Polavaram project: బనకచర్లపై కేంద్రాన్ని కలుద్దాం
ABN, Publish Date - Jun 25 , 2025 | 04:34 AM
రాష్ట్రానికి ‘గేమ్ చేంజర్’గా మారనున్న పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకాన్ని ఆమోదించాలని కేంద్రాన్ని కోరేందుకు ఢిల్లీకి ప్రత్యేక బృందాన్ని పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిశ్చయించింది.
పత్యేక బృందంగా వెళ్లాలని మంత్రివర్గం నిర్ణయం
అటు కేంద్రానికి స్పష్టత ఇస్తూనే తెలంగాణతో సంప్రదింపులకూ సై
ఈ పథకంతో నష్టం లేకున్నా బీఆర్‌ఎస్ రాజకీయ రాద్ధాంతం
వాస్తవాలతో తెలుగు ప్రజలకుఅవగాహన కల్పిద్దాం: సీఎం
సీఎం సారథ్యంలో వెళ్తారా.. మంత్రి నేతృత్వంలోనా?
లోకేశ్‌ను పంపాలన్న ప్రతిపాదనపైనా చర్చ
తుది నిర్ణయం తీసుకోని సీఎం
అమరావతి, జూన్ 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి ‘గేమ్ చేంజర్’గా మారనున్న పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకాన్ని ఆమోదించాలని కేంద్రాన్ని కోరేందుకు ఢిల్లీకి ప్రత్యేక బృందాన్ని పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిశ్చయించింది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఏ మాత్రం నష్టం లేకపోయినా అక్కడి ప్రతిపక్షం బీఆర్‌ఎస్ లేనిపోని రాద్ధాంతం చేస్తోందని అభిప్రాయపడింది. ఈ అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అవగాహన కల్పించాలని నిశ్చయించింది. బనకచర్ల పథకంపై కేంద్రానికి స్పష్టతను ఇస్తూనే.. తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపుల ప్రక్రియను చేపట్టేందుకూ సంసిద్ధత వ్యక్తంచేసింది. మంగళవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన క్యాబినెట్ భేటీలో బనకచర్ల, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రత్యేక చర్చ జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, విద్యామంత్రి లోకేశ్ తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఇప్పటికే కేంద్రానికి నివేదిక సమర్పించినందున మరోసారి ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక, జలశక్తి మంత్రులు నిర్మలా సీతారామన్, సీఆర్ పాటిల్‌కు లేఖ రాయాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే.. ఈ పథకంపై తెలంగాణ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాజకీయ పోరాటం చేస్తున్నందున.. మనమూ కేంద్రం వద్దకు ప్రత్యేక బృందంగా వెళ్లి అభ్యర్థనలు అందించడమే మేలని పయ్యావుల చెప్పారు. ఈ సూచనతో ముఖ్యమంత్రి ఏకీభవించారు. దరిమిలా బనకచర్ల పథకంపై సమగ్ర సమాచారంతో మరోసారి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. అయితే.. చంద్రబాబు సారథ్యంలో వెళ్లాలా.. గతంలోలా పయ్యావుల కేశవ్ వెళ్లినట్లుగా ఈసారి కూడా మంత్రిని రాష్ట్ర ప్రతినిధిని పంపుతారా అనేదానిపై సీఎం తుది నిర్ణయం తీసుకోలేదు. మంత్రి లోకేశ్ నేతృత్వంలో మంత్రుల బృందాన్ని ఢిల్లీ పంపాలన్న అంశమూ పరిశీలనకు వచ్చింది.
పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంతో ఎగువ రాష్ట్రమైన తెలంగాణకు ఎలాంటి నష్టం లేకున్నా బీఆర్‌ఎస్ రాజకీయ రాద్ధాంతం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ అంశాన్ని వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు సాగదీసే యోచనలో ఆ పార్టీ ఉందని.. బనకచర్లను బీఆర్‌ఎస్ ఎన్నికల దాకా సాగదీసి.. లబ్ధిపొందాలన్న యోచనలో ఉందని కొందరు మంత్రులు అన్నారు. పోలవరం ప్రాజెక్టు తర్వాత ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి ఏటా 3 వేల టీఎంసీలు వృధాగా కలిసిపోతున్నాయన్నారు. అత్యంత విలువైన గోదావరి జలాలు నిష్కారణంగా సముద్రంలో కలసి ఉప్పునీరుగా మారిపోతున్నాయని పేర్కొన్నారు. అలా కడలిపాలయ్యే నీటిలో 200 టీఎంసీలను రాయలసీమకు తరలించాలని సంకల్పిస్తే.. తమకు నష్టం లేకపోయినా తెలంగాణకు చెందిన పార్టీలు రాజకీయ బూచిగా చూపే ప్రయత్నం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. వరద సమయంలో రోజుకు రెండు టీఎంసీల చొప్పున వంద రోజులు పాటు పోలవరం నుంచి బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌కు ఎత్తిపోసే ఈ పథకానికి సంబంధించిన ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక (ప్రి-ఫీజిబిలిటీ రిపోర్టు)ను కేంద్రానికి అందజేశామని.. కేంద్రం కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని మంత్రులు ప్రస్తావించారు. కేంద్ర అటవీ-పర్యావరణ అనుమతులు వచ్చాకే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుతో ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని.. ఈ పథకాన్ని చేపట్టడం వల్ల ఎగువ రాష్ట్రాల జల సమస్యలూ పరిష్కారమయ్యే వీలుందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో.. ఈ ప్రాజెక్టుపై మీడియాతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని మంత్రులకు సీఎం స్పష్టం చేశారు. ఈ పథకం నిర్మించడం వల్ల తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టమూ వాటిల్లదని వివరించాలన్నారు. దీనిపై రాజకీయ రాద్ధాంతం చేయడం ద్వారా తెలంగాణ ప్రజల్లో మళ్లీ సెంటిమెంటు రెచ్చగొట్టాలని బీఆర్‌ఎస్ చూస్తోందని మంత్రులు చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నామని కూడా అసత్య ప్రచారం చేస్తోందన్నారు.
