Mining Contract Extension: గనుల సీనరేజీ వసూలు కాంట్రాక్టు పొడిగింపు
ABN, Publish Date - Apr 19 , 2025 | 03:45 AM
గనుల శాఖ సీనరేజీ వసూళ్ల కాంట్రాక్టుకు కాలపరిమితిని 73 నుంచి 113 రోజుల వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బకాయిలు మూడు విడతల్లో చెల్లించాలి మరియు మళ్లీ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాలని ఆదేశించింది
73 నుంచి 113 రోజుల వరకు 3 విడతల్లో బకాయిలు చెల్లించాలి
ఆ 5 జిల్లాల్లో మళ్లీ బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వాలి
బకాయిల్లో తొలివిడత చెల్లించాలి.. ఉత్తర్వులు జారీ
అమరావతి, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): గనుల శాఖలో సీనరేజీ వసూలు కాంట్రాక్టు కాలపరిమితిని ప్రభుత్వం పొడిగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ప్రభుత్వ ఆదేశాలతో గత ఏడాది జూన్ నుంచే ఏడు ఉమ్మడి జిల్లాల పరిధిలో సీనరేజీ వసూళ్లు నిలిచిపోయాయి. ఖజానాకు రావలసిన ఆదాయం పడిపోయింది. ఈ నేపథ్యంలో పనిచేయని కాలంలో చెల్లించాల్సిన బకాయిలను మాఫీ చేయడంతోపాటు ఆ కాలాన్ని కొనసాగింపుగా పరిగణించాలని కాంట్రాక్టు సంస్థలు ఇటీవల కోరాయి. దీనికి సర్కారు సానుకూలంగా స్పందించింది. సీనరేజీ వసూళ్లను నిలిపివేసిన జిల్లాల్లో ఆయా సంస్థల కాంట్రాక్టు కాలపరిమితిని సగటున 73 రోజుల నుంచి 113 రోజుల వరకు పొడిగించింది. అధికారిక లెక్కల ప్రకారం.. ఏడు ఉమ్మడి జిల్లాలకు గాను ఐదు జిల్లాల్లో కాంట్రాక్టు గడువు ఇప్పటికే ముగిసింది. ఆ జిల్లాల్లో సంబంధిత కంపెనీలు తమకు పొడిగింపు కోరుతూ దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. ఇందుకోసం మళ్లీ కొత్తగా బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాలని స్పష్టంచేసింది. పెండింగ్ బకాయిల్లో తొలి విడత సొమ్మును చెల్లించాలని షరతు విధించింది. కాగా.. కాంట్రాక్టు సంస్థలు బకాయిలను మూడు విడతల్లో చెల్లించాలని గనుల శాఖ కార్యదర్శి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పనిచేయని కాలానికి బకాయిలు వర్తించవన్నారు. అవసరమైన మేర జిల్లా మినరల్ ఫండ్ (డీఎంఎఫ్), మెరిట్ ఫీజులను చెల్లించాలన్నారు.
జిల్లాల వారీగా సీనరేజీ కాంట్రాక్టు పొడిగింపు ఇలా
చిత్తూరు జిల్లా రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు, కడప హిల్‌సైడ్ ఎస్టేట్స్, అనంతపురం అమిగోస్ మినరల్స్, శ్రీకాకుళం విశ్వసముద్ర ఇంజనీరింగ్ , తూర్పుగోదావరి సుధాకర ఇన్‌ఫ్రాటెక్, విజయనగరం రాఘవ కన్‌స్ట్రక్షన్స్ గుంటూరు ఏఎమ్‌ఆర్ ఇండియా.
Updated Date - Apr 19 , 2025 | 03:47 AM