SP Somanath: ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్
ABN, Publish Date - Mar 20 , 2025 | 03:37 AM
ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ ఎస్పీ సోమనాథ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వ్యవసాయం,పరిశ్రమలు, విపత్తులు, పాలనలో టెక్నాలజీ వాడకంపై సలహాలు
మరో ముగ్గురు ప్రముఖులకూ అవకాశం.. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్‌కు జి.సతీశ్‌రెడ్డి
హ్యాండ్‌లూమ్స్ హబ్‌కు సుచిత్రా ఎల్లా.. ఫోరెన్సిక్ సైన్స్‌కు కేపీసీ గాంధీ
కేబినెట్ హోదాలో గౌరవ సలహాదారులుగా నియామకం
అమరావతి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ ఎస్పీ సోమనాథ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. సోమనాథ్‌కు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. వ్యవసాయ పనులు, విపత్తుల నియంత్రణ, ప్రభుత్వ పాలన, పరిశ్రమల నిర్వహణలో స్పేస్ టెక్నాలజీ వినియోగంపై ఆయన ప్రభుత్వానికి సలహాలు ఇస్తారు. అడ్వాన్డ్స్ స్పేస్ టెక్నాలజీ హబ్, టెస్టింగ్ సౌకర్యాల ఏర్పాటు, రీసెర్చ్ సెంటర్లు, క్లస్టర్ల ఏర్పాటులో ఆయన సూచనలు అందిస్తారు. కాగా, మరో ముగ్గురు ప్రముఖులను కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించింది.
కేంద్ర రక్షణ శాఖ శాస్ర్తీయ సలహాదారు జి.సతీశ్ రెడ్డిని ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గౌరవ సలహదారుగా నియమించారు. భారత్ బయోటెక్ ఎండీ, టీటీడీ సభ్యురాలు సుచిత్ర ఎల్లాను హ్యాండ్‌లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవల్‌పమెంట్ గౌరవ సలహాదారుగా ఎంపిక చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ గౌరవ సలహాదారుగా డాక్టర్ కేపీసీ గాంధీని నియమించారు. ఆయన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ ముగ్గురికి కేబినెట్ హోదా కల్పించారు.
Updated Date - Mar 20 , 2025 | 03:37 AM