Nara Lokesh: టీ అదిరింది అన్నా..
ABN, Publish Date - May 27 , 2025 | 05:55 AM
కుప్పం నుంచి కడప వెళ్తూ మార్గంలో ఓ టీ బంకు వద్ద మంత్రి లోకేశ్ ఆగి చాయ్ సేవను ప్రశంసించారు. ఆయన కార్యకర్తలకు భరోసా ఇచ్చి, పార్టీకి అండగా ఉంటామని పేర్కొన్నారు.
ఓ చాయ్‌వాలాకు లోకేశ్ ప్రశంస
కుప్పం నుంచి కడప వెళ్తూ మార్గం మధ్యలో రోడ్డుపై ఓ బంకు వద్ద ఆగిన మంత్రి
కుప్పం/శాంతిపురం, మే 26(ఆంధ్రజ్యోతి): ‘టీ చాలా బాగుంది..’ ఓ చాయ్‌వాలాకు మంత్రి లోకేశ్ ఇచ్చిన ప్రశంస ఇది. సీఎం చంద్రబాబు దంపతులతో కలిసి నూతన గృహప్రవేశానికి హాజరైన ఆయన సోమవారం సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యా రు. మహానాడు జరగనున్న కడప జిల్లాకు వెళ్తూ మార్గమధ్యలో కుప్పం మండల సచివాలయ సమీపంలోని చెంగాచారి టీ బంకు వద్ద ఆగారు. వాహనం దిగి నేరుగా బంకు దగ్గరకు వెళ్లి తనతో పాటు వెంట ఉన్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ తదితరులందరికీ టీ ఆర్డర్ చేశారు. బంకు యజమాని చెంగాచారితో మాటలు కలిపి, క్షేమ సమాచారాలు కనుక్కున్నారు. తాను టీడీపీ వీరాభిమానినని, యువగళం పాదయాత్రలో లోకేశ్‌తో కలిసి నడిచానని చెంగాచారి చెప్పారు. 1994 నుంచి పార్టీలో కొనసాగుతున్నానని తెలిపారు. టీడీపీవాడినన్న కక్షతో ఐదేళ్లుగా తన టీ అంగడి మూయించేశారని ఆవేదన వ్యక్తంచేశారు. మళ్లీ టీడీపీ అధికారంలోకొచ్చాక జూన్ 17న తిరిగి దుకాణం ప్రారంభించానని పేర్కొన్నారు. లోకేశ్ మాట్లాడుతూ ఇక ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వద్దంటున్నా టీకి డబ్బులు చెల్లించిన లోకేశ్.. అక్కడి నుంచి కడప బయల్దేరి వెళ్లారు.
Updated Date - May 27 , 2025 | 05:56 AM