Liquor Scam: చెవిరెడ్డి అరెస్టు
ABN, Publish Date - Jun 18 , 2025 | 03:44 AM
రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో మరో కీలక సూత్రధారి, మాజీ సీఎం జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు.
విదేశాలకు పారిపోతుండగా అదుపులోకి
లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం
బెంగళూరు ఎయిర్‌పోర్టులో నాటకీయంగా అరెస్టు
జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు
కేసులో 38వ నిందితునిగా చేర్చిన సిట్
దేశం దాటిపోయేందుకు ప్రయత్నం
బినామీ వెంకటేశ్‌నాయుడితో కలిసి పథకం!
శ్రీలంక వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు
అప్పటికే లుకౌట్ నోటీసులిచ్చిన సిట్
వారిద్దరినీ అరెస్టుచేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు
వారి సాయంతో అదుపులోకి తీసుకున్న సిట్
నేడు విజయవాడ ఏసీబీ కోర్టుకు..
అమరావతి, బెంగళూరు, జూన్ 17(ఆంధ్రజ్యోతి): రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో మరో కీలక సూత్రధారి, మాజీ సీఎం జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. విదేశాలకు పరారవుతుండగా చెవిరెడ్డిని అత్యంత నాటకీయంగా బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడకు తరలించారు. బుధవారం ఏసీబీ కోర్టులో వైసీపీ నేతను ప్రవేశపెట్టనున్నారు. లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా ఒక్కొక్క అనుమానితుడిని పిలిచి సిట్ అధికారులు విచారించడంతో మద్యం ముడుపులతో చెవిరెడ్డికి ఉన్న లింకులు బయటికొచ్చాయి. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని కేసులో 38వ నిందితునిగా చేర్చారు. దీంతో అరెస్టు తప్పదని భావించిన ఆయన, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన తన మిత్రుడు, బినామీ వెంకటేశ్‌నాయుడుతో కలిసి పక్కా పథకం రచించారు. ఇద్దరూ విదేశాలకు పరారయ్యేందుకు సిద్ధమయ్యారు. ముందు శ్రీలంకకు వెళ్లి అటు నుంచి ఇతర దేశాలకు వెళ్లిపోయేందుకు రహస్యంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ముందే ఈ విషయం పసిగట్టిన సిట్ అధికారులు చెవిరెడ్డి, వెంకటేశ్‌నాయుడులపై ఎల్‌వోసీ (లుకౌట్ నోటీసు) జారీ చేసింది. ఈ విషయం తెలియని చెవిరెడ్డి, వెంకటేశ్‌నాయుడు తమ పధకంలో భాగంగా మంగళవారం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎయిర్‌పోర్టులోనే వారిద్దరినీ నిర్బంధించి ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సిట్ అధికారుల బృందం బెంగళూరుకు చేరుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకుంది.
రూ.కోట్ల నగదు అభ్యర్థులకు పంపిణీ..
గత ఎన్నికల్లో తన అభ్యర్థులను గెలిపించుకోవడానికి అప్పటి అధికార వైసీపీ మద్యం ముడుపులను వాడినట్టు సిట్ గుర్తించింది. ఎన్నికల సందర్భంగా రూ.ఎనిమిది కోట్లు ప్రకాశం జిల్లాలోని ఒక అసెంబ్లీ అభ్యర్థికి ఇచ్చేందుకు తీసుకెళ్తుండగా ఈసీ పట్టుకుంది. అప్పట్లో ఆ డబ్బులను సీజ్ చేసిన తహశీల్దారు మొదలుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహన డ్రైవర్, గన్‌మ్యాన్, వ్యక్తిగత సహాయకుడి వరకు అందరినీ పిలిపించి సిట్ అధికారులు ప్రశ్నించారు. ఆ రూ.8 కోట్లు తనవంటూ అప్పట్లో చెవిరెడ్డి మిత్రుడు, బినామీ వెంకటేశ్ నాయుడు ఆధారాలు చూపించి వెనక్కు తీసేసుకున్నారు. అవి లిక్కర్ ముడుపులేనని తాజాగా తేలడంతో వెంకటేశ్‌నాయుడిని సిట్ విచారించింది. ఆయనను ఈ కేసులో 34వ నిందితునిగా చేర్చింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు, కోడ్ రాష్ట్రంలో అమలులోఉండగా రాజ్ కసిరెడ్డి (ఏ1) నుంచి సుమారు రూ.285కోట్ల వరకూ పలు దఫాలుగా, పలు ప్రాంతాలనుంచి చెవిరెడ్డి తీసుకుని ఐదుచోట్ల నిల్వ చేశారని సిట్ గుర్తించింది. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పలువురు వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుల కోసం ఆ డబ్బులు పంచినట్లు తేలింది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా తన కోసమూ ఆ ముడుపులు ఖర్చుచేసిన భాస్కర్ రెడ్డి, తన కుమారుడు మోహిత్‌రెడ్డి కోసం చంద్రగిరిలోనూ వాటిని ఖర్చు చేసినట్టు సిట్ ఆధారాలు సేకరించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డితోపాటు ఆరుగురిని ఇటీవల నిందితులుగా చేర్చి, కోర్టులో వారిపై మెమో దాఖలుచేసింది.
