Corruption: పన్నుల్లో నొక్కుడు
ABN, Publish Date - Jun 29 , 2025 | 05:01 AM
గత వైసీపీ ప్రభుత్వం ఓవైపు వాణిజ్య పన్నుల శాఖలో సంస్కరణల పేరిట జీఎస్టీ ఆదాయానికి గండి పడేలా చేయగా.. మరోవైపు అధికార యంత్రాంగాన్ని కూడా భ్రష్టు పట్టించింది.
వాణిజ్య పన్నుల శాఖలో ఇంకా పాత పోకడలే
వైసీపీ హయాం నాటి అధికారులదే హవా
చీఫ్ కమిషనర్ ఆఫీసులో అంతా అస్మదీయులే
కీలక కమిటీలు, విధుల్లోనూ సొంతవారే
‘రిజిస్ట్రేషన్’ ప్రక్రియా వారి అధీనంలోనే
సెంట్రల్ రిజిస్ట్రేషన్ యూనిట్‌కు కూటమి ప్రభుత్వంలో ఆమోద ముద్ర
శాఖలో యథేచ్ఛగా అక్రమ వసూళ్ల పర్వం
వ్యాపారులతో కుమ్మక్కు.. ఆదాయానికి గండి
కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయినా వాణిజ్య పన్నుల శాఖలో ఇంకా పాత పోకడలు పోలేదు. వైసీపీ హయాంలో నియమితులైన కొందరు అధికారులు ఇంకా చక్రం తిప్పుతున్నారు. చీఫ్ కమిషనర్ ఆఫీసుతో పాటు ఆదాయం వచ్చే కీలక పోస్టుల్లో అందరూ వైసీపీ అస్మదీయులే. పన్నుల వసూళ్లు, తనిఖీల్లో బాధ్యతలూ వారికే. దీంతో యథేచ్ఛగా అక్రమాలు సాగిపోతున్నాయి.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం ఓవైపు వాణిజ్య పన్నుల శాఖలో సంస్కరణల పేరిట జీఎస్టీ ఆదాయానికి గండి పడేలా చేయగా.. మరోవైపు అధికార యంత్రాంగాన్ని కూడా భ్రష్టు పట్టించింది. గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన కొంతమంది ఉన్నతాధికారులు ఇప్పటికీ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో కీలక స్థానాల్లో పాతుకుపోయారు. కూటమి ప్రభుత్వంలో కూడా తమ హవా కొనసాగిస్తున్నారు. తమ ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు కిందిస్థాయి అధికారులు, ఉద్యోగుల్లో వర్గాలను పెంచి పోషిస్తున్నారు. చీఫ్ కమిషనర్ కార్యాలయం మొత్తాన్నీ అస్మదీయులతో నింపేసుకున్నారని, తమ చేతికి మట్టి అంటకుండా అక్రమ వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. వ్యాపారులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా పన్నులు చెల్లించే (టాప్ ట్యాక్స్ పేయర్స్) దాదాపు 200 మంది నుంచి పన్నుల వసూళ్ల కోసమని చీఫ్ కమిషనర్ కార్యాలయంలో 2 ప్రత్యేక సర్కిళ్లను (స్టేట్ సర్కిల్ 1, 2) ఏర్పాటు చేశారు. పన్నుల వసూళ్లకు సంబంధించిన ప్రతి షోకాజ్ నోటీసుకు ముందస్తు అనుమతి కోసం ప్రత్యేకంగా ప్రాంతీయ స్థాయిలో ఒకటి, రాష్ట్ర స్థాయిలో మరొకటి.. రెండు పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ రెండు కమిటీలలోనూ ఉన్నతాధికారులకు అనుకూలంగా పనిచేసే 200 మందిని నియమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
వాహన తనిఖీల విధులూ...
ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా సరుకు అక్రమ రవాణా చేసే వాహనాల తనిఖీలకు కూడా ఉన్నతాధికారులు తమకు అనుకూల అధికారులనే పంపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ అక్రమాలకు అడ్డుగా ఉంటారన్న ఉద్దేశంతో వాహన తనిఖీల విధుల నుంచి జీఎస్టీవోలను తప్పించి.. డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్లను పంపిస్తున్నారని చెబుతున్నారు.
