ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Deputy CM Pawan Kalyan: ఇది దేశ సమగ్రతపైనే దాడి

ABN, Publish Date - Apr 30 , 2025 | 04:50 AM

పహల్గాం ఉగ్రదాడిని దేశ సమగ్రతపై దాడిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. అమరుడైన జనసైనికుడి కుటుంబానికి రూ.50 లక్షల సాయం ప్రకటించారు.

  • పర్యాటకుల హత్య అత్యంత హేయం

  • కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే

  • ఎవరికైనా పాక్‌పై ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లాలి

  • జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు

  • పహల్గాం అమరులకు ఘన నివాళి

  • జన సైనికుడి కుటుంబానికి 50 లక్షల సాయం

మంగళగిరి సిటీ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అతి హేయమని, అది దేశ సమగ్రతపైనే దాడి అని డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పహల్గాం ఉగ్ర దాడిలో మృతిచెందిన 26 మంది అమరులను స్మరించారు. ఈ దాడిలో మరణించిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు సోమిశెట్టి మధుసూదనరావుకు ఘన నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. క్రియాశీలక సభ్యత్వ బీమా కింద మరో రూ.5 లక్షలు అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.పది లక్షల పరిహారం ప్రకటించిందని, ఇంకా ఏమైనా అదనంగా సాయం చేయగలమేమో పరిశీలిస్తామన్నారు. ఉగ్రవాదం జన సైనికుడిని చంపేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పహల్గాంలో పర్యాటకులను ఉగ్రవాదులు వేటాడి చంపడం అత్యంత హేయం. మధుసూదనరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు కావలి వెళ్లినప్పుడు ఆయన భార్య, పిల్లలు పహల్గాంలో జరిగిన ఘాతుకాన్ని వివరిస్తుంటే హృదయం ద్రవించిపోయింది. ‘ఉగ్రవాదులు హిందువులనే లక్ష్యంగా చేసుకుని చంపేశారు. మేం ముస్లిం అయితే మమ్మల్ని వదిలివేసేవారు. హిందువుగా పుట్టడం మేం చేసిన పాపమా’ అని మధుసూదనరావు భార్య నన్ను ప్రశ్నించారు. కశ్మీర్‌లో అమాయకులపై పేలిన తూటా ప్రకంపనలు దేశమంతా వ్యాపించాయి. హిందువ్వా? ముస్లిమువా? అని అడిగి మరీ కిరాతకంగా తూటాలు దించిన ఉగ్రవాదులపై ఏమాత్రం కనికరం అవసరం లేదు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడానికి దేశమంతా ఏకం కావలసిన సమయం ఆసన్నమైంది.’’ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనన్నారు.


విభిన్న సంప్రదాయాలు, అభిప్రాయాలు ఉండే దేశాన్ని ఏకాభిప్రాయంతో నడపాలంటే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికి ఎంతో కష్టమని, ఆయనకు మన వంతు సహకారం అందిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఇది ఎన్డీఏ భాగస్వామిగా జనసేన బాధ్యత అని చెప్పారు. ‘‘ఇప్పటికి పాకిస్థాన్‌ను మూడుసార్లు ఓడించాం. మనదేశంలో అసలు ఎంతమంది ఏ ముసుగుతో ఉంటున్నారో తెలియని పరిస్థితిలు నెలకొన్నాయి. మనకు సహనం ఎక్కువైంది. మితిమీరిన మంచితనం కూడా దేశానికి మంచిది కాదు.’’ అని పవన్‌ అన్నారు. దేశంలో యుద్ధ పరిస్థితులు రావొచ్చు.. రాకపోవచ్చునని ఆయనఅభిప్రాయపడ్డారు. ‘‘పహల్గాం దాడి తర్వాత కేంద్రం పాకిస్థాన్‌కు నీళ్లు ఆపడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. దేశంలో లౌకికవాదం తీరు ఏమీ బాగాలేదు. 26 మందిని మత ప్రాతిపదికన చంపేస్తే.. సోకాల్డ్‌ సూడో సెక్యులరిస్టులు మాత్రం మతం అడిగి చంపలేదు అంటున్నారు. మధుసూదనరావు భార్య మనకు అబద్ధం చెబుతారా? కొంతమంది భారతదేశంలో కూర్చొని పాక్‌ను ప్రేమిస్తామంటారు. అలాంటి వారు అక్కడికే వెళ్లిపోండి‘ అంటూ ఘాటుగా స్పందించారు. పాకిస్తాన్‌ ఏర్పాటు సమయంలో అందర్నీ సమానంగా ఆదరిస్తామని జిన్నా చెప్పారు. కానీ, ఆనాడు పాక్‌లో రెండు కోట్ల మంది హిందువులు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య కొన్ని లక్షలమందికి పడిపోయింది.’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌, శాసనమండలి ప్రభుత్వ విప్‌ పిడుగు హరిప్రసాద్‌, ఎమ్మెల్సీ నాగబాబు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.


మీరే జనసేనకు ఇంధనం.. ప్రేరణ

జన సైనికులు, వీర మహిళల ఆశయమే తమ పార్టీకి ఇంధనం, ప్రేరణలని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీలో స్వచ్ఛందంగా భాగస్వాములైన వారితో మంగళవారం సాయంత్రం ఆ పార్టీ ప్రధాన కార్యలయంలో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘‘నేను మానవత్వాన్ని నమ్ముతాను. కొన్నిసార్లు కులాలు, మతాల ప్రస్తావన నా మాటల్లో వచ్చినా అంతిమంగా మాత్రం ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటా. విశ్వకవి గుర్రం జాషువా చెప్పినట్టు... విశ్వ నరుడిగా బతకాలని కోరుకుంటా. కులం, మతం, ప్రాంతం దాటి మనిషిగా బతకాలన్నదే నా ఆశయం.’’ అని ఆయన పేర్కొన్నారు. పార్టీ క్రియాశీల సభ్యత్వ బీమా పరిహార సొమ్ముపెంపు అంశంపై బీమా కంపెనీలతో మాట్లాడుతున్నానని పవన్‌ తెలిపారు.

Updated Date - Apr 30 , 2025 | 04:53 AM