Electricity Scam: విద్యుత్ శాఖకు మద్దాళి గిరి 42 కోట్లు ఎగనామం
ABN, Publish Date - Jun 06 , 2025 | 05:05 AM
సామాన్య వినియోగదారులు ఎవరైనా విద్యుత్ బకాయి రూ.500 ఉన్నా అధికారులు నిర్దాక్షిణ్యంగా కనెక్షన్ కట్ చేస్తారు. కానీ గత ప్రభుత్వంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ కోట్లలో బకాయిలు పెట్టినా అధికారులు అటువైపు కూడా చూడలేదు.
గత ప్రభుత్వంలో పేరుకుపోయిన బకాయిలు
స్పిన్నింగ్ మిల్లుల బిల్లులు చెల్లించని వైనం
కూటమి సర్కారు వచ్చాక కనెక్షన్లు కట్
మాజీ ఎమ్మెల్యే ఆస్తులపై ఆర్‌ఆర్ యాక్టు?
గుంటూరు, జూన్ 5(ఆంధ్రజ్యోతి): సామాన్య వినియోగదారులు ఎవరైనా విద్యుత్ బకాయి రూ.500 ఉన్నా అధికారులు నిర్దాక్షిణ్యంగా కనెక్షన్ కట్ చేస్తారు. కానీ గత ప్రభుత్వంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ కోట్లలో బకాయిలు పెట్టినా అధికారులు అటువైపు కూడా చూడలేదు. ఆయన తన స్పిన్నింగ్ మిల్లులకు సంబంధించి ఏకంగా రూ.42 కోట్లకు ఎగనామం పెట్టారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక చర్యలు మొదలయ్యాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి 2019లో టీడీపీ తరఫున గెలిచిన మద్దాళి గిరి.. అప్పట్లో వైసీపీ అధికారంలోకి రావటంతో పార్టీని వీడి అధికార పార్టీ పంచన చేరారు. అప్పటికే కొద్ది పాటి విద్యుత్ బకాయిలు ఉన్నాయి. ఇక వైసీపీ ఐదేళ్ల పాలనలో అధికారులు అడిగే ధైర్యం చేయకపోవటంతో బకాయిలు కోట్లలో పేరుకుపోయాయి. ఆయన మిల్లుల విద్యుత్ కనెక్షన్లను కట్ చేసేందుకు ఎవరూ సాహసించలేదు. ఉన్నతాధికారులతో చెప్పించుకొని బిల్లులు కట్టకుండా ఎగనామం పెడుతూ వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కొద్ది రోజులకే విద్యుత్ శాఖ అధికారులు ఆయన మిల్లులకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బిల్ స్టాప్ కూడా చేసేశారు. అయినా ఆయనలో స్పందన లేదు. ఏపీ సీపీడీసీఎల్ సీఎండీగా కొత్తగా నియమితులైన పుల్లారెడ్డి జిల్లాల పర్యటనలో భాగంగా గురువారం గుంటూరు వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులు మాజీ ఎమ్మెల్యే గిరి విద్యుత్ బకాయిల విషయం ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
తగిన చర్యలు తీసుకునేందుకు ఆదేశించాల్సిందిగా కోరారు. విద్యుత్ బకాయిలను ఆర్‌ఆర్ యాక్టు ప్రకారం వసూలు చే సుకునే అధికారం అధికారులకు ఉంది. ఈ యాక్టు ద్వారా ఆస్తులను సీజ్ చేసి బకాయిలు రాబట్టుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే గిరికి కూడా కొద్ది రోజులు గడువు ఇచ్చి ఆర్‌ఆర్ యాక్టు ప్రయోగించే అవకాశం ఉంది. కాగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి టీడీపీలో చేరాలని గిరి ప్రయత్నించినా చేర్చుకోలేదు. ఇంకా వైసీపీలోనే ఉంటే బకాయిలు/అప్పుల వేధింపులు ఎక్కువవుతాయని భావించి ఆ పార్టీకి రాజీనామా చేశారు.
Updated Date - Jun 06 , 2025 | 05:14 AM