అనధికారికంగా సీఆర్‌యూ..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖ సర్కిల్ కార్యాలయాల్లో నిర్వహించే రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ఆ శాఖ ఉన్నతాధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. జీఎస్టీ చట్టం అమలులోకి వచ్చాక లైసెన్సులు మంజూరు చేయడం మొదలుకొని పన్నుల చెల్లింపు వరకు మొత్తం కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్‌లో సాగించేలా మార్పులు చేశారు. కొత్తగా వ్యాపారం పెట్టాలనుకునేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే చాలు జీఎస్టీ అధికారులు ఎలాంటి పరిశీలన లేకుండానే ఆన్‌లైన్‌లోనే లైసెన్సు మంజూరు చేసేస్తున్నారు. ఈ విధానంలో అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయనే కారణాన్ని బూచిగా చూపించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొత్తాన్ని కేంద్రీకృతం చేస్తూ వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో గత ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీన సెంట్రల్ రిజిస్ట్రేషన్ యూనిట్ (సీఆర్‌యూ)ను అనధికారికంగా ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ కేడర్ల అధికారులతో పాటు అవసరమైన సిబ్బందిని నియమించారు. ఉన్నతాధికారులు తమకు అనుకూలంగా ఉండేవారినే నియమించుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
దూర ప్రాంతాల్లోని వ్యాపారులు రిజిస్ట్రేషన్లతో సహా ప్రతి అవసరానికి చీఫ్ కమిషనర్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. తీరా వచ్చిన తర్వాత ఇక్కడ ఏ అధికారితో తమ పని పూర్తవుతుందో తెలియక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు, విమర్శలు వస్తున్నా గత ప్రభుత్వంలో అనధికారికంగా ఏర్పాటు చేసిన ఈ సీఆర్‌యూను అధికారికంగా కొనసాగించే అంశాన్ని పరిశీలించాలని వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం దానిని నోటిఫై చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గత ప్రభుత్వంలో ఉద్దేశపూర్వకంగా చేసిన విధానపరమైన తప్పిదాలను కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందనే విమర్శలు వస్తున్నాయి.
ఆ పోస్టులను భర్తీ చేయరే?
‘సరైన వ్యక్తులు.. సరైన చోట ఉంటేనే మెరుగైన ఫలితాలు సాధించగలుగుతాం. దీనిపై కసరత్తు చేయండి’ అని ముఖ్యమంత్రి చెబుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే కీలకమైన విశాఖపట్నం 2, విజయవాడ 2 డివిజన్లకు ఏడాది కాలంగా జాయింట్ కమిషనర్లనే నియమించలేదు. రాష్ట్రం మొత్తమ్మీద వచ్చే జీఎస్టీ ఆదాయంలో 40 శాతానికిపైగా ఈ రెండు ప్రధాన నగరాల నుంచే వస్తోంది. ఇంతటి కీలకమైన నగరాల్లో జీఎస్టీ జాయింట్ కమిషనర్ పోస్టులను భర్తీ చేయకపోవడానికి కారణాలేంటో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులే చెప్పాలి. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 16 డివిజన్ కార్యాలయాలు, 109 సర్కిల్ కార్యాలయాల్లో 6 డిప్యూటీ కమిషనర్లు, 30కి పైగా రెగ్యులర్ అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఈ ఖాళీలను భర్తీ చేస్తే.. వాటి పరిధిలో ఉన్న కింది స్థాయి పోస్టులు కూడా ఆటోమేటిక్‌గా భర్తీ అయ్యి పనులు సకాలంలో పూర్తవుతాయి. జీఎస్టీవోలు(ఏసీటీవోలు)గా, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్లుగా 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వారిలో ఇప్పటికీ పదోన్నతులు రానివారు పెద్దసంఖ్యలో ఉన్నారు. విచిత్రమేంటంటే.. జూనియర్, సీనియర్ అసిస్టెంట్లకు 2017 నుంచి ఇప్పటి వరకు కూడా జీఎస్టీ పోర్టల్‌లో పని చేసేందుకు లాగిన్లు కూడా ఇవ్వలేదు. పైఅధికారుల ఐడీలతో లాగిన్ అయ్యి వారు పని చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ లోపాలను సరిద్దేందుకు చర్యలు తీసుకోవాలని పన్నుల శాఖ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Updated Date - Jun 29 , 2025 | 06:59 AM