Excise Department: మద్యంపై మరింత నిఘా
ABN, Publish Date - Jun 02 , 2025 | 04:40 AM
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులు, బార్ల పనివేళల ఉల్లంఘనలను రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నియంత్రిస్తోంది. అధికారులు ప్రతిరోజూ షాపుల ముందుకు ఫొటోలు పంపించాలని, నియమాలు సరిగా పాటించలేకపోతే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పనివేళల ఉల్లంఘనలపై సర్కారు సీరియస్
ప్రతిరోజూ ఉదయం, రాత్రి తనిఖీలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో మద్యం షాపులు ఉదయం 10నుంచి రాత్రి 10 వరకు, బార్లు ఉదయం 11 నుంచి రాత్రి 11గంటల వరకు పనిచేయాలి. కానీ చాలాచోట్ల ఉదయం 10గంటలకు ముందే షాపులు తెరిచి అమ్మకాలు ప్రారంభిస్తున్నారు. అలాగే రాత్రి 10తర్వాత కూడా మరో అరగంట అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇక బార్లు అయితే అధికారిక పనివేళలకు ఎప్పుడో మంగళం పలికాయి. ‘ఏ సమయంలో వెళ్లినా మద్యం దొరుకుతుంది’ అనే స్థాయిలో అనధికారికంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఈ ఉల్లంఘనలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఐదురోజుల కిందట ఉన్నతాధికారులు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎక్సైజ్ సమీక్ష సమావేశంలో ఈ అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. మద్యం షాపులు, బార్ల పనివేళల ఉల్లంఘనలు, షాపుల వద్ద తాగుడుపై అధికారులు నిఘా పెట్టారు.
ఫొటోలు తీసి పంపాలి
నిఘా అంటే ఏదో మాటల్లో చేశాం అన్నట్టు కాకుండా ఆధారాలు కూడా ఉండాలని అధికారులు ఈ సమావేశంలో స్పష్టంచేశారు. అందులో భాగంగా ప్రతిరోజూ షాపులు, బార్ల పనివేళలు ప్రారంభానికి ముందు, ముగిసే సమయంలో కానిస్టేబుళ్లను పంపి ఫొటోలు తీయించాలని ఆదేశించారు. జియో కోఆర్డినేట్స్ రికార్డ్, సమయం రికార్డు అయ్యేలా ఫొటోలు తీసి కానిస్టేబుళ్లు స్టేషన్ల సీఐలకు పంపుతున్నారు. వారు వాటిని ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. కొందరు అధికారులు వారు పనిచేస్తున్న ప్రాంతాల్లో ఉండటం లేదనే ఫిర్యాదులు అందాయి. దీంతో సీఐలు, ఆపై స్థాయి అధికారులు కూడా ఇకపై రోజూ ఉదయం, సాయంత్రం ఫొటోలు తీసి పంపాలని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు.
ఇంటికి తీసుకెళ్లే తాగాలి
గతంలో మద్యం షాపుల వద్ద తాగేందుకు వీలుగా పర్మిట్‌రూమ్‌లు ఉండేవి. దీనిపై ఎక్సైజ్ అధికారులు సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో నూతన మద్యం పాలసీలో పర్మిట్‌రూమ్‌లకు అవకాశం ఇవ్వలేదు. అయినా అనధికారికంగా షాపుల వద్ద తాగే విధానం కొనసాగుతోంది. ఒకవేళ పర్మిట్‌రూమ్‌లకు అవకాశం ఇచ్చి ఉంటే ఏడాదికి రూ.170 కోట్లకు పైగా ఆదాయం సమకూరేది. అయితే, ఇటీవల కాలంలో షాపుల వద్ద తాగుడుపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో చర్యలు చేపట్టారు. షాపుల వద్ద ఎవరూ తాగకూడదని, కొనుకున్న మద్యాన్ని ఇంటికి తీసుకెళ్లి తాగాలని స్పష్టంచేస్తున్నారు. పర్మిట్‌రూమ్‌లకు అనుమతి ఇస్తేనే బాగుండేదని, ఇంటికెళ్లి తాగడం సాధ్యంకాదని వినియోగదారులు చెబుతుతున్నారు.
3 జిల్లాలపై అసంతృప్తి
ఉమ్మడి తూర్పు, పశ్చిమ, ప్రకాశం.. జిల్లాల అధికారుల పనితీరుపై ప్రభుత్వ స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ జిల్లాల అధికారులపైనే తాజా సమావేశంలో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ జిల్లాలో ఎమ్మార్పీ ఉల్లంఘనలపై ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో నాటుసారాను నియంత్రించాల్సిన ఓ అధికారి వారికి సహకరించారని చర్యలు తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఓ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌పైనా ఆరోపణలు పెరిగాయి. రాబోయే రోజుల్లో పనితీరు మెరుగుపడకపోతే, చర్యలకు వెనకాడకూడదని ప్రభుత్వం భావిస్తోంది.
Updated Date - Jun 02 , 2025 | 04:43 AM