Tourism Incentives AP: ఫైవ్‌స్టార్ హోటల్స్‌కు రాయితీలు
ABN, Publish Date - May 23 , 2025 | 06:44 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజం పాలసీ 2024-29 ప్రకారం విశాఖ, తిరుపతిలో ఫైవ్‌స్టార్ హోటళ్లకు భూ కేటాయింపులు చేసి రాయితీలు అందిస్తోంది. ఎస్‌జీఎస్‌టీ, స్టాంప్ డ్యూటీ, విద్యుత్ తదితర రంగాల్లో అనేక ప్రోత్సాహకాలు అందజేస్తోంది.
టూరిజం పాలసీ ప్రకారం భూ కేటాయింపులు
ఉత్తర్వులు జారీ చేసిన పర్యాటక శాఖ
అమరావతి, మే 22 (ఆంధ్రజ్యోతి): టూరిజం పాలసీ 2024-29 ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటయ్యే స్టార్ హోటల్స్‌కు ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో పాటు భూకేటాయింపులు చేసింది. ఈ మేరకు పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖలో ఒకటి, తిరుపతిలో రెండు ఫైవ్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చింది. బెంగుళూరుకు చెందిన స్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ సంస్థ తిరుపతిలో ఐబీఎస్ శైలిలో త్రీస్టార్ హోటల్‌తో పాటు నోవోటెల్ ఫైవ్‌స్టార్ క్లస్టర్ హోటల్‌ను ఏర్పాటు చేయనుంది. వీటి కోసం దాదాపు రూ. 327 కోట్లు ఖర్చు చేయనుంది. దీనికి టూరిజం పాలసీ ప్రకారం ప్రభుత్వం భారీగా రాయితీలు ఇచ్చింది. ఎస్‌జీఎ్‌సటీలో 12 ఏళ్ల పాటు వంద శాతం రాయితీ ప్రకటించింది. వంద శాతం స్టాంప్ డ్యూటీ రాయితీ, పరిశ్రమల ధరలకే విద్యుత్‌తో పాటు మరికొన్ని ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించనుంది. అలాగే ఒడిసాకు చెందిన బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ సంస్థ తిరుపతిలోని ఎస్.వి.పురం వద్ద రూ. 150 కోట్లతో ఫైవ్‌స్టార్ హోటల్ ఏర్పాటు చేయనుంది. దీనికి 12.7 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అద్దె ప్రాతిపదికన 66 ఏళ్లకు భూ కేటాయింపులు చేయడంతో పాటు హోటల్ నిర్వహణ ఆదారంగా మరో 33 ఏళ్లకు దానిని పొడిగించుకునేందుకు అవకాశం కల్పించింది. పదేళ్లకు ఎస్‌జీఎస్‌టీ వందశాతం రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం చేస్తుంది. వీటితోపాటు మరికొన్ని రాయితీలను ప్రభుత్వం నుంచి అందిస్తుంది. ఇక విశాఖలో వరుణ్ నోవోటెల్‌కు కొనసాగింపుగా మరో ఫైవ్‌స్టార్ హోటల్‌తో పాటు డీలక్స్ రూమ్స్ కమ్ సర్వీస్ అపార్ట్‌మెంట్స్ ఏర్పాటుకు వరుణ్ హాస్పిటాలిటీ సంస్థ ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం 899.50 కోట్ల పెట్టుబడి పెడుతోంది. 15ఏళ్లపాటు ఎస్‌జీఎస్‌టీవంద శాతం రీయింబర్స్‌మెంట్, వంద శాతం స్టాంప్ డ్యూటీ రాయితీ ప్రభుత్వం అందించనుంది.
Updated Date - May 23 , 2025 | 06:47 AM