AP High Court: ఎంపిక కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే
ABN, Publish Date - Apr 30 , 2025 | 05:27 AM
హైకోర్టు ధర్మాసనం తీర్పుతో వినియోగదారుల ఫోరాల నియామకాల్లో ప్రభుత్వ స్వేచ్ఛకి పరిమితి ఏర్పడింది. ఎంపిక కమిటీ తీర్పును కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది
ఆ నిర్ణయాన్ని సమీక్షించడానికి వీలు లేదు
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
వినియోగదారుల ఫోరం అధ్యక్షులు, సభ్యుల నియామకంలో వైసీపీ ప్రభుత్వం అధికార పరిధి దాటి వ్యవహరించిందని వ్యాఖ్య
నెల రోజుల్లో ఎంపిక కమిటీని పునర్నియమించాలి
2 నెలల్లో నియామకాలు పూర్తిచేయాలని ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): జిల్లాల వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ అధ్యక్షులు, సభ్యుల నియామకం విషయంలో మెరిట్ ఆధారంగా ఎంపిక కమిటీ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. కమిటీ నిర్ణయాన్ని ప్రభుత్వం తిరిగి సమీక్షించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అభ్యర్థుల గురించి ఏదైనా అదనపు సమాచారం అందితే వివరాలను ఎంపిక కమిటీ ముందు ఉంచాలి తప్ప నియామకాల విషయంలో ప్రభుత్వం నేరుగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని పేర్కొంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారీతిన చేపట్టిన కడప, గుంటూరు, నెల్లూరు జిల్లాల వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ అధ్యక్షులు.. కడప, తిరుపతి కమిషన్ సభ్యుల నియామకాన్ని రద్దుచేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం సమర్థించింది.
అధ్యక్షులు, సభ్యుల నియామకం విషయంలో అప్పటి ప్రభుత్వం అధికార పరిధి దాటి వ్యవహరించిందని పేర్కొంది. నిబంధనల మేరకు నెల రోజుల్లో ఎంపిక కమిటీని పునర్నియమించాలని ఆదేశించింది. ఈ మూడు జిల్లాల వినియోగదారుల ఫోరాల అధ్యక్ష.. కడప, తిరుపతి ఫోరాల సభ్యుల పదవుల కోసం దరఖాస్తు చేసుకున్నవారి నేపథ్యం, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం, ఇతర సమాచారాన్ని పునఃపరిశీలన కోసం ఎంపిక కమిటీ ముందుంచాలని స్పష్టం చేసింది. నియామక ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ ఎన్.విజయ్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో గుంటూరు, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షులు, కడప, తిరుపతి ఫోరాల సభ్యుల నియామకాన్ని రద్దుచేస్తూ గతేడాది నవంబరు 15న సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ గుంటూరు, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఫోరం అధ్యక్షులు టి.సునీత, అబ్దుల్ రసూల్, జింక రెడ్డి శేఖర్, అనిత, కడప, తిరుపతి ఫోరం సభ్యులు డి.అమృత, నాగశశిధర్‌రెడ్డి గతేడాది ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై ధర్మాసనం ఇటీవల తుది విచారణ జరిపింది. కడప, గుంటూరు, నెల్లూరు జిల్లాల వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ అధ్యక్షులు, కడప, తిరుపతి కమిషన్ సభ్యుల నియామకాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. చిత్తూరు జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలి నియామక రద్దును పక్కనపెట్టింది.
ఇవి కూడా చదవండి
AP Govt: ‘వేస్ట్ మేనేజ్‌మెంట్’పై కీలక ఒప్పందం
Gorantla Madhav: ఈ ప్రభుత్వాన్ని అసహ్యించుకొంటున్న ప్రజలు
Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి
Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
For More AP News and Telugu News
Updated Date - Apr 30 , 2025 | 05:27 AM