Yogandhra 2025: విజయవాడలో యోగాంధ్ర.. పాల్గొన్న రైతులు
ABN, Publish Date - May 31 , 2025 | 10:21 AM
Yogandhra 2025: కామన్ యోగాసనాలతో అనేక రుగ్మతలును దూరం పెట్టవచ్చని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు చెప్పుకొచ్చారు. నేడు బిజీ లైఫ్‌లో అందరూ ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోందని.. బీపీ, షుగర్‌లు, ఇతర జబ్బులు పెరుగుతున్నాయన్నారు. యోగాసనాల ద్వారా వీటిని శరీరంలోకి రాకుండా చేయవచ్చని తెలిపారు.
విజయవాడ, మే 31: యోగాంధ్రాలో (Yogandhra) భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మాసోత్సవం జరుగుతోంది. ఈరోజు (శనివారం) నగరంలోని బీఆర్టీఎస్ రోడ్‌లో (BRTS Road) కలెక్టర్ లక్ష్మీ శా ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. రైతులతో కలిసి వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, కలెక్టర్ లక్ష్మీ శా, మున్సిపల్ కమీషనర్ ధ్యాన్ చంద్ యోగాసనాల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల రైతులు యోగాంధ్రలో పాల్గొని ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ.. ఈరోజు రైతులతో కలిసి యోగాలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ప్రతిరోజూ యోగాసనాల ద్వారా ప్రజల్లో మార్పు తీసుకువస్తున్నారని తెలిపారు. చిన్న చిన్న టెక్నిక్ ద్వారా యోగాను పాటిస్తే మంచి ఆరోగ్యం సంపాదించవచ్చన్నారు.
కామన్ యోగాసనాలతో అనేక రుగ్మతలను దూరం పెట్టవచ్చని చెప్పుకొచ్చారు. నేడు బిజీ లైఫ్‌లో అందరూ ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోందని.. బీపీ, షుగర్‌లు, ఇతర జబ్బులు పెరుగుతున్నాయన్నారు. యోగాసనాల ద్వారా వీటిని శరీరంలోకి రాకుండా చేయవచ్చని తెలిపారు. ప్రణాయామం, ధ్యానం యోగాలో చాలా ముఖ్యమన్నారు. మనం చేసే పనిపై ధ్యాస పెట్టి చేస్తే మంచి ఫలితాలు కూడా వస్తాయని అన్నారు. మన మైండ్‌కు ఇవ్వాల్సిన రిలాక్సేషన్ ఇప్పుడు ఇవ్వడం లేదని.. అటువంటి ఒత్తిడిని తట్టుకోవాలంటే యోగా, ధ్యానం, నడక అవసరమని వెల్లడించారు. 2015 తరువాత ప్రపంచ యోగా డేగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రకటించారన్నారు. జూన్ 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పాల్గొననుండటం ఆనందంగా ఉందన్నారు. ఈ బీఆర్టీఎస్ రోడ్‌ను యోగా రోడ్‌గా మార్చడం శుభపరిణామమని ఢిల్లీ రావు అన్నారు.
యోగా ఆరోగ్యం, ఆనందాన్ని ఇస్తుంది: కలెక్టర్
యోగాంధ్రలో భాగంగా మాసోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోందని కలెక్టర్ లక్ష్మీ శా అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పది లక్షల మంది, రాష్ట్రం మొత్తం మీద రెండు కోట్ల మంది యోగాలో భాగస్వామ్యం చేయడం ప్రభుత్వం ఉద్దేశమని తెలిపారు. యోగా ద్వారా మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉంటారన్నారు. బీఆర్టీఎస్ రోడ్‌ను నిత్య యోగా రోడ్‌గా మార్చామన్నారు. ఇక నుంచి విజయవాడ వాసులు ప్రతి రోజూ ఈ రోడ్‌లో యోగాసనాలు వేసుకోవచ్చన్నారు. ప్రతిరోజూ 45 నిమిషాల పాటు చేసే యోగా... ఆరోగ్యం, ఆనందాన్ని ఇస్తుందని కలెక్టర్ లక్ష్మీ శా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
రెండో రోజుకు సిట్ కస్టడీ విచారణ.. నిందితులు ఏం చెప్పనున్నారో
ఆసియా అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడితో కేంద్ర మంత్రి భేటీ
Read Latest AP News And Telugu News
Updated Date - May 31 , 2025 | 10:32 AM