CPI Narayana: ప్రత్యేక హోదా ఊసెత్తని ప్రధాని
ABN, Publish Date - May 04 , 2025 | 06:07 AM
ప్రధాని మోదీ అమరావతి అభివృద్ధి కోసం నిధులు ప్రకటించకపోవడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తప్పుపట్టారు. ప్రత్యేక హోదా మరియు అభివృద్ధి పనుల మంజూరుపై సీఎం, డిప్యూటీ సీఎం విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు
రాజధానికీ నిధులు ప్రకటించలేదు
సీఎం, డిప్యూటీ సీఎం అడగనూ లేదు: నారాయణ
తిరుపతి(ఆటోనగర్), మే 3(ఆంధ్రజ్యోతి): అమరావతి పనులను శుక్రవారం పునఃప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఊసెత్తకుండా, రాజధాని అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్లు విడుదల చేయకుండా, ఉత్తుత్తి హామీలు ప్రకటించి వెళ్లారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. తిరుపతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పదేళ్ల కిందట రాజధాని నిర్మాణానికి వేసిన పునాది రాయిని మోదీ గుర్తు చేసుకోకపోవడం అన్యాయమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేత ప్రత్యేక హోదా, అవసరమైన నిధులు, అభివృద్ధి పనుల మంజూరుపై ప్రకటనలు చేయించడంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విఫలమయ్యారని విమర్శించారు.
రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పుగా తీసుకునే రూ.15,000 కోట్లలో 10 శాతానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొంటుందని, మిగిలిన మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సి రావడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలతో సంబంధం లేకుండా ప్రధాని పర్యటన ఒక షోగా ముగిసిందన్నారు. రాష్ట్రంలో పాలకులు మారారు తప్ప అవినీతి విధానాల్లో ఏమాత్రం తేడా లేదని నారాయణ ఆరోపించారు.
Updated Date - May 04 , 2025 | 06:07 AM