Minister Lokesh: విద్యార్థులు సవాళ్లను స్వీకరించాలి
ABN, Publish Date - Jun 24 , 2025 | 05:03 AM
విద్యార్థులు సవాళ్లను స్వీకరించాలని, లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
లక్ష్యం దిశగా అడుగులు వేయాలి
పేదరికం నుంచి బయటపడేసేది విద్యే
పెదనాన్న దగ్గుబాటి ప్రజల మనిషి
ఇంకొల్లులో ‘డీవీఆర్ సైనిక్ స్కూల్’
ప్రారంభోత్సవ సభలో మంత్రి లోకేశ్
బాపట్ల, జూన్ 23(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు సవాళ్లను స్వీకరించాలని, లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘‘2019లో మంగళగిరి నుంచి పోటీ చేశా.. ఓడిపోయా.. నన్ను హేళన చేశారు. కానీ, కసితో అక్కడే పని చేసి టీడీపీ 40 ఏళ్లుగా గెలవని అదే నియోజకవర్గంలో 2024లో గెలిచి చూపించా. అత్యధిక మెజారిటీ సాధించా.’’ అని అన్నారు. యోగా విషయంలోనూ అదే పట్టుదలతో పనిచేసినట్టు చెప్పారు. ‘‘అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు 5 లక్షల మందితో యోగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. అది సాధ్యమేనా అని అందరూ అనుమానం వ్యక్తం చేశారు. కానీ, ఐక్యంగా పని చేసి వరల్డ్ గిన్నిస్ రికార్డు సాధించాం.’’ అని చెప్పారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు సమీపంలోని గంగవరంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సారథ్యంలో ఏర్పాటు చేసిన ‘డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్’ను మంత్రి లోకేశ్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికం నుంచి కుటుంబాలను బయటపడేసేది విద్య ఒక్కటేనని తెలిపారు. విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, ప్రపంచంలోనే ఏపీ విద్యావ్యవస్థ ఓ విజయవంతమైన నమూనాగా ఉండాలనే సంకల్పంతో పని చేస్తున్నామన్నారు. పెదనాన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు మారుమూల ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యం తో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయ డం ఆనందంగా ఉందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు అద్భుతమైన విద్య అందించాలని దగ్గుబాటి కుటుం బం పనిచేస్తోందని తెలిపారు. అధికారం ఉన్నా లేకున్నా పెదనాన్న దగ్గుబాటి ప్రజల మనిషిగా గుర్తింపు పొందారని చెప్పారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయని, ఐటీ, తయారీ రంగాలపై దృష్టి పెట్టామని తెలిపారు.
చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని, తద్వారా రాజకీయాల్లో మార్పు సాధ్యపడుతుందన్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసంతో కూడిన మంచి విద్య అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. అంతకుముందు.. బాప ట్ల జిల్లాకు వచ్చిన మంత్రి లోకేశ్‌కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బర్లీ పొగాకు రైతులు గజమాలతో మంత్రి లోకేశ్‌కు స్వాగతం పలికారు.
పెద్దమ్మ, పెదనాన్న..
సభలో మంత్రి లోకేశ్ మాట్లాడేటప్పుడు.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎంపీ పురందేశ్వరిని ఉద్దేశించి పలుసార్లు ‘పెద్దమ్మ, పెదనాన్న’ అంటూ సంబోధించడంతో పాటు దగ్గుబాటి తనయుడు హితేశ్ చెంచురామ్‌ను తమ్ముడు అంటూ మాట్లాడారు.
Updated Date - Jun 24 , 2025 | 05:03 AM