Commercial tax system: వాణిజ్యం అస్తవ్యస్తం
ABN, Publish Date - Jun 25 , 2025 | 03:09 AM
గత జగన్ ప్రభుత్వం ఇసుకను అందుబాటులో లేకుండా చేసి జనానికి చుక్కలు చూపించింది. సర్కారీ మద్యం పాలసీ అంటూ నాసిరకం ‘జే’ బ్రాండ్లు అమ్మించి పేదల జేబులు గుల్ల చేయడంతో పాటు వారి ఆరోగ్యంతో ఆడుకుంది.
గందరగోళంగా పన్నుల వసూళ్లు.. పెరగని జీఎస్టీ
విధానపరమైన తప్పిదాలతో దుష్ఫలితాలు
అధికారాలన్నీ చీఫ్ కమిషనర్ ఆఫీసులోనే
క్షేత్రస్థాయి ఉద్యోగుల అధికారాలకు కోత
వ్యాపార సంస్థలు, వాహనాల తనిఖీలు,
రిటర్న్‌ల పరిశీలన, ఆడిట్లకు అనుమతి తప్పనిసరి
బాబు ఆదేశాలతోనైనా తప్పిదాలు సరిదిద్దుతారా?
గత సర్కారు ‘సంస్కరణల’తో తిరోగమనం
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఒక్క వాణిజ్య పన్నుల శాఖ ద్వారానే దాదాపు 70 శాతం వస్తుంది. మద్యం, గనులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు.. ఇతరత్రా అంతా కలిపినా మరో 30 శాతం రాబడి మాత్రమే వస్తుంది.
గత వైసీపీ సర్కారు సంస్కరణల పేరుతో వాణిజ్య పన్నుల శాఖను అస్తవ్యస్తం చేసింది. క్షేత్రస్థాయి ఉద్యోగుల అధికారాలకు కత్తెర వేసి కేంద్రీకృతం చేసింది. ఫలితంగా పన్నుల వసూళ్లు గందరగోళంగా మారడంతో ఆశించిన స్థాయిలో జీఎస్టీ ఆదాయం పెరగడం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా సర్కిల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న 1037 మంది జూనియర్ అసిస్టెంట్లకు, 875 మంది సీనియర్ అసిస్టెంట్లకు ఎలాంటి విధులూ కేటాయించలేదు. వీరందరినీ ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు చెల్లిస్తున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): గత జగన్ ప్రభుత్వం ఇసుకను అందుబాటులో లేకుండా చేసి జనానికి చుక్కలు చూపించింది. సర్కారీ మద్యం పాలసీ అంటూ నాసిరకం ‘జే’ బ్రాండ్లు అమ్మించి పేదల జేబులు గుల్ల చేయడంతో పాటు వారి ఆరోగ్యంతో ఆడుకుంది. రివర్స్ టెండరింగ్ పేరిట సాగునీటి ప్రాజెక్టులను, తరగతుల విలీనమంటూ పాఠశాల విద్యను.. ఇలా ఎన్నో వ్యవస్థలను అస్తవ్యస్తం చేసింది.
రాష్ట్ర ఖజానాకు అత్యధిక ఆదాయం తీసుకువచ్చే వాణిజ్య పన్నుల శాఖను కూడా వదల్లేదు. రాష్ట్ర ఆదాయం పెరగకపోవడానికి పన్నుల శాఖలో గత వైసీపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అస్తవ్యస్త విధానాలే ప్రధాన కారణం. రాష్ట్రవ్యాప్తంగా డివిజన్, సర్కిల్ కార్యాలయాల్లో పనిచేసే అధికారుల కార్యనిర్వహణాధికారాలను చట్టవిరుద్ధంగా లాగేసుకుని చీఫ్ కమిషనర్ కార్యాలయంలో కేంద్రీకృతం చేసింది. వ్యాపార సంస్థల తనిఖీలు, వాహనాల తనిఖీలు, రిటర్న్‌ల పరిశీలన, ఆడిట్లకు క్షేత్రస్థాయి అధికారులకు పైనుంచి అనుమతి తప్పనిసరి చేసింది. డివిజనల్, సర్కిల్ వ్యవస్థను నిర్వీర్యం చేసి, అక్కడ పనిచేసే అధికారుల పాత్ర నామమత్రంగా చేసింది. సంస్కరణల పేరిట పన్నుల వసూలు విధానాన్ని గందరగోళంగా మార్చేసింది.
