Kommeneini Bail Update: రేపటి వరకు జైల్లోనే కొమ్మినేని
ABN, Publish Date - Jun 15 , 2025 | 04:56 AM
రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో జైల్లో ఉన్న నిందితుడు(ఏ2), సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్‌పై బయటకు వచ్చేందుకు వరుస సెలవులు అడ్డంకిగా మారాయి...
వరుస సెలవులతో బెయిల్ జాప్యం
గుంటూరు, జూన్ 14(ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో జైల్లో ఉన్న నిందితుడు(ఏ2), సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్‌పై బయటకు వచ్చేందుకు వరుస సెలవులు అడ్డంకిగా మారాయి. దీంతో సోమవారం వరకు ఆయన జైల్లోనే ఉండాల్సి ఉంటుందని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ నెల 6న సాక్షి చానల్ డిబేట్‌లో రాజధాని ప్రాంత మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎనలిస్టు కృష్ణంరాజును ప్రధాన నిందితుడిగా, ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా ప్రోత్సహించినట్లుగా మాట్లాడిన కొమ్మినేనిని ఏ2గా, సాక్షి యాజమాన్యాన్ని ఏ3గా పేర్కొంటూ తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడైన కొమ్మినేనిని ఈ నెల 9న పోలీసులు అరెస్టు చేసి 10న మంగళగిరి కోర్టులో హాజరు పరచగా ఆయనకు మెజిరేస్టట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే, ఆయన దీనిపై హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా అది విచారణలో ఉన్న సమయంలోనే.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. ట్రయల్ కోర్టు విధించే షరతులకు లోబడి బెయిల్ ఇస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అయితే, సుప్రీంకోర్టు ఉత్తర్వులు శుక్రవారం సాయంత్రం వరకు రాకపోవడంతో కొమ్మినేని విడుదల జాప్యమైంది. మరుసటి రోజు రెండవ శనివారం సెలవు అయినప్పటికీ మెజిరేస్టట్‌ను ఇంటి వద్ద కలసి బెయిల్ ఆదేశాలు తీసుకోవాలని ఆయన న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో సోమవారం న్యాయవాదులు ట్రయల్ కోర్టులో కొమ్మినేని బెయిల్ ఉత్తర్వులు పొందనున్నారు. దీంతో సోమవారం సాయంత్రానికి గాని కొమ్మినేని బయటకు వచ్చే అవకాశం ఉండదని న్యాయవాదులు తెలిపారు. ఇదిలావుంటే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన(ఏ1) కృష్ణంరాజు ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కొమ్మినేనికి వైసీపీకి చెందిన లీగల్ సెల్ న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే, కృష్ణంరాజు మాత్రం సొంతంగా న్యాయవాదిని పెట్టుకున్నట్లు తెలిసింది.
Updated Date - Jun 15 , 2025 | 04:58 AM