Jagan False Claims Exposed: అడ్డంగా.. అబద్ధాలు
ABN, Publish Date - May 23 , 2025 | 04:34 AM
జగన్ చెప్పిన విషయాల్లో చాలా అబద్ధాలున్నాయని ప్రత్యక్ష సాక్షాలతో అర్థమవుతోంది. అమరావతిపై తప్పుడు లెక్కలు, బాలాజీ గోవిందప్పపై తప్పుదోవ పట్టే వ్యాఖ్యలు చేశారు.
భారతి సిమెంట్స్‌లో బాలాజీ ఫుల్‌టైమ్ డైరెక్టర్
అయినా.. ఆయనెవరో తెలియనట్లు బిల్డప్
‘ఉర్సా’కు అరకోటి, కోటి చొప్పున భూమి
అది తెలిసీ.. ఇడ్లీ, వడ అంటూ కబుర్లు
నాడు ఐఏఎస్, ఐపీఎస్‌లపై వేధింపులు
అవి మరిచి.. నేడు ఆవేదన, ఆక్రోశం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
అబద్ధమని తెలిసీ... పదేపదే దాన్నే చెబుతూ... అదే నిజమని ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నించడం! వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఆది నుంచీ ఇదే వ్యూహం! గురువారం ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులతో ఆయన రెండుగంటలకు పైగా మాట్లాడి... అనేక అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలు, వింత భాష్యాలతో ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. కొందరైనా నమ్మకపోతారా అనే ధీమాతో కాబోలు... రకరకాల విన్యాసాలు ప్రదర్శించారు. వాటిలో మచ్చుకు కొన్ని చూద్దాం...
జగన్ మాట: చంద్రబాబు లిక్కర్ కేసులో కండిషనల్ బెయిలుపై ఉన్నారు. అంతకు మించిన స్కామ్ జరిగిందని చెప్పేందుకే భేతాళ కథలు చెబుతున్నారు.
అసలు వాస్తవం: జగన్ సర్కారు చంద్రబాబుపై స్కిల్ కేసు పెట్టి... అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆ కేసులో మాత్రమే బెయిలుపై ఉన్నారు. అయితే... ఆయన ఇలా బెయిలుపై రాగానే అలా మళ్లీ మళ్లీ అరెస్టు చేసేందుకు లిక్కర్ కేసు, రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు వంటివి అప్పటికప్పుడు బనాయించారు. ఈ విషయాన్ని చంద్రబాబు న్యాయవాదులు గ్రహించి... ముందుగానే కోర్టును ఆశ్రయించారు. ఒక దశలో చంద్రబాబును లిక్కర్ కేసులో తాము అరెస్టు చేయడం లేదని అప్పటి జగన్ ప్రభుత్వమే కోర్టుకు తెలిపింది. అయినప్పటికీ... న్యాయవాదులు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. కోర్టు కూడా ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంతేతప్ప... జగన్ చెప్పినట్లుగా చంద్రబాబు ‘కండిషనల్ బెయిలు’పై లేరు. అరెస్టు చేశాక వచ్చేది బెయిల్. అరెస్టు చేయకుండా వచ్చేది ముందస్తు బెయిల్. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. పదికిపైగా కేసుల్లో ‘కండీషనల్ బెయిలు’పై ఉన్న జగన్‌కు ఈ తేడా తెలియదంటే నమ్మలేం!
జగన్ మాట: ధనుంజయ్ రెడ్డి మంచి అధికారి. పీఎస్సార్ ఆంజనేయులు మంచి ఆఫీసర్. కొల్లి రఘురామి రెడ్డి, రిశాంత్ రెడ్డి లాంటి వారికి పోస్టింగ్ ఇవ్వకపోవడం అన్యాయం. ఇంకా ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలను చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తోంది.
అసలు వాస్తవం: వేధింపుల గురించి జగన్ మాట్లాడటమే ఒక చోద్యం! జగన్ సీఎంగా ఉన్నప్పుడు, ఆయన ఆదేశాల మేరకు అడ్డగోలు పనులు చేసి, ఆరోపణలు ఎదుర్కొన్న వారిపై ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. కొందరిపై చర్యలు తీసుకున్నారు. కానీ... జగన్ హయాంలో పలువురు ఐఏఎస్, ఐపీఎ్‌సలకు ఉద్దేశపూర్వకంగా పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రకు ఏడాదిపాటు పోస్టింగ్ ఇవ్వలేదు. మరో ఐఏఎస్ అధికారి ఎస్.సత్యనారాయణను ఏడాదిపాటు ఏపీలోనే లేకుండా చేశారు. మరో ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌కూ ఇదే పరిస్థితి. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పినా సరే ఐదేళ్ల పాటు పోస్టింగ్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.
