NREGS: పంటకుంటలతో సాగుకు మహర్దశ
ABN, Publish Date - May 05 , 2025 | 05:41 AM
ఉపాధి హామీ పథకంలో వినూత్న పంటకుంటలు తవ్వడం ద్వారా రైతులకు మరిన్ని ప్రయోజనాలు వస్తున్నాయి. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడమే కాకుండా, అదనపు ఆదాయ మార్గాలూ ఏర్పడుతున్నాయి.
ఉపాధి పథకంలో 1.55 లక్షల కుంటలు లక్ష్యం .. ఇప్పటికి 25 వేల కుంటల తవ్వకం పూర్తి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో వినూత్న పనులు చేపట్టడం ద్వారా పేదవర్గాలతో పాటు సన్న, చిన్నకారు రైతులకు పలు ప్రయోజనాలు దక్కుతున్నాయి. అడుగంటిపోతున్న భూగర్భజలాలను భూమి పైపొరలకు తీసుకురావడం ద్వారా పొలాల్లో సిరులు పండించేందుకు ఉపాధి హామీ పథకం ఎంతో ఉపయోగపడుతోంది. అందుకోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన గ్రామీణాభివృద్ధిశాఖ తాజాగా పొలాల్లో పంటకుంటల వల్ల విస్తృత ప్రయోజనాలు కలుగుతాయని భావించింది. ప్రతి రైతు పొలంలో కొంత స్థలంలో కుంటలు తవ్వడం ద్వారా వర్షాకాలంలో నీటిని నిల్వ చేసుకోవడంతో భూగర్భజలాలు పెరిగేందుకు కృషిచేస్తున్నారు. ఒకసారి వర్షం వచ్చినప్పుడు ఒక్కో పంటకుంట ద్వారా 1.80 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసుకునే అవకాశం కల్పించారు. రైతులు ఒక్క పైసా చెల్లించకుండానే ఉపాధి పథకం ఈ అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 1.55 లక్షల పంటకుంటల తవ్వడం ద్వారా దాదాపు ఒక టీఎంసీ వర్షపు నీటిని నిల్వ చేసుకోవచ్చని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కృష్ణతేజ తెలిపారు. బోరుబావులు లేని రైతులకు పంటకుంటలే పంటసంజీవనిలు. పంటకుంటచుట్టూ వేసిన మట్టికట్టమీద ఆకుకూరలు, కూరగాయలు పండించుకుని అదనపు ఆదాయం పొందే అవకాశముంది. దీర్ఘకాలంలో ఆదాయాన్నిచ్చే బొప్పాయి, అరటి, జామ, కరివేపాకు వంటి మొక్కలను నాటుకోవడం, మందుల పిచికారి ద్వారా అదనపు ప్రయోజనం పొందొచ్చు. ఈ కుంటలలో చేపలు కూడా పెంచుకోవచ్చు. బోరుబావి ఉన్న పొలంలో పంటకుంటలు తవ్వడం వల్ల ఊట పెరిగి రైతు ఎక్కువ విస్తీర్ణంలో వ్యవసాయం చేసుకోవడానికి అవకాశముంటుంది. ఉపాధి పథకం ద్వారా ఈ పంటకుంటల తవ్వడం ద్వారా రైతుకు రూ.50 వేల ఖర్చు ఆదా అవుతుంది. వాటి నిర్మాణం వల్ల పొలం నష్టం పోతామనే భావన నుంచి బయటకు వచ్చి.. బహువిధాలుగా ఆదాయాన్నిచ్చే పంటకుంటలను తవ్వించుకుని ప్రతి రైతు లబ్ధిపొందాలని కమిషనర్ కృష్ణతేజ ఒక ప్రకటనలో కోరారు.
అల్లూరి జిల్లాలో 4,030 కుంటలు పూర్తి..
రాష్ట్రంలో ఈ ఏడాది 1.55 లక్షల పంటకుంటలు తవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటిదాకా 25 వేల పంటకుంటల తవ్వకాలను పూర్తి చేశారు. ఇందులో అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4,030, అన్నమయ్య జిల్లాలో 3,067, పార్వతీపురం మన్యం జిల్లాలో 2,521 పంటకుంటల తవ్వకాలు పూర్తి చేశారు. తద్వారా ఈ మూడు జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
ఇవి కూడా చదవండి
Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..
India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్
Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన
For National News And Telugu News
Updated Date - May 05 , 2025 | 05:41 AM