AP Weather: నేడు, రేపు వర్షాలు
ABN, Publish Date - May 20 , 2025 | 05:57 AM
వడగాడ్పులకు ఊరటగా కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. మే 21 తరువాత అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి నైరుతి రుతుపవనాలు ముమ్మరంగా విస్తరించనున్నాయి.
విశాఖపట్నం, అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): తీవ్రమైన వడగాడ్పులతో అల్లాడిన రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చేలా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా కోస్తాంధ్రను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకూ, మధ్యప్రదేశ్ నుంచి మరట్వాడా, కర్ణాటక మీదుగా రాయలసీమ వరకూ వేర్వేరుగా ఉపరితల ద్రోణులు విస్తరించాయి. వీటి ప్రభావంతో సముద్రం నుంచి వచ్చే తేమగాలులు, వాయువ్య భారతం నుంచి వీచే పొడిగాలుల కలయికతో రాష్ట్రంలో పలుచోట్ల సోమవారం ఉదయం ముసురు వాతావరణం నెలకొంది. తర్వాత పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. మంగళ, బుధవారాల్లో రాయలసీమలో పలుచోట్ల, కోస్తాలో ఎక్కువచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఏయే జిల్లాల్లో....
మంగళవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, ఉభయగోదావరి, కొనసీమ,కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
మరిన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరణ
నైరుతి రుతుపవనాల విస్తరణకు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా మారింది. రానున్న రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం నుంచి ఈశాన్య బంగాళాఖాతం మధ్య గల మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి.కాగా, ఈనెల 21వ తేదీన కర్ణాటకకు ఆనుకుని అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో 22న తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి తర్వాత ఉత్తరంగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. మే 27వ తేదీన కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయి.
Updated Date - May 20 , 2025 | 05:57 AM