బాలాజీ గోవిందప్పతో సంబంధంలేదా?
జగన్ మాట: ‘నా కంపెనీతో సంబంధంలేని వాళ్లు నాకోసం ఎందుకు పని చేస్తారు. బాలాజీ గోవిందప్పకు భారతీ సిమెంట్స్‌లో షేర్స్ ఉన్నాయి. అంతమాత్రాన కంపెనీ ఆయనదైపోతుందా?’
వాస్తవం: జగన్ చెప్పింది నిజమే! అదే సమయంలో... షేర్స్ ఉన్న వాళ్లంతా ఫుల్‌టైమ్ డైరెక్టర్లు, డైరెక్టర్లు కాలేరు. కానీ... భారతీ సిమెంట్స్‌లో బాలాజీ గోవిందప్ప సాధారణ షేర్ హోల్డర్ కాదు. ఆయన పూర్తిస్థాయి డైరెక్టర్. భారతీ సిమెంట్స్ వెబ్‌సైట్‌లోనే ఈ విషయం స్పష్టంగా ఉంది. భారతీ పాలిమర్స్‌లో కూడా బాలాజీ ఒక డైరెక్టర్. ప్రపంచంలో ఐదో అతి పెద్ద సిమెంట్ కంపెనీల్లో పని చేసే వ్యక్తికి తీరికే ఉండదంటున్న జగన్.... తన కుటుంబానికి చెందిన కంపెనీల్లో ఆయనను ఫుల్‌టైమ్ డైరెక్టర్‌గా ఎలా చేర్చుకోగలిగారో ఆయనకే తెలియాలి. తన కంపెనీలు వేరే, తన సతీమణి భారతీ కంపెనీలు వేరే అన్నట్లుగా జగన్ మాట్లాడటమే అన్నింటికంటే విచిత్రం.
ఐదేళ్లూ ముంచి... అమరావతిపై మళ్లీ విషం
జగన్ మాట: అమరావతిని బంగారంతో కడుతున్నారా? చదరపు అడుగు నిర్మాణానికి రూ.2500 సరిపోతుంది. కానీ... దానిని గతంలో రూ.4880లుగా పేర్కొన్నారు. ఇప్పుడు ఇంకా పెంచేశారు. ఈ ధరతో బొంబాయి. బెంగళూరులో హైరైజ్ బిల్డింగ్‌లలో ఫ్లాట్లు వస్తాయి. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ అంటూనే భారీగా అప్పులు ఎందుకు చేస్తున్నారు?
అసలు వాస్తవం: ఐదేళ్లపాటు అమరావతిని అటకెక్కించి, నిర్మాణాలను గాలికి వదిలేసి... ఇప్పుడు ‘వామ్మో అంతా ఖర్చా’ అని వాపోవడం జగన్‌కే చెల్లింది. ఐకానిక్ టవర్లకు అప్పట్లో రూ.2276 కోట్లకు టెండర్లు పిలిస్తే, ఇప్పుడు 4,668 కోట్లకు పెంచారన్నది జగన్ ఆరోపణ. అప్పట్లో ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్ లేకుండా రూ.2276 కోట్లకు టెండరు పిలిచారు. ఇప్పుడు... ఆ పనులతో కలిపి ధర నిర్ణయించారు. జగన్ నిర్వాకం కారణంగా ఐదేళ్లుగా ఈ నిర్మాణాలు నీళ్లతో నానుతూ ఉన్నాయి. ఇన్నేళ్లలో ఎన్నిసార్లు ఎస్‌ఎ్‌సఆర్ రేట్లు పెరిగాయో జగన్‌కు తెలియదా అన్నది ప్రశ్న. హైదరాబాద్‌లో కట్టిన తెలంగాణ సచివాలయానికీ, ఇక్కడ అమరావతిలో నిర్మించ తలపెట్టిన సచివాలయం, జీఏడీ టవర్లకూ మధ్య సంబంధమే లేదు. అయినా... దానికీ, దీనికీ మధ్య జగన్ పోలిక తెచ్చారు. ఇక... ఇప్పటికే ఉన్న అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు వృథా అవుతాయన్నట్లుగా ఆయన వాపోయారు. నిజానికి... ఈ భవనాల్లో ఇతర శాఖల కార్యాలయాలు, ప్రస్తుతమున్న హైకోర్టు భవనంలో ‘జిల్లా కోర్టుల కాంప్లెక్స్’ ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించారు. జాతీయ రహదారుల నిర్మాణానికి అయ్యే వ్యయంతో అమరావతిలో రహదారుల ఖర్చును పోల్చుతూ... ‘ఇంత దోపిడీనా’ అని జగన్ ఆరోపణలు గుప్పించారు. నిజానికి... హైవేల నిర్మాణంలో రహదారి ఖర్చు మాత్రమే ఉంటుంది. అమరావతిలో రోడ్ల పనుల్లో అనేక కాంపోనెంట్స్ ఉన్నాయి. డ్రెయినేజీ, వాటర్ సప్లై, వీధి దీపాలు, రెయిన్ వాటర్ రీయూసేజ్, విద్యుత్, ఇంటర్నెట్ తదితర కేబుళ్లను భూగర్భంలో వేసే కాంక్రీట్ డక్ట్స్, పాత్‌వేలు, సైకిల్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ వంటివన్నీ ఇందులో భాగమే. అందుకే... నిర్మాణ వ్యయం ఎక్కువ. దోపిడీ కోసమే ‘జ్యుడీషియల్ ప్రివ్యూ’ను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసిందని జగన్ మరో ఆరోపణ చేశారు.
