ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జనం చెవిలో జగన్‌ పూలు!

ABN, Publish Date - Jun 19 , 2025 | 06:11 AM

వైసీపీ అధినేత జగన్‌ పల్నాడు జిల్లా పర్యటన అంతా అబద్ధాలు, కట్టు కథలతో సాగింది. చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పి అబద్ధాలను నిజం చేయాలని తెగ తాపత్రయపడ్డారు.

  • పల్నాడు పర్యటనలో కట్టుకథలు.. అబద్ధాలను నిజాలుగా

  • నమ్మించే యత్నం.. ఓ సామాజిక వర్గంపై ఎనలేని ప్రేమ

(గుంటూరు-ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్‌ పల్నాడు జిల్లా పర్యటన అంతా అబద్ధాలు, కట్టు కథలతో సాగింది. చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పి అబద్ధాలను నిజం చేయాలని తెగ తాపత్రయపడ్డారు. రెంటపాళ్ల పర్యటనలో ‘కమ్మ’ సామాజిక వర్గంపై ఎనలేని ప్రేమను ఒలకబోస్తూ జగన్‌ మాట్లాడటం పలువురిని ఆశ్చర్యం కలిగించింది. అధికారంలో ఉన్నప్పుడు అవధులు లేకుండా అక్రమాలకు, అన్యాయానికి పాల్పడిన పలువురు మాజీ ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావిస్తూ.. ఏం పాపం చేశారని వాళ్ల మీద కేసులు పెట్టారంటూ ఆవేశంగా ప్రశ్నించారు. జగన్‌ పర్యటనలో ప్రశ్నలు, కట్టు కథలకు అసలు జవాబులు ఇవీ..

జగన్‌: 2024 జూన్‌ 4న నాగమల్లేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు టీడీపీ అధికారంలోకి వచ్చిందని తెలియగానే సీఐ రాజేష్‌ కాల్చేస్తానని నాగమల్లేశ్వరరావును బెదిరించారు. జూన్‌ 5న నాగమల్లేశ్వరరావును స్టేషన్‌ నుంచి విడిచి పెడితే గుంటూరులోని తన సోదరుడు ఇంటికి వెళ్లాడు. అక్కడ పురుగు మందుతాగి చనిపోయాడు.

ఇదీ నిజం: 2024 జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వైసీపీ గెలుస్తుందని నాగమల్లేశ్వరరావు రూ.2 కోట్ల వరకు బెట్టింగ్‌ పెట్టాడు. ఇందుకోసం అప్పులు చేశాడు. గ్రామస్థులతో గొడవ జరిగింది. ఇరువురు పోలీసులను ఆశ్రయించారు. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను డబ్బులు ఇవ్వాల్సిన వారిని బెదిరించేందుకు నాగమల్లేశ్వరరావు పురుగుల మందు తాగాడు. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూన్‌ 9న ప్రాణం విడిచాడు. పోలీసులు వేధింపుల మూలంగా నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రచారం చేసిన అంబటి రాంబాబు గ్యాంగ్‌ రెంటపాళ్ల గ్రామంలో భారీ దాడులకు పాల్పడింది.

జగన్‌: మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఏం పాపం చేశాడు?

నిజం: పెదకూరపాడు నియోజకవర్గంలో శంకరరావు చేయని అరాచకం లేదు. వైసీపీ పాలనలో ఆ నియోజకవర్గంలోని ఇసుకను తవ్వేసి వందల కోట్లు వెనకేశారు. అదేమని ప్రశ్నించిన వారిని అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించారు.

జగన్‌: మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఏం పాపం చేశాడు?

నిజం: వినుకొండ ఎమ్మెల్యేగా బొల్లా బ్రహ్మనాయుడు భూములు ఆక్రమించి, జగనన్న కాలనీల పేర్లతో రూ. కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. ఆఖరికి గిట్టుబాటు ధర లేదని ప్రశ్నించిన రైతుపై ఏకంగా ఎంపీ సమక్షంలోనే చెప్పుతో దాడి చేసిన వ్యక్తిత్వం ఆయనిది. ఓట్లు వేసి గెలిపించిన వాళ్లు తన వద్దకు పని కోసం వస్తే ఎన్నికలప్పుడు ఇచ్చిన డబ్బులు తిరిగి కక్కమని సొంత పార్టీ కేడర్‌నే బూతులు తిట్టిన నైజం ఆయనిది. అటువంటి బ్రహ్మనాయుడును జగన్‌ వెనుకేసుకురావటం విస్మయం కలిగించింది.

జగన్‌: తెనాలి మాజీ ఎమ్మెల్యే శివ ఏం పాపం చేశాడు?

నిజం: శివ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెనాలిలో ఆర్థిక నేరాలకు పాల్పడి, గంజాయి, రౌడీ మూకలను ప్రోత్సహించారు. ఎన్నికల రోజు ఓటరుపై దాడికి పాల్పడ్డారంటే ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు.

జగన్‌: దగ్గుబాటి సురేశ్‌ స్థలం అనుమతులు రద్దు చేశారు

నిజం: విశాఖలో సినిమా స్టూడియా నిర్మాణం కోసం సురేశ్‌ ప్రొడక్షన్స్‌కు గతంలో దాదాపు 34 ఎకరాలు ఇచ్చారు. ఇందులో కొంత స్థలంలో మాత్రమే స్టూడియో కట్టారు. మిగిలిన స్థలం ఖాళీగా ఉంది. ఈ స్థలాన్ని సినిమా స్టూడియో నిర్మాణం కోసం మాత్రమే వినియోగించాలని.. రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ అవసరాలకు వాడరాదని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఈ ఖాళీ స్థలంపై ఆ పార్టీ నేతలు కన్నేశారు. 15 ఎకరాల్లో లే అవుట్‌ వేయించి సగం ప్లాట్లను వైసీపీ నేతలు కొట్టేశారు. దీంతో టీడీపీ ప్రభుత్వం ఆ 15 ఎకరాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. కాగా, గతంలో వైసీపీ ఎమ్మెల్యేలైన మరికొందరని ప్రస్తావిస్తూ మహానుబావులుగా జగన్‌ కీర్తించారు. తన పార్టీలో ఉండటమే వారు చేసిన తప్పా అని వెనకేసుకొచ్చారు. కొడాలి నాని, వంశీ, అబ్బయ్య చౌదరి, అవినాశ్‌ వంటి వారి గురించి ప్రస్తావిస్తూ వారిని కీర్తించేందుకు జగన్‌ ప్రయత్నించారు.

Updated Date - Jun 19 , 2025 | 06:11 AM