వ్యవస్థ మొత్తం నిర్వీర్యం
వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయం తాడేపల్లిలోని కుంచనపల్లిలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 16 డివిజన్ కార్యాలయాలు, వాటి పరిధిలో 109 సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ సర్కిల్ కార్యాలయాల్లో పనిచేసే ఏసీటీవోలు, డీసీటీవోలు, సీటీవోలదే క్షేత్రస్థాయిలో పన్నుల వసూళ్లలో కీలకపాత్ర. పన్నుల వసూళ్లపై వ్యాపారుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి విజయవాడ, తిరుపతిలో అప్పిలేట్ అథారిటీ కార్యాలయాలు, విశాఖపట్నంలో సేల్స్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ ఉన్నాయి. అయితే 2017లో జీఎ్‌సటీ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి రిజిస్ర్టేషన్లు (లైసెన్సులు), పన్నుల చెల్లింపులు, రిటర్న్‌ల దాఖలు, వే బిల్లులు తదితర కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నుల ఆదాయం మరింత పెంచాలని సంస్కరణల పేరుతో వాణిజ్య పన్నుల శాఖను పునర్వ్యవస్థీకరించింది. రాష్ట్రంలో కొత్తగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో లోకల్ ఆడిట్-ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ముందు నుంచి ఉన్న జోనల్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారుల కార్యనిర్వహణాధికారాలన్నింటినీ ఉన్నతస్థాయిలో కేంద్రీకృతం చేస్తూ రీజనల్ వ్యవస్థను తీసుకువచ్చింది. ఈ నిర్ణయాన్ని అప్పట్లో ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించినా పట్టించుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 16 డివిజన్లు, 109 సర్కిల్ కార్యాలయాలతో కూడిన వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోయింది. ఏసీటీవోలను జీఎస్టీవోలుగా మార్చి, వారికున్న అధికారాలన్నింటినీ పైఅధికారులకు బదలాయించారు.
అమరావతిపై కక్షతో...
అమరావతిని రాజధానిగా గుర్తించకుండా మూడు రాజధానుల నినాదాన్ని అందుకున్న వైసీపీ ప్రభుత్వం.. ఆ ప్రాంతం పరిధిలో వాణిజ్య పన్నుల శాఖ జోనల్ కార్యాలయం ఏర్పాటు చేయకుండా కక్షపూరితంగా వ్యవహరించింది. మిగిలిన మూడు జోన్లలో (తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం) ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ప్రాంతీయ కార్యాలయం లేకుండా చేసింది. గ్రానైట్ క్వారీలు అత్యధికంగా ఉన్న అద్దంకి, చిలకలూరిపేట, రవాణా ఎక్కువగా జరిగే వినుకొండ, రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉండే మాచర్ల సర్కిల్ కార్యాలయాలను కూడా రద్దు చేసేశారు. దీంతో గుంటూరు నుంచి ఒంగోలు వరకు జాతీయ రహదారిపై సుమారు 120 కిలోమీటర్ల పరిధిలో వాణిజ్య పన్నుల శాఖకు చెందిన ఒక్క సర్కిల్ కార్యాలయం కూడా లేకుండా పోయింది. ఆర్థిక లావాదేవీలు పెరుగుతున్న చోట్ల కొత్త సర్కిళ్లను ఏర్పాటు చేయాల్సింది పోయి, ఉన్న సర్కిళ్లను రద్దు చేశారు. దీంతో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గ్రానైట్, ఐరన్ స్ర్కాప్ అక్రమ రవాణాకు కొత్తదారులు ఏర్పాటు చేసినట్లయిందని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలే చెబుతున్నాయి.
అధికారాలన్నీ కొందరి గుప్పిట్లోనే..