బనకచర్లకు తరలించేది.. కడలిపాలయ్యే వరద నీటినే!
జల వనరుల శాఖ ప్రకటన
గోదావరి వరద జలాలను రాయలసీమ గేట్‌వే బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌కు తరలించే ప్రతిపాదనతో ఎగువ రాష్ట్రమైన తెలంగాణకు ఎలాంటి నష్టమూ వాటిల్లదని రాష్ట్ర జల వనరుల శాఖ స్పష్టం చేసింది. సదరు పథకంపై మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పథకంతో 80 లక్షల మందికి మంచినీరు, కొత్తగా 7.41 లక్షల ఎకరాలకు సాగునీరు, 9.14 లక్షల హెక్టార్లకు సాగునీటి స్థిరీకరణ జరుగుతుందని పేర్కొంది. ‘గోదావరి నది నుంచి సముద్రంలోకి వృధాగా కలిసిపోతున్న వరద నీటిని వరద కాలంలో రోజుకు 2టీఎంసీల చొప్పున 200 టీఎంసీలను పోలవరం నుంచి బనకచర్లకు ఎత్తిపోస్తాం. దీనివల్ల కరువు సీమను సస్యశ్యామలం చేసే వీలుంది. గోదావరి నుంచి ఏటా 3,000 టీఎంసీలు సముద్రంలో కలసిపోతున్న నేపథ్యంలోనే పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం తలపెట్టాం. దీనివల్ల ఎగువ రాష్ట్రానికి ఒక్క టీఎంసీ కూడా జలనష్టం జరగదు’ అని తెలిపింది.
అనుసంధానంతో ఉపయోగమిదీ..
పోలవరం ప్రాజెక్టు నుంచి వరద నీటిని రాయలసీమలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు కీలకమైన బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలిస్తారు. ఇది రాయలసీమలో నీటి సరఫరాకు కీలకమైనది. ఈ ప్రాంతంలోని శ్రీశైలం కుడి కాలువ, (ఎస్‌ఆర్‌బీసీ), గాలేరు-నగరి, తెలుగుగంగ, కర్నూలు-కడప కెనాల్, సోమశిల, కండలేరు ప్రాజెక్టులకు గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు దోహదపడుతుందని జలవనరుల శాఖ తెలిపింది. ఈ ప్రాజెక్టుకు 3,377 మెగావాట్ల విద్యుత్ అవసరమని వెల్లడించింది.
పోలవరం పనుల పురోగతిపై సంతృప్తి
కేబినెట్ భేటీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపైనా చర్చ జరిగింది. ఈ నెల 28(శనివారం) నాటికి డయాఫ్రం వాల్ పనులు సంక్లిష్ట ప్రాంతాల్లో పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యాం గ్యాప్-1 పనులు జోరందుకుంటాయని, దీని మోడల్ డిజైన్‌ను కేంద్ర జలసంఘం, పీపీఏ పరిశీలించాయని వివరించారు. ఈసీఆర్‌ఎఫ్ నిర్మాణ డిజైన్లు నాలుగింటిలో రెండింటిని జల సంఘం ఆమోదించిందని చెప్పారు. మిగిలిన రెండిటినీ శనివారం నాటికి ఆమోదించే వీలుందన్నారు. లక్ష్యం మేరకు ప్రాజెక్టు పనులను 2027నాటికి పూర్తి చేస్తామని జలవనరులశాఖ భరోసా ఇచ్చింది. బనకచర్ల అనుసంధానం.. పోలవరం ప్రగతిపై ప్రజలకు అవగాహనకలిగేలా ఒక నోట్ విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.
Updated Date - Jun 25 , 2025 | 04:34 AM