Speaker Chintakayala Ayyanna: వారం కాదు... సభ 60 రోజులు జరగాలి
ABN, Publish Date - Jul 24 , 2025 | 05:01 AM
అసెంబ్లీ సమావేశాలంటే వారం, పది రోజులు కాదు. కనీసం సంవత్సరానికి 60 రోజులు కచ్చితంగా జరగాలి.
అప్పుడే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయి
తిరుపతిలో సెప్టెంబరు 14, 15 తేదీల్లో జాతీయ మహిళా సాధికారత సదస్సు: అయ్యన్న
తిరుపతి(కలెక్టరేట్), జూలై 23(ఆంధ్రజ్యోతి): ‘అసెంబ్లీ సమావేశాలంటే వారం, పది రోజులు కాదు. కనీసం సంవత్సరానికి 60 రోజులు కచ్చితంగా జరగాలి. ఆ 60 రోజుల్లోనూ రాష్ట్ర ప్రజల సమస్యలు, సంక్షేమం పట్ల చర్చ ఉండాలి. దురదృష్టమేమిటంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు తక్కువ సమయం జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు’ అని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. తిరుపతిలో సెప్టెంబరులో జరగనున్న జాతీయ మహిళా సాధికారత సదస్సు నిర్వహణపై బుధవారం ఆయన కలెక్టరేట్‌లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కలసి జిల్లా యంత్రాంగంతో సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘అసెంబ్లీ సమావేశాల్లో గతంలోలా మార్పులు రావాల్సి ఉంది. ఇటీవల స్పీకర్ల సదస్సులో నేను, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ విషయంపై మాట్లాడుకున్నాం. పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకెళ్లాం. నేను 1983లో ఎన్టీఆర్ హయాం నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉన్నా. ఆ రోజు ల్లో అసెంబ్లీ ఉదయం 10 గంటలకు ప్రారంభమైతే అర్ధరాత్రి 2 గంటల వరకూ సమావేశాలు జరిగేవి. ఒకసారి ఎన్టీ రామారావు హయాంలో తెల్లవారుజామున 3 గంటల వరకూ అసెంబ్లీ సమావేశం జరిగింది. నేడు కొన్ని గంటల్లోనే సమావేశాలు ముగుస్తుండటం దురదృష్టకరం. తిరుపతి వేదికగా సెప్టెంబరు 14, 15 తేదీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జాతీయ మహిళా సాధికారత సదస్సు నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా అసెంబ్లీల నుంచి, పార్లమెంట్ నుంచి ఉమెన్ కమిటీ ప్రతినిధులు వస్తారు.’ అని స్పీకర్ తెలిపారు. అంతకుముందు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎంతో నష్టపోయిన రాష్ట్రం అభివృద్ధివైపు అడుగులేస్తోందన్నారు. డిప్యూటీ స్పీక ర్ రఘురామకృష్ణరాజు కూడా స్వామిసేవలో పాల్గొన్నారు.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!
Updated Date - Jul 24 , 2025 | 05:01 AM