ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Excise Department: ఎక్సైజ్‌లో ఫొటోల డ్యూటీ

ABN, Publish Date - Jun 08 , 2025 | 04:41 AM

రాష్ట్రంలో వైన్స్‌, బార్ల యజమానులు సమయ పాలన పాటించడం లేదు. నగరాలు, పట్టణాల పరిధిలో ఉదయం 5 గంటలకే బార్లను, 8-9 గంటలకే వైన్స్‌ దుకాణాలను తెరుస్తున్నారు. దీనిపై సాధారణ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది.

  • వైన్స్‌, బార్ల సమయ ఉల్లంఘనలపై ఉన్నతాధికారుల ప్రత్యేక చర్యలు

  • ఉదయం 7-10, రాత్రి 10-12 వరకు ఫొటోలు తీయాలని సిబ్బందికి ఆదేశం

  • కానిస్టేబుళ్లకు ‘ఎక్సైజ్‌-ఐ’ చిక్కులు

  • యాప్‌పై సిబ్బందిలో తీవ్ర వ్యతిరేకత

  • మహిళా కానిస్టేబుళ్లకూ ఇదే బాధ్యత

  • కేసుల నమోదుకు మాత్రం దూరం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో వైన్స్‌, బార్ల యజమానులు సమయ పాలన పాటించడం లేదు. నగరాలు, పట్టణాల పరిధిలో ఉదయం 5 గంటలకే బార్లను, 8-9 గంటలకే వైన్స్‌ దుకాణాలను తెరుస్తున్నారు. దీనిపై సాధారణ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్‌ శాఖ.. ‘ఎక్సైజ్‌-ఐ’ పేరిట ఓ యాప్‌ను తీసుకువచ్చింది. ఈ యాప్‌ ద్వారా దుకాణాల ఫొటోలను తీయాలని నిర్దేశించింది. ఈ బాధ్యతను ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లకు అప్పగించారు. అయితే.. ఫొటోలు తీసేందుకు ఉదయం త్వరగా వెళ్లాలన్నా ఫర్వాలేదు కానీ అర్థరాత్రి వరకు తీయించడంపై కానిస్టేబుళ్లలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘ఈ ఉద్యోగం ఎలా చేయగలం?’ అంటూ క్షేత్రస్థాయిలో కానిస్టేబుళ్లు ప్రశ్నిస్తున్నారు. కొందరు రాష్ట్ర ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.


నిబంధనలు ఏమిటి?

