Ambati Cases Filed: అంబటి ఫిర్యాదుపై నాలుగు కేసుల నమోదు
ABN, Publish Date - May 01 , 2025 | 04:07 AM
అంబటి రాంబాబు ఇచ్చిన ఐదు ఫిర్యాదులలో నాలుగు కేసులు నమోదయ్యాయి, అయితే మరొక కేసులో ఆయన బాధితుడు కాబట్టీ కేసు నమోదు కాలేదు. కోర్టు విచారణను జూన్ 18కి వాయిదా వేసింది
మరో కేసులో ఆయన బాధితుడు కాదు
హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వ న్యాయవాది
వైసీపీ నేత అంబటి రాంబాబు ఇచ్చిన ఐదు ఫిర్యాదులకుగాను పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారని హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది బుధవారం హైకోర్టుకు తెలిపారు. మరో కేసులో పిటిషనర్ బాధితుడు కానందున కేసు నమోదు చేయలేదన్నారు. కాగ్నిజబుల్ కేసుల్లో మాత్రమే మూడో వ్యక్తి ఫిర్యాదు చేయగలరన్నారు. పార్టీ ఇన్ పర్సన్ రాంబాబు నేరుగా వాదనలు వినిపిస్తూ అసభ్యకర పోస్టుల వ్యవహారంలో తాను ఐదు ఫిర్యాదులు ఇవ్వగా అందులో నాలుగింటిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. మరో ఫిర్యాదుపై కేసు నమోదుకు పోలీసులు నిరాకరిస్తున్నారన్నారు. తమ నాయకుడి ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారన్నారు. తెలుగులో వాదనలు వినిపించేందుకు అనుమతించాలని కోరారు. న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు స్పందిస్తూ... తెలుగులో వాదనలకు అనుమతిస్తే మిమ్మల్ని నియంత్రించలేమని సరదాగా వ్యాఖ్యానించారు. వాదనను బలపర్చే తీర్పులను కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను జూన్18కి వాయిదా వేశారు.
Updated Date - May 01 , 2025 | 04:07 AM