Chittoor News: రేకుల ఇంట్లో లింగనిర్ధారణ పరీక్షలు
ABN, Publish Date - May 15 , 2025 | 02:29 AM
చిత్తూరు కలెక్టర్ సుమిత్‌కుమార్ ఒంటరిగా వెళ్లి రేకుల ఇంట్లో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ ఘటనలో 11 మంది గర్భిణులు, 3 మహిళా నిర్వాహకులు అదుపులోకి రాగా, ప్రధాన నిందితుడు పరారయ్యాడు.
ఒంటరిగా వెళ్లి పట్టుకున్న చిత్తూరు కలెక్టర్
అదుపులో 11 మంది గర్భిణులు, ముగ్గురు మహిళా నిర్వాహకులు
చిత్తూరు, మే 14 (ఆంధ్రజ్యోతి): ఓ చిన్న రేకుల ఇంట్లో వారానికి 50 మందికిపైగా గర్భిణులకు అక్రమంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠాను చిత్తూరు కలెక్టర్ సుమిత్‌కుమార్ ఒంటరిగా వెళ్లి పట్టుకున్నారు. బుధవారం జరిగిన ఈ సంఘటనలో 11 మంది గర్భిణులు, ముగ్గురు మహిళా నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల తమిళనాడు వైద్యారోగ్య శాఖ అధికారులు ‘మా ప్రాంతం నుంచి గర్భిణులు పెద్దఎత్తున మీ జిల్లాకు వచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు’ అని చిత్తూరు జల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు సమాచారమిచ్చారు. దీంతో ఆయన రెండు నెలలుగా దీనిపై నిఘా పెట్టారు. చిత్తూరు నగరంలోని భరత్‌నగర్ కాలనీలో ఓ చిన్న రేకుల ఇంట్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని పక్కా సమాచారం అందింది. దీంతో అక్కడికి ఒంటరిగా బయల్దేరిన కలెక్టర్.. ఈ విషయాన్ని ఎస్పీ మణికంఠకు తెలియజేశారు. దీంతో ఆయన రెగ్యులర్ పోలీసులను కాకుండా స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ అనిల్‌ను స్పాట్‌కు పంపించారు. కాసేపటికే ఆర్డీవో శ్రీనివాసులు కూడా అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో పదకొండు మంది గర్భిణుల్ని, ముగ్గురు మహిళా నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకోగా.. ప్రధాన నిందితుడు మాత్రం పరారయ్యాడు. అదుపులోకి తీసుకున్న వారిని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఈ రాకెట్ వెనుక పది మంది ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News
Updated Date - May 15 , 2025 | 02:29 AM