అమరావతి పునర్నిర్మాణ పనులను సింహభాగం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, హ డ్కో, కేఎ్‌ఫడబ్ల్యూ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి తీసుకుంటున్న రుణంతో చేపట్టారు. ఈ సంస్థలు టెండర్ల ప్రక్రియ నుంచి పనుల పూర్తిదాకా ప్రతి దశనూ నిశితంగా పరిశీలించి, పర్యవేక్షిస్తాయి. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని చెబుతూ వేల కోట్ల అప్పులు ఎందుకు తెస్తున్నారని జగన్ మరో ప్రశ్న సంధించారు. అప్పులు తేవడం నిజమే. వాటిని ప్రభుత్వం చెల్లించదు. అమరావతిలో భూములు విక్రయించడం ద్వారానే రుణాలు తిరిగి చెల్లించేలా ఇప్పటికే ప్రణాళిక రచించారు.
- విజయవాడ, ఆంధ్రజ్యోతి
మళ్లీ అదే ఇడ్లీ వడ కథ
జగన్ మాట: ‘ఊరూ పేరూ లేని ఉర్సా అనే కంపెనీకి ఎకరం రూపాయికే కట్టబెట్టారు. రూపాయికి ఇడ్లీ వడ కూడా రావు!’
అసలు వాస్తవం: జగన్ ఈ అబద్ధం చెప్పడం ఇది తొలిసారి కాదు. ఆయన చెబుతున్నట్లుగా ఉర్సా... అనేది ఊరూ పేరూ లేని కంపెనీ కాదు. తెలుగు వారికే చెందిన అంతర్జాతీయ కంపెనీ. ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దీనికోసం ఇక్కడ స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేసింది. ఉర్సాకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయికే భూమి ఇచ్చిందనడం పచ్చి అబద్ధం. కాపులుప్పాడలో ఎకరం రూ.50 లక్షలు, ఐటీ పార్కులో రూ.కోటి చొప్పున ధర నిర్ణయించి భూమి కేటాయించింది. ఇదీ అసలు వాస్తవం. అయినా సరే... అన్నీ తెలిసీ... ‘ఇడ్లీ వడ’ కబుర్లు చెప్పడం జగన్‌కే చెల్లింది.
ఎవరీ ‘క్రాంతిలాల్ రాణా’
ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్, సంజయ్, పీఎస్సార్ ఆంజనేయులు, విశాల్ గున్నీలాంటి వారిని సస్పెండ్ చేశారని చెబుతూ... ‘క్రాంతిలాల్ రాణా’ అనే పేరూ జగన్ ప్రస్తావించారు. దీంతో... క్రాంతిలాల్ రాణా ఎవరా అని అంతా అయోమయానికి గురయ్యారు. ఇవి... ‘కాంతిరాణా తాతా’ అనే అధికారి పేరుకు వచ్చిన తిప్పలు. ముంబై నటి జెత్వానీ కేసులో కాంతిరాణాను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. జగన్ చెప్పినట్లుగా... ‘క్రాంతి లాల్ రాణా’ పేరుతో అధికారులెవరూ లేరు. ప్రస్తుతం ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి పేరు... కాంతిలాల్ దండే!
Updated Date - May 23 , 2025 | 04:40 AM