YSRCP Jagan Mohan Reddy: సింగయ్య మృతి కేసులో జగన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా
ABN, Publish Date - Jun 27 , 2025 | 04:35 AM
సింగయ్య మృతి కేసులో తమపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
ఆయన పీఏ, వైవీ, పేర్ని, రజని వ్యాజ్యాలపైనా..
అమరావతి, జూన్ 26(ఆంధ్రజ్యోతి): సింగయ్య మృతి కేసులో తమపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. గురువారం ఇవి కోర్టు ముందుకు రాగా.. అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.. మొదటిసారి విచారణకు వచ్చాయని.. తనతోపాటు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తారని.. కేసు డైరీ, ఇతర వివరాలు తెప్పించుకోవలసి ఉందని తెలిపారు.
వ్యాజ్యాలపై సోమవారం లేదా మంగళవారం విచారణ చేపట్టాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సి.రఘు, న్యాయవాదులు వై.నాగిరెడ్డి, దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.... పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు పిటిషనర్లకు వర్తించవన్నారు. పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకుంటారనే ఆందోళన ఉందని తెలిపారు. వివరాలు తెప్పించుకునేందుకు ఏజీ సమయం కోరుతున్నందున అరెస్టు నుంచి పిటిషనర్లకు రక్షణ కల్పించాలని కోరారు.
తొందరపాటు చర్యలు తీసుకోబోమని ఏజీ హామీ ఇచ్చినా అభ్యంతరం లేదన్నారు. దమ్మాలపాటి జోక్యం చేసుకుంటూ.. క్వాష్ పిటిషన్ ద్వారా అరెస్టు నుంచి రక్షణ కోరలేరని, ఈ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకుంటారని పిటిషనర్లకు ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకుని ఉండాల్సిందన్నారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. అప్పటివరకు పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోబోరని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
Updated Date - Jun 27 , 2025 | 04:35 AM