Minister Nimmala: కాల్వల పనుల పర్యవేక్షణకు డ్రోన్లు
ABN, Publish Date - May 20 , 2025 | 06:06 AM
సాగునీటి కాల్వల పర్యవేక్షణకు డ్రోన్ల వినియోగానికి చర్యలు చేపట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రూ.10 లక్షల లోపు పనులను నీటి వినియోగదారుల సంఘాలకు అప్పగించనున్నట్లు ప్రకటించారు.
రూ.10 లక్షలలోపు పనులు నీటి సంఘాలకే: మంత్రి నిమ్మల
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): చిన్నతరహా సాగునీటి కాలవలు, ప్రాజెక్టు యాజమాన్య నిర్వహణ పనుల పర్యవేక్షణకు డ్రోన్‌లను వినియోగిస్తామని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. రూ.పది లక్షలలోపు పనులను నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్యలతో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విజయవాడ జల వనరుల శాఖ క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రాజెక్టులు, పంట కాలువల యాజమాన్య నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.344.39 కోట్లు విడుదల చేశారని చెప్పారు. ఈ నెలాఖరులోగా పది లక్షల రూపాయల్లోపు పనులను సాగునీటి సంఘాలు చేపట్టవచ్చని తెలిపారు. డ్రోన్‌లతో పర్యవేక్షణ, గుర్రపు డెక్క తొలగించడం, మందులు చల్లడం వంటి పనులు చేపట్టాలన్నారు. గతంలో వైసీపీ హయాంలో ప్రాజెక్టుల సాధారణ యాజమాన్య నిర్వహణకూ నిధులు కేటాయించలేదని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో జల వనరుల శాఖ విధ్వంసానికి గురైందని.. ఇప్పుడిప్పుడే సాగునీటి రంగాన్ని గాడిలో పెడుతున్నామని తెలిపారు.
Updated Date - May 20 , 2025 | 06:07 AM