YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి
ABN, Publish Date - Jul 24 , 2025 | 03:18 PM
జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ జరుపుతున్న సిట్ పద్దతి చూస్తే.. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందన్నారు వైఎస్ షర్మిల. డిస్టలరీలు వద్ద నుంచి కమీషన్లు, బినామీలు, నగదు రవాణా తదితర అంశాలతోపాటు వైఎస్ జగన్‌కు నెలకు రూ.60కోట్లు అందేవని సిట్ అధికారులు వెల్లడించారని తెలిపారు.
విజయవాడ, జులై 24: గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వెనుక దాగి ఉన్న కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని కూటమి ప్రభుత్వాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విలేకర్లతో మాట్లాడుతూ మద్యం కుంభకోణంపై స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో మద్యం కుంభకోణంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)పైనా విమర్శలు గుప్పించారు.
సిట్ పద్దతి చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందన్నారు షర్మిల. డిస్టలరీల వద్ద కమీషన్‌లు, బినామీలు, నగదు రవాణా అంశాలతోపాటు వైఎస్ జగన్‌కి నెలకు రూ.60కోట్లు అందేవని మాత్రమే సిట్ అధికారులు చెబుతున్నారన్నారు. దీంతో మద్యం కుంభకోణంలో తయారీ నుంచి చివర విక్రయాల వరకు అవినీతి జరిగిందనేది అర్థమవుతుందని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో సైతం కేవలం నగదు రూపంలో మద్యం విక్రయాలు జరిపారని చెప్పారు.
కేవలం బ్లాక్ మనీ కోసమే డిజిటల్ పేమెంట్లను నిలిపి వేశారని షర్మిల ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నాటి ప్రభుత్వం చేసిన ఆర్ధిక నేరంగా ఈ మద్యం విక్రయాలను ఆమె అభివర్ణించారు. రూ.3,500కోట్ల మద్యం కుంభకోణం ఒక్కటే కాదు.. పన్నులు ఎగ్గొట్టాలనే క్యాష్ పరంగా ఈ విక్రయాలు జరిపారని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. చివరకు నాన్ డ్యూటీ పేమెంట్లు మొత్తం బ్లాక్‌లోనే జరిగాయని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని సీఎం చంద్రబాబును ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో బ్రాండ్ లిక్కర్లను నిలిపివేసి చీప్ లిక్కర్ తయారీని ఎందుకు ప్రోత్సహించారని వైసీపీ అగ్రనేతను వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నించారు. ఇదంతా కుట్రలో భాగంగా జరిగిందన్నారు. గత ఐదేళ్లలో ముప్పై లక్షల మందికి కిడ్నీ సమస్యలు వచ్చాయని.. మరో ముప్పై వేల మందికి పైగా చీప్ లిక్కర్ కారణంగా చనిపోయారని చెప్పారు. కోట్లాది మంది ప్రజలు ఏదో ఒక రూపంలో అనారోగ్యం బారిన పడ్డారని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై దృష్టి పెట్టాలని సిట్‌తోపాటు సీఎం చంద్రబాబుకు సూచించారు.
నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత అమ్మారో తేల్చాలన్నారు. డిజిటల్ పేమెంట్ ఆపడం వెనుకే అవినీతి ఉందన్నారు. వీటన్నింటికి వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని ఈ విలేకర్ల సమావేశంలో నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి కేవలం క్యాష్ విధానం ఎందుకు అమలు చేశారో ప్రజలకు చెప్పాలని తన అన్న, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు సూచించారు. నాసి రకం బ్రాండ్‌లకు ఎందుకు అనుమతి ఇచ్చారో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఈ మద్యం వ్యవహారంలో తనకు అనుకూలంగా ఉన్న అంశాలనే వైఎస్ జగన్ తరచూ చెబుతున్నారని చెప్పారు.
రుషికొండను ఎందుకు తవ్వారో కూడా ఇంతవరకు వైఎస్ జగన్ సమాధానం చెప్పలేదన్నారు. వివేకా హత్యలో సాక్షి పత్రిక హార్ట్ ఎటాక్ అని ఎందుకు చెప్పిందో తెలియలేదన్నారు. జగన్ అసలు అంశాలను మరుగున పెట్టి.. మభ్యపెట్టి మాట్లాడటంలో దిట్ట అని వైఎస్ షర్మిల తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎవరికీ బి టీమ్ కాదన్నారు. ప్రధాని మోదీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా దత్త పుత్రుడుగానే ఉన్నారని వ్యంగ్యంగా అన్నారు. వైఎస్ఆర్ వ్యతిరేకించిన బీజేపీకి వైఎస్ జగన్ ఊడిగం చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అనేక ప్రాజెక్టులను అదానీకి వైఎస్ జగన్ అడ్డగోలుగా కట్టెబెట్టారని గుర్తు చేశారు. బీజేపీకి వైఎస్ జగన్ ఎప్పటికీ దత్త పుత్రుడేనని వైఎస్ షర్మిల కుండబద్దలు కొట్టారు.
2 నెలల్లో ఓఆర్‌ఆర్ ఆర్థిక ప్రతిపాదనలు!
For More AndhraPradesh News And Telugu News
Updated Date - Jul 24 , 2025 | 05:56 PM