Liquor Scam: లిక్కర్ బాసులకే ఆగ్రోస్ టెండర్లు
ABN, Publish Date - Jun 27 , 2025 | 03:09 AM
రైతులకు వ్యవసాయ పరికరాలు అందించే టెండర్ల కాంట్రాక్టును రూ.వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో నిందితులుగా ఉన్న ఎస్పీవై రెడ్డి సంస్థలకు కట్టబెట్టేందుకు ఏపీ ఆగ్రోస్ తహతహలాడుతోంది.
వైసీపీ హయాంలో రైతులకు వ్యవసాయ పరికరాలు అందించడానికి అనుసరించిన విధానంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఒక వస్తువు సరఫరా బాధ్యతను ఒక కంపెనీకి మాత్రమే అప్పట్లో అప్పజెప్పారు. రైతులకు కంపెనీని ఎంచుకునే అవకాశం ఇవ్వలేదు. దీంతో నాసిరకం పరికరాలు సరఫరా అయ్యాయి. వీటి నాణ్యతపై కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో పరికరాలపై రైతులు చెల్లించాల్సిన 20 శాతం వాటా ఆగ్రో్‌సలోనే ఉండిపోయింది. ఫిర్యాదులకు భయపడి కనీసం 20 శాతం వాటా సొమ్మును తీసుకోవడానికి కూడా ఆ కంపెనీలు రావడం లేదు. కట్ చేస్తే...కూటమి ప్రభుత్వంలో మళ్లీ అదే తప్పు ఏపీ ఆగ్రోస్ చేస్తోంది.
మద్యం స్కామ్‌లో ఇప్పటికే ఎస్పీవై రెడ్డి అల్లుడి అరెస్టు
తాజాగా వారి కంపెనీలే ఎల్1 అయ్యేలా చర్యలు
రైతులకు సాగు పరికరాలు అందించడానికి
ఏప్రిల్‌లో పిలిచిన టెండర్లు రద్దు చేసిన ఏపీ ఆగ్రోస్ 15 ఏళ్ల అనుభవం.. రాష్ట్రంలోనే తయారీ ప్లాంట్..
ఆ కంపెనీలే అర్హత సాధించేలా రూల్స్ మార్పు
వాటి ఆధారంగా ఈ నెల 5న మళ్లీ టెండర్లు
చక్రం తిప్పుతున్న ఓ సీనియర్ అధికారి!
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రైతులకు వ్యవసాయ పరికరాలు అందించే టెండర్ల కాంట్రాక్టును రూ.వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో నిందితులుగా ఉన్న ఎస్పీవై రెడ్డి సంస్థలకు కట్టబెట్టేందుకు ఏపీ ఆగ్రోస్ తహతహలాడుతోంది. స్కామ్ సొమ్ము బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఎస్పీవై ఆగ్రోస్ ఇండస్ర్టీస్ ద్వారా పలు షెల్ కంపెనీలకు చేరినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో తేలింది. ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని ఈ వ్యవహారంలో ఇప్పటికే అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. ఇప్పుడు వారికే చెందిన సుజల పైప్స్, నంది పైప్స్ కంపెనీలకు టెండరు కట్టబెట్టాలన్న ఉద్దేశంతోనే ఏపీ అగ్రోసలో టెండర్ నిబంధనలు పూర్తిగా మార్చినట్టు సమాచారం. దీనికోసమే ఎమ్‌ప్యానెల్‌మెంట్ విధానం స్థానంలో ఎల్1 టెండర్ల ప్రక్రియ తీసుకొచ్చినట్టుగా చెబుతున్నారు. ఎందుకంటే ఏపీ ఆగ్రోస్ ఏప్రిల్‌లో టెండర్లు పిలిచి, ఎమ్‌ప్యానెల్‌మెంట్ పూర్తయి, రైతులు కూడా కంపెనీలను ఎంచుకున్న తర్వాత ఆగమేఘాలపై దానిని నిలిపివేసింది. కొత్త నిబంధనలు పెట్టి ఈ నెల 5న మరోసారి టెండర్ పిలిచారు. కేవలం సుజల పైప్స్, నందిపైప్స్ కంపెనీలకు మాత్రమే అర్హత ఉండేలా వాటిని రూపొందించారని తెలుస్తోంది. ఓ సీనియర్ అధికారి వ్యూహంలో భాగంగానే ఈ అడ్డగోలు వ్యవహారమంతా సాగినట్టు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
