High Court: పోలీసులు ఎలా బెదిరిస్తారో బాగా తెలుసు
ABN, Publish Date - Jul 30 , 2025 | 04:34 AM
కేసు రాజీ చేసుకోవాలని స్టేషన్‌కు పిలిచి పోలీసులు ఎంత ఒత్తిడి చేస్తారో, ఎలా బెదిరిస్తారో తమకు బాగా తెలుసని హైకోర్టు పేర్కొంది.
కేసుల రాజీకి ఎంత ఒత్తిడి తెస్తారో కూడా తెలుసు
మాకేమీ తెలియదని అనుకోవద్దు: హైకోర్టు
ఎస్‌హెచ్‌వోకు కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచన
అమరావతి, జూలై 29(ఆంధ్రజ్యోతి): కేసు రాజీ చేసుకోవాలని స్టేషన్‌కు పిలిచి పోలీసులు ఎంత ఒత్తిడి చేస్తారో, ఎలా బెదిరిస్తారో తమకు బాగా తెలుసని హైకోర్టు పేర్కొంది. పోలీసుల ఒత్తిడి చేస్తున్నారంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆరోపణల్లో వాస్తవం లేదన్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) వాదనను తోసిపుచ్చింది. తమకు ఏమీ తెలియదని అనుకోవద్దని వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యలకు పాల్పడకుండా సంబంధిత ఎస్‌హెచ్‌వోకు కౌన్సెలింగ్ ఇవ్వాలని ఎస్‌జీపీకి సూచించింది. కౌన్సిలింగ్ అంటే పోలీసులు ఇచ్చే విధానంలో కాదని తెలిపింది. బెదిరింపులకు, ఒత్తిళ్లకు పాల్పడకుండా ఎస్‌హెచ్‌వోకు తగిన సూచనలు చేయాలని పేర్కొంది. పిటిషనర్ భర్త విషయంలో జోక్యం చేసుకోవద్దని ఎస్‌హెచ్‌వోకు స్పష్టం చేసింది. వ్యాజ్యంపై విచారణను మూసివేసింది. కేసును రాజీ చేసుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తే కోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్ భర్తకు వెసులుబాటు ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ జగడం సుమతితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. తన భర్త పఠాన్ కరీంసాను పిడుగురాళ్ల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, కోర్టు ముందు హాజరుపర్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన సతీమణి పఠాన్ సైదాబీ హెబియస్ కార్పస్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం కరీంసాను స్థానిక కోర్టులో హాజరుపర్చి, అతని వాంగ్మూలాన్ని నమోదు చేయించాలని పోలీసులను ఆదేశించింది. మంగళవారం తమ ముందు హాజరుపర్చాలని స్పష్టం చేసింది. మంగళవారం వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా పఠాన్ కరీంసా కోర్టు ముందు హాజరయ్యారు. పోలీసులు ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు? ఎప్పుడు వదిలేశారు? అనే వివరాలు ధర్మాసనం అడిగి తెలుసుకొంది. కరీంసా కోర్టు ముందు హాజరైన నేపథ్యంలో పిటిషన్‌పై విచారణను మూసివేస్తామని ప్రకటించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సూరపరెడ్డి గౌతమి, ఎస్‌జీపీ టి.విష్ణుతేజ వాదనలు వినిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్
Read latest AndhraPradesh News And Telugu News
Updated Date - Jul 30 , 2025 | 04:34 AM