డ్రైవర్లు, చిన్న ఉద్యోగులతో నగదు తరలింపు
ఏపీ బేవరేజస్ కార్పొరేషన్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి బాలాజీ యాదవ్‌ను ఏ-35గా నిందితుల జాబితాలో చేర్చింది. అలాగే, చెవిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు నవీన్ ఏ-36, ఆయన వాహన డ్రైవర్ హరీశ్ ఏ-37, చెవిరెడ్డి కుమారుడు, మోహిత్ రెడ్డిని ఏ-39గా చేర్చింది. చెవిరెడ్డికి బాలాజీ యాదవ్ అత్యంత నమ్మకస్థుడు. తుడా ఆఫీసులో ఉన్న బాలాజీని ఏపీ స్టేట్ బేవరేజస్ కార్పొరేషన్‌లోకి తెచ్చి...ఎప్పటికప్పుడు మద్యం వ్యాపార వివరాలు (ఏ1) రాజ్ కసిరెడ్డికి అందించే బాధ్యతను ఆయనకు అప్పగించింది చెవిరెడ్డేనని సమాచారం. డబ్బులు ఎవరెవరికి ఎంత, ఎక్కడ అందజేయాలనేది నవీన్‌కు చెప్పి, ఆయనతో చెవిరెడ్డి ఆ పనులు చేయించినట్టు సిట్ గుర్తించింది. పలుమార్లు డబ్బులు తీసుకొచ్చిన వాహనానికి డ్రైవర్‌గా వ్యవహరించిన హరీశ్‌ను కేసులో నిందితుడిగా చేర్చింది. లిక్కర్ ముడుపులను చంద్రగిరి ఎన్నికల్లో పంచిన మోహిత్ రెడ్డిని కూడా నిందితుల జాబితాలో చేర్చింది.
ముడుపులు కట్టారిలా..
వైసీపీ ప్రభుత్వంలో కీలక నేత, జగన్ దంపతుల వద్దకు ఏకంగా తిరుమల వెంకటేశ్వర స్వామినే తీసుకొచ్చేంత భక్తి చూపించిన చెవిరెడ్డికి ఆరు జిల్లాల్లో ఎన్నికల బాధ్యతను వైసీపీ అధినేత అప్పట్లో అప్పగించారు. ఎప్పటికప్పుడు ఎన్నికల సర్వేలు చేస్తూ ఎక్కడెక్కడ అభ్యర్థులు ఎలా ఉన్నారో అధ్యక్షుడికి చెవిరెడ్డి నివేదికలు ఇచ్చేవారు. జగన్ కుటుంబంతో బంఽధుత్వం కలుపుకొనే స్థాయికి వీరి బంధం చేరినట్లు ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లోనే తన కుమారుడు మోహిత్ రెడ్డికి చంద్రగిరి అసెంబ్లీ టికెట్‌ను ఇప్పించుకున్నారు. చెవిరెడ్డికి ఒంగోలు ఎంపీ అభ్యర్థిత్వానికి బీ ఫారమ్ జగన్ ఇచ్చారు. దీనితోపాటు పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులను గెలిపించే బాధ్యతను కూడా చెవిరెడ్డికే అప్పగించారు. అందుకు అవసరమైన ధనం హైదరాబాద్‌లో తీసుకోవాలని సూచించారు. దీంతో (ఏ1) రాజ్ కసిరెడ్డి నుంచి రూ.కోట్లు అందుకుని టార్గెట్ జిల్లాల్లోని పలువురు వైసీపీ అభ్యర్థులకు చెవిరెడ్డి పంపిణీ చేసినట్లు సిట్ గుర్తించింది.
Updated Date - Jun 18 , 2025 | 06:44 AM