High Court: 2 వారాల్లో పూర్తి సమాచారం ఇవ్వండి
ABN, Publish Date - Jul 11 , 2025 | 03:13 AM
రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు ధర్మాసనం ఆదేశం
ఆ సమాచారం ఆధారంగా తాత్కాలిక ఫీజు ఖరారు
అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఫీజులు ఖరారు చేసేందుకు వీలుగా రెండు వారాల్లో నిబంధనల్లో నిర్దేశించిన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ)కు అందజేయాలని కాలేజీల యాజమాన్యాలను ఆదేశించింది. ఈ సమాచారం ఆధారంగా తాత్కాలిక ఫీజు ఖరారు చేయాలని ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీకి స్పష్టం చేసింది. అనంతరం తాత్కాలిక ఫీజు ఖరారు వర్క్‌షీట్లను కాలేజీ యాజమాన్యాలకు అందజేయాలని పేర్కొంది. దీనివల్ల ఫీజుల విషయంలో తమ వాదనలు వినిపించేందుకు కాలేజీలకు అవకాశం ఉంటుందని పేర్కొంది. కాలేజీలు కోరిన ఫీజులో కోత విధిస్తే అందుకుగల కారణాలను ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఫీజు ఖరారు కోసం అవసరమైన సమాచారాన్ని కాలేజీల నుంచి కోరకుండా కమిషన్‌ను నియంత్రిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపట్టింది. ఫీజులు ఖరారు చేసేందుకు కాలేజీల నుంచి సమాచారాన్ని కోరడం తప్పనిసరి అని పేర్కొంది. సెమినార్లు, వర్క్‌షాపులు, గార్డెనింగ్ నిర్వహణ ఖర్చుల విషయంలో కాలేజీలకు ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ పరిమితులు విధించడాన్ని తప్పుబట్టింది. కాలేజీల నుంచి వివరాలు తెప్పించుకొని, ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ ఫీజు ఖరారు చేసి, రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసేవరకు 2023-26 బ్లాక్ పీరియడ్‌కు జీవో 17 ప్రకారం ఖరారు చేసిన ఫీజు తాత్కాలికంగా అమల్లో ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. 2023-26 బ్లాక్ పీరియడ్‌కు ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ ఖరారు చేసిన ఫీజులను సవాల్ చేస్తూ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి మద్దిశెట్టి శ్రీధర్, మరికొన్ని కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఫీజు ఖరారు విషయంలో కమిషన్ వైఖరిని తప్పుబట్టారు. చట్టనిబంధనలు అనుసరించి అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఫీజు ఖరారు చేయాలని కమిషన్‌ను ఆదేశించారు. కాలేజీల నుంచి సమాచారం కోరకుండా కమిషన్‌ను నియంత్రిస్తూ 2023 డిసెంబరు 5న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ హైకోర్టులో అప్పీల్ చేసిన విషయం తెలిసిందే.
Updated Date - Jul 11 , 2025 | 03:13 AM