Weather Warning: మరో 2 రోజులు భారీ వర్షాలు, ఎండలు.. కోస్తా జిల్లాలకు విపత్తుల శాఖ హెచ్చరిక
ABN, Publish Date - May 06 , 2025 | 04:50 AM
రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో ఉష్ణోగ్రతలు 41-43 డిగ్రీల వరకు చేరతాయని, కొంతమంది ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కోస్తా జిల్లాలకు కూడా భారీ వర్షాలు, ఈదురుగాలులు అనుకోకుండా తీవ్రత చూపిస్తాయని వెల్లడించింది.
అమరావతి, విశాఖపట్నం, మే 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని చోట్ల 41-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, గంటకు 50-60కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని వివరించింది. మేఘాలు కమ్ముకున్న వెంటనే పొలాలు, తోటల్లో ఉండే వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. రుతుపవనాల రాకకు ముందు.. అంటే మే నెలలో పిడుగులు, ఈదురుగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొన్నారు.
తీవ్రమైన ఎండతో వాతావరణంలో ఎక్కువ మార్పులు వస్తుండడంతో ఉద్యానవన పంటలకు ఎక్కువ నష్టం సంభవిస్తుందని పేర్కొన్నారు. రుతుపవనాల రాకకు ముందు అకాలవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కోసిన పంటను కల్లాల్లో భద్రపరిచేటేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, సోమవారం నంద్యాల జిల్లా పసుపులలో 42.5, కడప జిల్లా జమ్ములమడకలో 42.4, పల్నాడు జిల్లా రావిపాడులో 42.1, కర్నూలు జిల్లా కలుగోట్లలో 41.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Updated Date - May 06 , 2025 | 08:16 AM