Mohith Reddy: నాపై కేసు కొట్టేయండి హైకోర్టుకు మోహిత్‌రెడ్డి
ABN, Publish Date - Jun 27 , 2025 | 04:46 AM
మద్యం కుంభకోణం వ్యవహారంలో మంగళగిరి సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు, తుడా మాజీ చైర్మన్ మోహిత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
అమరావతి, విజయవాడ, జూన్ 26(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం వ్యవహారంలో మంగళగిరి సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు, తుడా మాజీ చైర్మన్ మోహిత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నిందితుల జాబితా నుంచి తన పేరును తొలగించేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఎన్నికల ముందు వివిధ మార్గాల నుంచి మద్యం ముడుపుల ద్వారా వచ్చిన సొమ్మును చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పొందారని, తుడా చైర్మన్‌గా మోహిత్‌రెడ్డికి ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన వాహనంలో ఆ డబ్బును తరలించామని, ఆ సొమ్మును ఎన్నికల్లో పంచారని ఆయన గన్‌మెన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్‌రెడ్డిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు.
కాగా, మోహిత్‌రెడ్డి బెయిల్ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టు ఈ నెల 30న తీర్పు వెల్లడించనుంది. సిట్ నమోదు చేసిన మద్యం కేసులో మోహిత్‌రెడ్డి ఏ39గా ఉన్నారు. ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయగానే మోహిత్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత మధ్యంతర బెయిల్ కోరుతూ మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై వాదనలు గురువారం ముగిశాయి. దీంతో న్యాయాధికారి పి.భాస్కరరావు తీర్పును ఈనెల 30వ తేదీకి వాయిదా వేశారు. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెరుకూరి వెంకటేష్ నాయుడు కస్టడీ పిటిషన్‌పై తీర్పును కూడా 30 తేదీకి వాయిదా వేశారు. వెంకటే్‌షనాయుడుకు ఇంటి భోజనం అనుమతి, బెయిల్ మంజూరు అభ్యర్థనలపైనా తీర్పును అదే రోజుకు వాయిదా వేశారు. ఇదే కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న పైలా దిలీప్ బెయిల్ పిటిషన్‌పైనా వాదనలు ముగిశాయి. ఆ తీర్పును జూలై 3వ తేదీకి వాయిదా వేశారు.
Updated Date - Jun 27 , 2025 | 04:46 AM