పునర్వ్యవస్థీకరణ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సర్కిల్, డివిజన్ కార్యాలయాల అధిపతులకు ఉన్న అధికారాలను బలవంతంగా లాక్కుని విజయవాడ, విశాఖ, తిరుపతిల్లో కొత్తగా ఏర్పాటు చేసిన రీజనల్ కార్యాలయాలకు, కుంచనపల్లిలోని చీఫ్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారులకు కట్టబెట్టారు. ఈ ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా రాష్ట్రంలోని జీఎస్టీ అధికారులు, ఉద్యోగులెవరూ ఏ పనీ చేయడానికి వీల్లేదంటూ చీఫ్ కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఇంతకుముందు సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో నిర్వహించిన రిటర్న్‌ల పరిశీలన, వ్యాపార సంస్థల తనిఖీలు, ఆడిట్లు, వాహన తనిఖీలు.. ఇలా ఏం చేయాలన్నా అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందే. పై అధికారుల అనుమతి లేకుండా కిందిస్థాయి అధికారులు వ్యాపార సంస్థల్లోకి అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా డివిజన్లలో జాయింట్ కమిషనర్లు, సర్కిల్ కార్యాలయాల్లోని అధికారుల పాత్ర నామమాత్రంగా మారిపోయింది. తమ పరిధిలో పన్నుల వసూళ్లు పెంచేందుకు వీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. జీఎస్టీ చట్టం ప్రకారం తమకు ఉన్న అధికారాలను కూడా ఉపయోగించుకోలేని దుస్థితిలో ఉన్నామని సీనియర్ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా చీఫ్ కమిషనర్ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండే గూగుల్ స్ర్పెడ్‌షీట్లను నింపడానికి, రిటర్న్‌లు వేయని వ్యాపారులకు ఫోన్లు చేయడం తప్ప జీఎస్టీవోలకు కార్యాలయాల్లో మరో పని లేకుండా చేశారని తెలిపారు. సర్కిల్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లను ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు వారందరూ సక్రమంగా పనిచేయడం లేదని, కిందిస్థాయి ఉద్యోగులు తప్పులు చేస్తుంటే.. తాము నియంత్రిస్తున్నట్టుగా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి కలరింగ్ ఇస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ అధికారుల తీరు
సీఎం చంద్రబాబు ఆదేశాలకు పూర్తి భిన్నమైన పరిస్థితులు ప్రస్తుతవాణిజ్య పన్నుల శాఖలో నెలకొన్నాయి. విధానపరమైన తప్పిదాలను సరిదిద్దకుండా కేవలం సమీక్షలతో సరిపెడుతున్నారు. ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అధికారులు, ఉద్యోగులే చెబుతున్నారు. ‘కొంతమంది ఉన్నతాధికారులు స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని భాగాలుగా పంచుకుని ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేసేలా కర్రపెత్తనం చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి ప్రతిరోజూ రాత్రి 7 గంటలు దాటిన తర్వాత నుంచి చీఫ్ కమిషనర్, ఇతర ముఖ్య అధికారులు రాష్ట్రంలోని అన్ని డివిజన్ల జాయింట్ కమిషనర్లు, సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ పన్నుల ఆదాయం పెంచాలంటూ రోజువారీ టార్గెట్లు ఇస్తున్నారు. విధానపరమైన తప్పిదాలను సరిదిద్దకుండా సమీక్షలు, పునఃసమీక్షలు ఆదాయాన్ని తెచ్చిపెట్టవు’ అంటూ ఆ శాఖ ఉద్యోగులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. కొంతమంది ఉన్నతాధికారుల మధ్య ఆధిపత్య పోరు, అంతర్గత విభేదాలతో తమ శాఖ అస్తిత్వాన్నే కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్నాయని ఆవేదన చెందుతున్నారు.
చంద్రబాబు దిశానిర్దేశం
‘రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఆదాయాన్ని పెంచుకోగలిగితేనే అభివృద్ధి, సంక్షేమం మరింత మెరుగ్గా చేయగలుగుతాం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దితేనే సమస్యలు తొలగుతాయి. పన్నుల ఎగవేతకు దొడ్డిదారులు మూసేయండి. వ్యవస్థలో లొసుగులను వాడుకుని ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టేవారి పట్ల కఠినంగా వ్యవహరించండి. ఆదాయార్జనలో కీలకమైన విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే అధికారులను నియమించాలి. సరైన వ్యక్తులు, సరైన చోట ఉంటేనే మెరుగైన ఫలితాలు సాధించగలుగుతాం. దీనిపై కసరత్తు చేయ ండి’.. అంటూ ఇటీవల వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
Updated Date - Jun 25 , 2025 | 03:09 AM