం) సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, భారీగా పేలుడు పదార్ధాల వినియోగం, అట్రాసిటీ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసులో కాకాణి ఏ4గా ఉన్నారు.
కాకాణి స్వగ్రామం తోడేరులో రుస్తుం మైన్స్ ఉన్నాయి. గత ప్రభుత్వం హయాంలో రుస్తుం మైన్స్ యజమానులను రౌడీ మూఖలతో బెదిరించి, భయపెట్టి మరీ తరిమేశారు కాకాణి అండ్ బ్యాచ్. వెంటనే అక్కడ అక్రమ తవ్వకాలు మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు వినియోగించారు. రూ.250 కోట్లకు పైగా విలువ చేసే 61వేల మెట్రిక్ టన్నుల క్వార్ట్జ్ విదేశాలకు ఎగుమతి చేశారు. వీటిన్నటింకీ సంబంధించి పోలీసులు కీలక ఆధారాలు సేకరించి మరీ వాటిపై కాకాణిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. రేపు సాయంత్రానికి విచారణ ముగిసిన వెంటనే తిరిగి కాకాణిని జైలుకు అప్పగించనున్నారు.
మరోవైపు కాకాణి ముఖ్య అనుచరుడు నిరంజన్ రెడ్డిని సిట్ అధికారులు బెంగళూరులో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రావెల్ తవ్వకాల్లో ఏకంగా ఎంపీ మాగుంట శ్రీనివాస్ పేరును వినియోగించడంతో పాటు ఆయన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు. ఆ కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది.
ఇవి కూడా చదవండి
ఏపీకి గూగుల్.. స్థలం పరిశీలన పూర్తి
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 07 , 2025 | 11:10 AM