నిబంధనల ప్రకారం వైన్స్‌ షాపులను ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు, బార్లను ఉదయం 11 నుంచి రాత్రి 11గంటల వరకు తెరిచి ఉంచాలి. బార్లలో మద్యం అమ్మకాలు రాత్రి 11గంటలతో ముగించినా, ఆ తర్వాత గంటసేపు బార్‌లో ఉన్నవారికి ఆహారం సరఫరా చేయొచ్చు. అయితే ఈ పనివేళల అమలులో ఉల్లంఘనలు జరుగుతున్నాయి. వీటిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ శాఖ ‘ఎక్సైజ్‌-ఐ’ అనే యాప్‌ను రూపొందించింది. గత 2 వారాలుగా దాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రతి ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో ఉదయం, రాత్రి సమయాల్లో పనివేళలకు ముందు, ముగిసిన తర్వాత ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఈ పనిని ప్రతి స్టేషన్‌లో 60 నుంచి 70శాతం మంది కానిస్టేబుళ్లకు అప్పగిస్తున్నారు. ఆ స్టేషన్‌ పరిధిలో ఉన్న అన్ని షాపులు, బార్ల ఫొటోలను ఉదయం, రాత్రి వేళ్లలో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. రాష్ట్రంలో 208 ఎక్సైజ్‌ స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో స్టేషన్‌ పరిధిలో రెండు.. మూడు రెవెన్యూ మండలాలు ఉన్నాయి. ఆ పరిధిలో ఎక్కడ మద్యం షాపు, బార్‌ ఉన్నా కానిస్టేబుల్‌ వెళ్లి ఫొటో తీయాలి. పట్టణాలు, నగరాల్లో పరిధి తక్కువ ఉన్నా షాపులు, బార్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే బార్లు ఉండవు. వైన్స్‌ దుకాణాల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది. అయినా.. స్టేషన్‌ పరిధి విస్తృతంగా ఉంటుంది. ఒక్కో స్టేషన్‌ పరిధిలో 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో షాపులు ఉంటాయి. అక్కడకు వెళ్లి ఫొటోలు తీయడం కానిస్టేబుళ్లకు సవాలుగా మారుతోంది. పలు స్టేషన్ల పరిధిలో మహిళా కానిస్టేబుళ్లకు కూడా ఫొటోల బాధ్యత అప్పగించారు. మందుబాబులు గుమిగూడే ప్రదేశానికి వెళ్లి ఫొటోలు తీయడం, దూర ప్రాంతాలకు ద్విచక్ర వాహనాలపై తిరగడం వారికి ఇంకా కష్టంగా మారింది. మరోవైపు.. ఈ ఫొటోల పనితో ఎక్సైజ్‌ స్టేషన్లలో సాధారణ పని వాతావరణం దెబ్బతింటోంది. సగటున ఒక్కో స్టేషన్‌లో ఏడుగురు కానిస్టేబుళ్లు ఉంటే ఐదుగురికి ఫొటోల డ్యూటీలు అప్పగిస్తున్నారు. ఫొటోలు తీసిన తర్వాత స్టేషన్‌కు వచ్చే కానిస్టేబుళ్లు ఉత్సాహంగా పని చేయలేకపోతున్నామని చెబుతున్నారు.


లైసెన్సీలతో వివాదాలు

రాత్రి 10 గంటలకు షాపు మూసే సమయానికి కానిస్టేబుళ్లు అక్కడకు వెళ్లి ఫొటోలు తీయాలి. ఈ క్రమంలో అప్పుడే ఎందుకు ఫొటోలు తీస్తున్నారంటూ దుకాణ సిబ్బంది కానిస్టేబుళ్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. బార్లతో అయితే ఇంకా తలనొప్పిగా మారింది. నిబంధనల ప్రకారం రాత్రి 11 గంటల వరకే మద్యం అమ్మాలి. కానీ.. బార్‌ను అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచొచ్చు. ఈ క్రమంలో 11 గంటలకు ఫొటోలు తీస్తున్న కానిస్టేబుళ్లతో వ్యాపారులు గొడవపడుతున్నారు. లైసెన్సీలతో షాపులు, బార్లు మూయించాలని అధికారులు చెబుతున్నారు తప్ప, సమయం దాటి తెరిచి ఉంచిన లైసెన్సీలపై కేసులు మాత్రం నమోదు చేయడం లేదు. కేసులు లేనప్పుడు ఎన్ని ఫొటోలు తీస్తే ఉపయోగం ఏంటని కానిస్టేబుళ్లు ప్రశ్నిస్తున్నారు.

అధికారుల అత్యుత్సాహం

కొందరు అధికారుల అత్యుత్సాహం వల్లే ఈ కొత్త విధానాలు తీసుకొచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం దృష్టిలో మంచిపేరు కోసం కొందరు అధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. అలాగే ఎక్సైజ్‌లో కొందరు ఉన్నతాధికారులు ఆదాయంపై మాత్రమే దృష్టిపెడుతున్నారు. ఎలాగైనా అమ్మకాలు పెంచాలంటూ జిల్లాల అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. కొందరు అధికారులు ఒత్తిడి చేయడమే పనిగా పెట్టుకున్నారనే ఆరోపణలూ పెరుగుతున్నాయి. మొత్తంగా ఎక్సైజ్‌ శాఖ పనితీరు గందరగోళంగా మారిందని సిబ్బంది పేర్కొంటున్నారు.

Updated Date - Jun 08 , 2025 | 04:50 AM