నిధులు పంచాయతీరాజ్‌వి అమలు వ్యవసాయ శాఖది
రైతుల పథకానికి నిధులు పంచాయతీరాజ్ శాఖ ఇస్తుంది. కంపెనీల ఎమ్‌ప్యానెల్‌మెంట్ లేదా డీఎ్‌ససీ ద్వారా నిధులు ఖర్చుపెట్టాలన్న స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆ నిబంధనలకు అనుగుణంగానే ఈ పథకం అమలైంది. ఈ నిబంధనల ప్రకారమే ఏప్రిల్‌లో ఏపీ ఆగ్రోస్ టెండర్లు కూడా పిలిచింది. కానీ, అకస్మాతుగా వాటిని నిలిపేశారు. ఈ వాటర్ షెడ్ పథకంలో రైతులకు వ్యవసాయ పరికరాలు ఇస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన ఏపీ ఆగ్రోస్ ఎమ్‌ప్యానెల్‌మెంట్ కోసం టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఇందులో పరికరాల వారీగా వేరు వేరు కంపెనీలు టెండర్లు వేసుకొని వారి రేట్ల ప్రకారం ఎమ్‌ప్యానెల్ అయ్యాయి. ఇలా ఎమ్‌ప్యానెల్ అయిన కంపెనీల జాబితాను తెలియజేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అన్ని జిల్లాల వారికి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులు ఏ కంపెనీ పరికరం కోరుకుంటే ఆ కంపెనీ పరికరాలు తీసుకొనే వెసులుబాటు ఈ పథకంలో ఉంది. ఆ ప్రకారం, రైతులే స్వయంగా వివిధ పరికరాలకు సంబంధించి వివిధ కంపెనీలకు ఎన్నుకొన్నారు. రైతులు ఎంపిక చేసుకోవడం పూర్తయిన తర్వాత ఏపీ ఆగ్రోస్ ఆ టెండర్‌ను అర్ధంతరంగా నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది.
ఆ రెండు కంపెనీల కోసమే...
నిబంధనలు మార్చి మరోసారి అదే పథకానికి ఏపీ ఆగ్రోస్ ఈ నెల 5న టెండర్లు పిలిచింది. కానీ విచిత్రంగా ముందు టెండర్లలో ఎంపికైన ఏ ఒక్క కంపెనీకీ ఈసారి అర్హత లేకుండాపోయింది. ఈ టెండర్లలో పాల్గొనాలంటే కంపెనీ పెట్టి 15 ఏళ్లు పూర్తికావాలన్న నిబంధన కొత్తగా పెట్టారు. దీంతో ఎస్పీవై రెడ్డికి సంబంధించిన సుజల పైప్స్, నంది పైప్స్ కంపెనీలు, కర్ణాటకకు చెందిన మరో కంపెనీ అర్హత సాధించాయి. ఏపీలోనే తయారీ ప్లాంటు ఉండాలన్న మరో నిబంధన తీసుకొచ్చి ఆ కర్ణాటక కంపెనీని కూడా రేసులో లేకుండా చేశారు. ఏప్రిల్‌లో పిలిచిన టెండర్ల ప్రకారం ఒక్క నాగలికే 24 కంపెనీలు టెండర్లు వేశాయి. ’9 టైన్ కల్టివేటర్’ కోసం 29 కంపెనీలు టెండర్లు వేశాయి. నిబంధనలు మార్చిన తర్వాత ఇందులో ఏ ఒక్క కంపెనీకి కూడా అవకాశం లేకుండా పోయింది. వైస్పీవై రెడ్డికి చెందిన 2కంపెనీల కోసమే టెండరు నిబంధనలు మార్చినట్టు స్పష్టమవుతోంది.
Updated Date - Jun 27 , 2025 | 03:09 AM