రెవెన్యూ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి: బొప్పరాజు
ABN, Publish Date - May 11 , 2025 | 06:22 AM
రెవెన్యూ ఉద్యోగులు అధికారి, నాయకుల ఒత్తిడితో తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల రక్షణకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని, న్యాయమైన డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
అనంతపురం టౌన్, మే 10 (ఆంధ్రజ్యోతి): ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు తీసుకుంటున్న నిర్ణయాలను అమలు చేసే క్రమంలో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు తీవ్రమానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఏపీ అమరావతి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆక్రమణలకు సంబంధించి కోర్టు ధిక్కరణ కేసులు నమోదైతే రెవెన్యూ ఉద్యోగులు ముద్దాయిలుగా మారుతున్నారని, గుంటూరు ఘటనలో డిప్యూటీ కలెక్టరు తాతా మోహన్‌రావు ఇలాగే బలైపోయారని పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగుల రక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. రెవెన్యూ విధుల నిర్వహణకు సరిపడా నిధులు మంజూరు చేయాలని, ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలపట్ల వివక్ష చూపడం సరికాదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా పీఆర్‌సీ కమిటీని ప్రకటించకపోవడం బాధ కలిగిస్తోందని, ఇప్పటికైనా ఉద్యోగుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Updated Date - May 11 , 2025 | 06:26 AM